Virender Sehwag: ధోనీని ఎవరూ చేరుకోలేరు.. అతడు వచ్చే ఏడాది కూడా ఆడాలి: సెహ్వాగ్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా మహేంద్రసింగ్‌ ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడాలని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అతడు ఆ జట్టుకు చేయాల్సింది ఇంకా ఉందన్నాడు...

Published : 18 Oct 2021 01:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా మహేంద్రసింగ్‌ ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడాలని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అతడు ఆ జట్టుకు చేయాల్సింది ఇంకా ఉందన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన వీరూ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతడిని ఏ సారథీ అందుకోలేడని అన్నాడు.

‘చెన్నై సూపర్‌ కింగ్స్‌ అనేది అద్భుతమైన జట్టు. టీమ్‌ఇండియాలో ఎవరూ ధోనీని అధిగమించలేరు. అలాగే చెన్నై జట్టులోనూ ఏ సారథీ అతడిని చేరుకోలేడు. అదంత తేలికకాదు. అతడింకా ఆ ఫ్రాంఛైజీ తరఫున ఒక ఏడాది ఆడగలడని అనిపిస్తోంది. వచ్చే సంవత్సరం ఆడి తర్వాత రిటైర్‌ అవ్వాలి. ఒక కెప్టెన్‌ గొప్పతనం అనేది అతడు సాధించిన ట్రోఫీల ఆధారంగానే గుర్తిస్తారు. ధోనీ ఇప్పటికే చెన్నై తరఫున తొమ్మిది సార్లు ఫైనల్స్‌ ఆడి నాలుగు ట్రోఫీలు అందించాడు. అలాంటప్పుడు అతడిని చేరుకోవడం అంత తేలిక కాదు. మరోవైపు ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్‌ శర్మ ధోనీకి చేరువగా ఉన్నా తొమ్మిది సార్లు ఫైనల్స్‌ చేరడానికి చాలా సమయం పడుతుంది’ అని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు ధోనీ వచ్చే ఏడాది చెన్నైలో కొనసాగుతాడా లేదా అనేదానిపై ఆ జట్టు ప్రతినిధి తాజాగా స్పష్టతనిచ్చాడు. వచ్చే ఏడాది మరో రెండు జట్లు కొత్తగా ఐపీఎల్‌లో చేరుతున్న నేపథ్యంలో ఈసారి మెగా వేలం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పాత జట్లు పలువురు కీలక ఆటగాళ్లను ఆయా ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకునే వీలు కల్పించడంతో చెన్నై తొలి రిటెన్షన్‌ కార్డును ధోనీ కోసమే ఉపయోగిస్తుందని ఆయన అన్నారు. దీంతో ధోనీ వచ్చే ఏడాది కూడా చెన్నై తరఫున ఉంటాడని అర్థమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని