IND vs SA: నా లక్ష్యం మాత్రం వచ్చే ఏడాది ప్రపంచకప్‌: తాత్కాలిక కెప్టెన్‌ ధావన్‌

దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకొంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌నూ దక్కించుకొనేందుకు శిఖర్ ధావన్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఈ క్రమంలో కెప్టెన్ ధావన్‌ ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడాడు.

Updated : 06 Oct 2022 13:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సఫారీలతో మూడు వన్డేల సిరీస్‌ కోసం శిఖర్ ధావన్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా సన్నద్ధమైంది. ఇప్పటికే శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే జట్లతో వన్డే సిరీస్‌లను ధావన్‌ నేతృత్వంలో కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. గత రెండేళ్ల నుంచి వన్డే ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్ శిఖర్ ధావన్‌ కావడం విశేషం. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌ కోసం ఫిట్‌గా తయారు కావడంపైనే దృష్టిసారించినట్లు ధావన్‌ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ప్రారంభం నేపథ్యంలో శిఖర్ ధావన్‌ ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడాడు. 

‘‘నా కెరీర్‌ చాలా బాగా సాగుతోంది. అందుకు కృతజ్ఞతుడిని. నా అనుభవం, నాలెడ్జ్‌ను యువ ఆటగాళ్లకు చెప్పేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. ఇప్పుడు నాపై కొత్త బాధ్యతలు ఉన్నాయి. ఇదొక అవకాశం తీసుకొని సవాళ్లను ఎదుర్కొంటా. అలాగే ఆటను ఆస్వాదిస్తా. అయితే నా లక్ష్యం మాత్రమే 2023 వన్డే ప్రపంచకప్‌. దాని కోసం నేను ఫిట్‌గా ఉండటంతోపాటు నా మనస్సును మంచి స్థితిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’’ అని ధావన్‌ వెల్లడించాడు. 

వారిద్దరూ నా రోల్‌ మోడల్స్‌: రజత్ పాటిదార్

భారత టీ20 లీగ్‌ గత సీజన్‌లో అదరగొట్టి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ రజత్‌ పాటిదార్ తన రోల్‌ మోడల్స్‌ ఎవరనేది చెప్పాడు. ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ అభిమాన ఆటగాళ్లని పేర్కొన్నాడు. ‘‘రోహిత్, విరాట్ నా రోల్‌ మోడల్స్. విరాట్‌తో కలిసి లీగ్‌లో మంచి భాగస్వామ్యాలు నిర్మించా. ఆఫ్‌ ఫీల్డ్‌లోనూ నా బ్యాటింగ్‌ గురించి కోహ్లీతో మాట్లాడుతూ ఉండేవాడిని. అతడి సలహాలు చాలా సాయపడ్డాయి. మ్యాచుల్లో వాటిని అమలు చేసి నా బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకొన్నా. అభిమాన ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకుంటే వచ్చే అనుభూతి జీవితాంతం మరిచిపోలేము. వారి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు’’ అని ఆనందం వ్యక్తం చేశాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని