Ricky Ponting: వార్న్‌కు ఆ విషయం చెప్పలేకపోయా.. పాంటింగ్‌ భావోద్వేగం

తన సహచర ఆటగాడు, లెజెండరీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ను ఎంతగా ప్రేమిస్తానో చెప్పలేకపోయానని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ విచారం వ్యక్తం చేశాడు. వార్న్‌ గత శుక్రవారం థాయ్‌లాండ్‌లోని...

Updated : 08 Mar 2022 11:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన సహచర ఆటగాడు, లెజెండరీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ను ఎంతగా ప్రేమించానో చెప్పలేకపోయానని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ విచారం వ్యక్తం చేశాడు. వార్న్‌ గత శుక్రవారం థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐసీసీతో మాట్లాడిన పాంటింగ్‌.. ఇప్పటికీ తన స్నేహితుడు లేడనే నిజాన్ని నమ్మలేకపోతున్నానని అన్నాడు. ఇంగ్లాండ్‌ మాజీ ప్లేయర్‌ ఇషా గుహ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాంటింగ్‌ భావోద్వేగం చెందాడు.

‘షేర్న్‌వార్న్‌ను నేను ఎంతగా ప్రేమిస్తానో చాలా మంది యువకులతో పంచుకున్నా. కానీ.. ఈ విషయాన్ని అతడికి చెప్పలేకపోయా’ అని వివరిస్తూ రికీ ఉబికివస్తోన్న దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. వార్న్‌ ఒక గురువు లాంటోడని.. ఎప్పుడూ యువ క్రికెటర్లకు తన విలువైన సలహాలు, సూచనలు చేసేవాడని గుర్తుచేసుకున్నాడు. స్పిన్‌ దిగ్గజం చనిపోయాక అతడితో ఆడిన ఎంతో మంది స్పిన్నర్ల ఫొటోలు చూశానని చెప్పాడు. స్టీవ్‌స్మిత్, రషీద్‌ఖాన్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లకు కూడా వార్న్‌ తొలినాళ్లలో సహాయం చేశాడన్నాడు. ఇకపై షేన్‌వార్న్‌ గురించి మాట్లాడాల్సిన అవకాశాలు వచ్చినప్పుడల్లా అతడి నుంచి తానేం నేర్చుకున్నాననే విషయాలు వెల్లడించాలనుకుంటున్నట్లు పాంటింగ్‌ వివరించాడు.

ఇక వార్న్‌ మరణ వార్త తెలియగానే షాక్‌కు గురయ్యానని, మొదట నమ్మలేకపోయానని పాంటింగ్‌ పేర్కొన్నాడు. ‘నేను ఆరోజు ఉదయం నిద్రలేవగానే మా పిల్లల్ని నెట్‌బాల్‌ ప్రాక్టీస్‌కు తీసుకెళ్లాలని చూస్తున్నా. అప్పుడే నా భార్య తన ఫోన్‌ చూస్తూ షేన్‌వార్న్‌ గురించి చెప్పింది. వెంటనే ఆ ఫోన్‌ లాగేసుకొని వార్తలు చూశా. నమ్మలేకపోయా. ఇప్పటికీ అలాగే అనిపిస్తోంది. వార్న్‌ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా’ అని ఆస్ట్రేలియా మాజీ సారథి భావోద్వేగం చెందాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని