MS Dhoni: వారంతా నాకు ఫేర్‌వెల్‌ ఇవ్వడానికి వచ్చినట్లున్నారు: ఎంఎస్ ధోనీ

కోల్‌కతాను తన సొంత మైదానంలోనే ఓడించడంలో సీఎస్‌కే (KKR vs CSK) బ్యాటర్‌ అజింక్య రహానె కీలక పాత్ర పోషించాడు. అభిమానులు కూడా ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని సీఎస్‌కేకు భారీగా మద్దతు తెలిపారు.

Published : 24 Apr 2023 09:25 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ (KKR vs CSK) 49 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అజింక్య రహానె (71*), కాన్వే (56), శివమ్‌ దూబె (50) అర్ధశతకాలతో చెలరేగారు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 235/4 భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా 188/8 స్కోరుకే పరిమితమైంది. జేసన్ రాయ్ (61), రింకు సింగ్ (53*) రాణించినా ఓటమి మాత్రం తప్పలేదు. ఈ విజయంతో సీఎస్‌కే (10) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.  కోల్‌కతాకు ఈడెన్‌ గార్డెన్స్‌ సొంత మైదానం అయినప్పటికీ.. భారీగా అభిమానులు ఎంఎస్ ధోనీ  నాయకత్వంలోని సీఎస్‌కేకు మద్దతుగా నిలిచారు. మ్యాచ్‌ అనంతరం ధోనీ (MS Dhoni) కూడా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా ధోనీ సరదా వ్యాఖ్యలు చేశాడు. తనకు ఫేర్‌వెల్‌ ఇచ్చేందుకు వీరంతా సీఎస్‌కే జెర్సీ వేసుకున్నారన్నాడు. తర్వాత మ్యాచ్‌లో తప్పకుండా కోల్‌కతా జెర్సీలతోనే వస్తారని పేర్కొన్నాడు. 

‘‘మమ్మల్ని సపోర్ట్‌ చేయడానికి భారీగా వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన చాలా మంది ప్రేక్షకులు తర్వాతి మ్యాచ్‌కు కేకేఆర్‌ జెర్సీతో తప్పకుండా వస్తారు. ఈ మ్యాచ్‌లో మాత్రం నాకు ఫేర్‌వెల్‌ ఇచ్చేందుకు వచ్చినట్లు ఉంది. కాబట్టి, అభిమానులకు థ్యాంక్స్‌. మా ఫాస్ట్‌ బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారు. స్పిన్నర్లూ మిడిల్‌ ఓవర్లలో ఫర్వాలేదనిపించారు. పిచ్‌ ఒకవైపు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అందుకే, త్వరగా వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలని భావించాం. అలాగే జరిగింది. కోల్‌కతాలో చాలామంది పవర్‌హిట్టర్లు ఉన్నారు. ఆటగాళ్ల విషయంలో ఒకటే ప్రాథమిక సూత్రం ఫాలో అవుతా. గాయంతో బాధపడేవారికి విశ్రాంతినిచ్చి.. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలి. వారు అద్భుతంగా ఆడేలా ప్రోత్సహించాలి. మా కుర్రాళ్లు అందరూ అద్భుతగా రాణిస్తున్నారు. సీనియర్ ఆటగాడు అజింక్య రహానె అదరగొట్టాడు. అతడి సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అతడికి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇచ్చాం. అందుకే అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన వచ్చింది’’ అని ధోనీ తెలిపాడు. 

ఇంకా మంచి ప్రదర్శన రాలేదు: రహానె (Rahane)

‘‘ఎలా ఆడాలనే దానిపై నాకంటూ స్పష్టత ఉంది. సరైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నా. నా గేమ్‌ను ఎంజాయ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రారంభంలో బ్యాటింగ్‌ చేయడానికి వికెట్‌ కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఒక్కసారి కుదురుకుంటే మాత్రం చెలరేగిపోవచ్చు. మాకు అద్భుతమైన ప్రారంభం దక్కడంతో దానిని కొనసాగించాలని భారీ షాట్లు కొట్టా. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో అన్ని షాట్లను ఎంజాయ్ చేశా. అయితే, ఇప్పటికీ నా నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాలేదని అనిపిస్తోంది. ఇంకా నేర్చుకుంటూనే ఉంటా. ఎంఎస్ నాయకత్వంలో చాలా ఏళ్లు టీమ్‌ఇండియా తరఫున ఆడిన అనుభవం ఉంది. ఇప్పుడు సీఎస్‌కే తరఫునా నేర్చుకునే అవకాశం వచ్చింది. అతడు చెప్పేది వింటే చాలు ప్రదర్శన ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది’’ అని రహానె చెప్పాడు. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన అజింక్య రహానెకే ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని