Virat Kohli: కోహ్లీ తప్పుకోవడం సరైన నిర్ణయమే: బ్రాడ్‌హాగ్

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌ నుంచి కెప్టెన్‌గా తప్పుకోవడం సరైన నిర్ణయమేనని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్‌హాగ్‌ అన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్లో కోహ్లీ కెప్టెన్సీపై స్పందించి...

Published : 18 Sep 2021 01:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌ నుంచి కెప్టెన్‌గా తప్పుకోవడం సరైన నిర్ణయమేనని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్‌హాగ్‌ అన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో కోహ్లీ కెప్టెన్సీపై స్పందించాడు. మూడు ఫార్మాట్లలో కోహ్లీ సారథ్యం వహిస్తున్నందున పనిభారం పెరిగిందని, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటే.. బ్యాట్స్‌మన్‌గా రాణించడం తేలికవుతుందని మాజీ స్పిన్నర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

‘కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందేనని నేను భావిస్తున్నా. టీమ్‌ఇండియాకు మూడు విభాగాల్లో కెప్టెన్సీ చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. ఒకవేళ అతడు బాగా ఆడితే అంతా సవ్యంగా సాగుతుంది. అదే విఫలమైతే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటాడు. ప్రతి ఒక్కరూ అతడిని తిట్టిపోస్తారు. అతడు ఒత్తిడిని తట్టుకొని ఆడుతున్నాడు. అయితే, చివరిసారి ప్రపంచకప్‌కు నాయకత్వం వహించి కోహ్లీ జట్టు విజయం సాధించి కప్పు అందుకునే ఒక అవకాశం ఉన్నందున సంతోషంగా ఉంది’ అని బ్రాడ్‌ పేర్కొన్నాడు.

మరోవైపు కోహ్లీ గత ఐదు సిరీస్‌ల్లో రాణించలేకపోయాడని, ఈ విషయాన్ని అతడు కూడా అర్థం చేసుకున్నాడని ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టు ఇంగ్లాండ్‌లో ఐదో టెస్టు ఆడకపోవడంపై అందరూ విమర్శిస్తున్నారని, అయినా.. టీమ్‌ఇండియా సరైన నిర్ణయమే తీసుకుందని మద్దతిచ్చాడు. కోహ్లీసేన టెస్టు క్రికెట్‌కు విలువ ఇస్తున్నందునే ఈ ఫార్మాట్‌లో ఆధిపత్యం చలాయించాలని చూస్తోందని బ్రాడ్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని