Virat Kohli: సచిన్‌ వన్డే సెంచరీల రికార్డు.. విరాట్‌ కోహ్లీకి తప్పని నిరీక్షణ

మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli) హాఫ్ సెంచరీలను శతకాలుగా మలచడంలో మరోసారి విఫలమయ్యాడు. గత మ్యాచ్‌లో కివీస్‌పై 95 పరుగుల వద్ద ఔట్‌ కాగా.. ఇప్పుడు శ్రీలంకపై 88 పరుగుల వద్ద  పెవిలియన్‌కు చేరాడు.

Updated : 02 Nov 2023 18:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకొనేందుకు నిరీక్షణ తప్పడం లేదు. వన్డేల్లో సచిన్‌ తెందూల్కర్‌ సాధించిన 49 శతకాల రికార్డును సమం చేసే అవకాశం విరాట్‌కు కాస్తలో చేజారుతోంది. శ్రీలంకతో మ్యాచ్‌లో 88 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ (4) తొలి ఓవర్‌లోనే ఔటైనప్పటికీ మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ (92)తో కలిసి రెండో వికెట్‌కు 189 పరుగులు జోడించాడు. వీరిద్దరూ శతకాలకు చేరువగా వచ్చి స్వల్ప వ్యవధుల్లో ఔట్ కావడం గమనార్హం. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 48 సెంచరీలు ఉన్నాయి. సచిన్‌ శతకాల రికార్డును సమం చేసే అవకాశం చేజారినప్పటికీ.. మరో ఘనతను విరాట్‌ సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్‌ 21 సార్లు  ఈ ఘనత సాధించగా.. కోహ్లీ 13సార్లు అందుకొన్నాడు. ఈ క్రమంలో షకిబ్ (12), కుమార సంగక్కర (12), రోహిత్ శర్మ (12)ను అధిగమించాడు. 

వరల్డ్‌ కప్‌ ముందు పాక్‌పై..

వన్డే ప్రపంచకప్‌ ముందు విరాట్ కోహ్లీ 47 శతకాలతో ఉన్నాడు. ఆసియా కప్‌లో (సెప్టెంబర్ 10న) పాకిస్థాన్‌పై సెంచరీ సాధించాడు.  ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత వరల్డ్ కప్‌లో బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్‌లోనే కీలకమైన 85 పరుగులు చేసినప్పటికీ (ఆసీస్‌పై) సెంచరీగా మలచలేకపోయాడు. అక్టోబర్‌ 19న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తన కెరీర్‌లోనే 48వ సెంచరీని పూర్తి చేశాడు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఒక సెంచరీ చేశాడు.  దీంతో సచిన్‌ రికార్డుకు సమీపంగా వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 95 పరుగులు చేసి కొద్దిలో సెంచరీని మిస్‌ చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి 88 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో తన 49వ శతకం కోసం మరో మూడు రోజుల వరకు వేచి చూడాల్సిందే. దక్షిణాఫ్రికాతో కోల్‌కతా వేదికగా నవంబర్‌ 5న టీమ్ఇండియా తలపడనుంది. ఇక వరల్డ్‌ కప్‌ లీగ్‌ స్టేజ్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో నవంబర్‌ 12న ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని