Shane Warne : షేన్ వార్న్‌ది సహజ మరణమే : థాయ్‌లాండ్‌ పోలీసులు

స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ది సహజ మరణమేనని థాయ్‌లాండ్ పోలీసులు ప్రకటించారు. సోమవారం వార్న్‌ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన అనంతరం.. ఆయనది సహజ మరణమేనని..

Updated : 07 Mar 2022 17:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ది సహజ మరణమేనని థాయ్‌లాండ్ పోలీసులు ప్రకటించారు. సోమవారం వార్న్‌ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన అనంతరం.. ఆయనది సహజ మరణమేనని వైద్యులు నిర్ధారించారని పోలీసులు వెల్లడించారు.

వార్న్‌ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యులు అందించిన నివేదికను.. వార్న్‌ కుటుంబ సభ్యులకు, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి పంపినట్లు థాయ్‌లాండ్‌ పోలీసుల ప్రతినిధి కిస్సానా పథనాచెరోన్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్న్‌ హఠాన్మరణంపై ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని వెల్లడించారు. అయితే, వార్న్‌ మృతదేహాన్ని ఆస్ట్రేలియాకు ఎప్పుడు పంపుతారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, వార్న్‌ మరణానికి గల కారణాన్ని థాయ్‌లాండ్ పోలీసులు వెల్లడించలేదు. గుండెపోటుతో ఆయన మరణించి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

థాయ్‌లాండ్‌లోని రెండో అతి పెద్ద ద్వీపమైన కోహ్‌ సమూయిలోని తన రిసార్ట్‌లో శుక్రవారం.. అచేతనంగా పడి ఉన్న వార్న్‌ని తన వ్యక్తిగత సిబ్బంది హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా  ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిన విషయం తెలిసిందే.

వార్న్‌ మరణం.. ఎప్పటికీ ముగిసిపోని పీడకల : వార్న్‌ తల్లిదండ్రులు

‘వార్న్‌ గొప్ప ఆస్ట్రేలియన్‌. అందరూ గర్వించదగ్గ విజేత. అతడు లేని జీవితం చాలా అగమ్యగోచరంగా ఉంది. అది ఎప్పటికీ ముగిసిపోని ఓ పీడకల. అతడు మాకు మిగిల్చిన మధుర జ్ఞాపకాలతో ఈ చేదు నిజాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం’ అని వార్న్‌ తండ్రి కీత్, తల్లి బ్రిగెట్‌ పేర్కొన్నారు. వార్న్ జ్ఞాపకార్థం మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌ (ఎమ్‌సీజీ)లోని ఓ స్టాండ్‌కి ‘షేన్‌ కీత్‌ వార్న్‌’ స్టాండ్‌గా నామకరణం చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ‘నా హృదయంలో మీరు లేని లోటుని ఎవరూ భర్తీ చేయలేరు. నాకెప్పటికీ మీరే గొప్ప తండ్రి, గొప్ప స్నేహితుడు’ అని వార్న్‌ కుమారుడు జాక్సన్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని