Rishabh Pant: రిషబ్‌ సామాన్యుడు కాదు.. ఓ అద్భుతం : డాక్టర్‌ దిన్షా పార్దివాలా

మోకాలి చిప్ప పూర్తిగా పక్కకు జరిగి.. నడవలేని స్థితికి చేరిన టీమ్‌ ఇండియా యువ కీపర్‌ పంత్‌ కోలుకోవడం ఓ వండర్‌. ఈ విషయాన్ని ఆయనకు చికిత్స చేసిన డాక్టరే స్వయంగా వెల్లడించారు. 

Updated : 14 Mar 2024 17:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మోకాలికి తీవ్ర గాయమైతే కోలుకోవడమే కష్టం.. అలాంటిది క్రికెట్‌ ఆడటం అంటే ఓ అద్భుతమే. రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) విషయంలో ఇప్పుడు అలాంటిదే జరిగింది. ఆయన వైద్యులతో సవాలు చేసి మరీ అనుకొన్న దానికంటే కనీసం మూడు నెలల ముందే కోలుకొని మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని  చెప్పింది ఎవరో కాదు.. అతడికి చికిత్స చేసిన కోకిలాబెన్‌ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ దిన్షా పార్దీవాలా. చికిత్స సమయంలో జరిగిన పలు ఆసక్తికర పరిణామాలను ఆయన ఇటీవల బీసీసీఐ  టీవీతో పంచుకొన్నారు.  శస్త్రచికిత్స సమయంలో పంత్‌ కోలుకొని సాధారణ వ్యక్తిలా నడవగలడా అని తల్లి ఆందోళన చెందింది. కానీ, అతడు ఏకంగా టీమ్‌ ఇండియా వికెట్‌ కీపర్‌ రేసులోకి వచ్చి నిలిచాడు. 

 ఆస్పత్రిలో చేరాక కుడి మోకాలికి ఏకంగా మూడు ఆపరేషన్లు చేశారు. పాదం, మణికట్టు ఎముకలు విరిగాయి. దీనిపై డా.దిన్షా పార్దీవాలా మాట్లాడుతూ ఒక దశలో కోలుకొని పోటీ క్రికెట్‌ ఆడటానికి కనీసం 18 నెలలు పడుతుందని అతనితోనే చెప్పానన్నారు. దీనికి పంత్‌ బదులిస్తూ.. 12 నెలల్లో నేను తిరిగి మైదానంలో క్రికెట్‌ ఆడతానని బదులిచ్చాడని గుర్తు చేసుకొన్నారు. అతడు 15 నెలల్లో పోటీ క్రికెట్‌లోకి రావడం అద్భుతమే అని అభిప్రాయపడ్డారు.  

రిషబ్‌ తల్లికి హామీ ఇచ్చాం..

రిషబ్‌ కోలుకొని సాధారణ వ్యక్తిలా చేస్తామని తాము అతడి తల్లికి హామీ ఇచ్చామని డాక్టర్‌ దిన్షా చెప్పారు. ‘‘శస్త్ర చికిత్స వేళ పేషెంట్‌ గాయం పరిస్థితిని డాక్టర్లు కచ్చితంగా  కుటుంబ సభ్యులు, బంధువులకు వెల్లడించాలి. మా వద్ద సమాచారం తెలుసుకొన్న అతడి తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. అతడు ఎప్పటికైనా నడవగలడా అన్న సందేహాలు ఆమెలో తలెత్తాయి. ఈ సందర్భంగా మేము ఆమెకు ధైర్యం చెప్పాం. సాధారణ వ్యక్తిలా నడిచేట్లు చేస్తామని హామీ ఇచ్చాం. అతడు తిరిగి క్రికెట్‌ ఆడేలా చేయాలనే లక్ష్యంతోనే ప్రయత్నిస్తామని వెల్లడించాము. 

అతడు కోలుకోవడంలో తొలి దశైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. ఇక అతడి రీహాబ్‌ తొలుత చాలా నిదానంగా సాగింది. ఆ సమయంలో గాయం పూర్తిగా తగ్గే ప్రక్రియను మేము ఏమాత్రం డిస్టర్బ్‌ చేయలేదు. ఆ తర్వాత గాయపడిన భాగాన్ని బలోపేతం చేసి.. కదలికలు సాఫీగా, చురుగ్గా జరిగేలా చూశాము. ఆటలకు ఇదే చాలా కీలకం. ఈ సమయంలో అతడు సాధారణ స్థితికి చేరేందుకు దాదాపు 18 నెలలు పట్టవచ్చని చెప్పాం. కానీ రిషబ్‌ మాత్రం తాను 12 నెలల్లో పూర్తి ఫిట్‌నెస్‌ సంతరించుకొని చూపిస్తానని చెప్పాడు’’ అని దిన్షా వివరించారు.

ధోనీ ‘డీజిల్‌ ఇంజిన్‌’లాంటోడు.. ఆగేదే లేదు: ఏబీ డివిలియర్స్‌

పంత్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీలో తీవ్రంగా శ్రమించాడు.. తన ఫిట్‌నెస్‌ అప్‌డేట్లను నిత్యం అభిమానులతో పంచుకొన్నాడు. కోలుకొనే క్రమంలో ప్రతిఒక్క దశను ఎంజాయ్‌ చేశాడు. తొలి సారి ఊతకర్రను వదిలేసిన వేళ, బ్యాట్‌ పట్టుకొన్న రోజు ఇలాంటి అంశాలు వాటిల్లో ఉన్నాయి. 

మానసికంగా బలంగా ఉంచడం కూడా సవాలే..

రిషబ్‌ ప్రమాదానికి గురయ్యే నాటికి టీమ్‌ఇండియా యువ సంచలనం. అలాంటి కుర్రాడు 12-18 నెలల పాటు క్రికెట్‌కు దూరమవుతాడనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టం. ఆ సమయంలో తాము అతడికి అండగా నిలిచామని దిన్షా పేర్కొన్నారు. ‘‘మోకాలి చిప్ప పక్కకు జరగడం అనేదీ తీవ్రమైన గాయం. అక్కడ ప్రతీ భాగం దెబ్బతిని ఉంటుంది. వాటిని సాధారణ స్థితికి తీసుకొచ్చి స్థిరత్వాన్ని కల్పించడం ప్రతీ సర్జన్‌కూ సవాలే. ఆ సమయంలో పేషెంట్‌కు మానసిక ధైర్యం చాలా అవసరం. అప్పటివరకు సూపర్‌ స్టార్‌లా ఉండి.. కొన్నాళ్లకే సాధారణ వ్యక్తి చేసే పని కూడా చేయలేకపోవడం ఇబ్బందికరమైన అంశం. ఆ సమయంలో అతడికి అండగా నిలిచాము. నిరంతరం ప్రోత్సహించాము. ఇలాంటి పరిస్థితిని ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారని.. ఈ దశను దాటేస్తావని ధైర్యం చెప్పాము’’ అని పేర్కొన్నారు. 

14 నెలల తర్వాత రిషబ్‌ ఎట్టకేలకు ఫిట్‌నెస్‌ సాధించి..  ఐపీఎల్‌తో పునరాగమనం చేస్తున్నాడు. అతడు వికెట్‌ కీపింగ్‌ కూడా చేసేంత ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించడంతో దిల్లీ క్యాపిటల్స్‌ శిబిరంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మళ్లీ ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని