Axar Patel: శ్రీలంకతో ఆసియా కప్‌ ఫైనల్‌.. వాషింగ్టన్ సుందర్‌కు పిలుపు!

బంగ్లాదేశ్‌పై విజయం కోసం వీరోచితంగా పోరాడిన అక్షర్ పటేల్ గాయపడటం జట్టు మేనేజ్‌మెంట్‌తోపాటు అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. అతడి స్థానంలో మరొక స్పిన్‌ ఆల్‌రౌండర్‌కు బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది.

Published : 16 Sep 2023 14:01 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ (Asia Cup 2023) సూపర్ -4లో భాగంగా చివరి మ్యాచ్‌ను భారత్ ఆడింది. అయితే, బంగ్లాదేశ్‌ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గిల్‌, అక్షర్ పటేల్ పోరాడినా పరాజయం తప్పలేదు. భారత్‌ను గెలిపించేందుకు చేసే ప్రయత్నంలో అక్షర్ పటేల్ గాయపడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. స్టంపౌట్‌ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా కుడిచేతి చిటికెన వేలికి గాయమైంది. ఆ తర్వాత కాసేపటికే బంగ్లాదేశ్‌ ఫీల్డర్‌ దూరం నుంచి విసిరిన బంతి అక్షర్ చేతిని తాకింది. దీంతో పట్టీ వేసుకుని మరీ బ్యాటింగ్ చేశాడు. ఆదివారం శ్రీలంకతో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. గాయపడిన అక్షర్ కోలుకోవడం కష్టమేనన్న సూచనలు వస్తున్నాయి. దీంతో అక్షర్ స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

‘‘అక్షర్ పటేల్ గాయాలతో బాధపడుతున్నాడు. చిటికెన వేలు, మోచేయికి గాయం కావడంతోపాటు తొడ కండరాలు పట్టేయడం జరిగింది. దీంతో అక్షర్‌ విశ్రాంతి తీసుకుంటాడు. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు పిలుపు వచ్చింది’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మోచేతికి గాయం కావడంతోపాటు వాపు వచ్చింది. దీంతో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్‌లో ఆడతాడా..?లేదా..అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు. ఆసియా గేమ్స్‌ కోసం ప్రకటించిన భారత్‌ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. స్వదేశంలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌ నాటికి అక్షర్‌ కోలుకుంటాడని అంతా భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని