WPL: దిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌.. యూపీ థ్రిల్లింగ్‌ విక్టరీ

దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్‌ 1 పరుగు తేడాతో విజయం సాధించింది.   

Updated : 09 Mar 2024 01:13 IST

దిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 19.5 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్‌ అయింది. స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ యూపీ బౌలర్లు అద్భుతంగా రాణించి చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు. దిల్లీ జట్టులో కెప్టెన్‌ లానింగ్‌(60) మినహా మిగతావారు విఫలమయ్యారు. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు తీయగా, గ్రేస్‌ హ్యారిస్‌, సైమా ఠాకూర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

మలుపు తిప్పిన చివరి రెండు ఓవర్లు..

18 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 124 పరుగులతో నిలిచిన దిల్లీ.. చివరి రెండు ఓవర్లలో 6 వికెట్లు కోల్పోవడం గమనార్హం. 19 ఓవర్‌ వేసిన దీప్తి శర్మ కేవలం 5 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది. దీంతో లక్ష్యం చివరి ఓవర్‌లో 10 పరుగులుగా మారింది. 20 ఓవర్‌లో గ్రేస్‌ హ్యారిస్‌ బౌలింగ్‌లో తొలి బంతికే రాధా యాదవ్‌ సిక్స్‌ కొట్టడం, రెండో బంతికి రెండు పరుగులు రావడంతో అంతా దిల్లీ విజయం ఖాయమనుకున్నారు. అయితే మూడో బంతికి రాధాయాదవ్‌ బౌల్డ్‌ కాగా, నాలుగో బంతికి జొనాసెన్‌ రనౌట్‌ అయింది. దీంతో మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. సమీకరణం రెండు బంతుల్లో రెండు పరుగులుగా మారింది. దిల్లీ చేతిలో ఒకవికెట్‌ మాత్రమే ఉంది. ఐదో బంతిని ఎదుర్కొన్న తితాస్‌ క్యాచ్‌ ఔట్‌ కావడంతో యూపీ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. దీప్తి శర్మ (59), ఎలీసా హీలే (29) రాణించారు. యూపీ బౌలర్లలో టిటాస్ సధు, రాధా యాదవ్ చెరో 2, షికా పాండే, అరుంధతి రెడ్డి, జెస్ జొనాసెన్, ఎలిస్‌ కాప్సీ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని