MS Dhoni: ధోనీ ‘డీజిల్‌ ఇంజిన్‌’లాంటోడు.. ఆగేదే లేదు: ఏబీ డివిలియర్స్‌

ధోనీ క్రేజ్‌ ముందు అంతా దిగదుడుపే. ఐపీఎల్‌లో (IPL) ఇప్పటికే అత్యంత ఆదరణ కలిగిన కెప్టెన్లలో ఎంఎస్‌డీ ముందుంటాడు.

Updated : 14 Mar 2024 15:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఎంఎస్ ధోనీ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించాడు. నాలుగేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ‘కెప్టెన్ కూల్’’ ఫిట్‌నెస్‌పరంగా కుర్రాళ్లతో  పోటీ పడతాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK)ను ఐదోసారి విజేతగా నిలిపాడు. ప్రతీ సీజన్‌ సమయంలోనూ ధోనీకిదే చివరిదనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ మాత్రం వాటిని కొట్టిపడేస్తూ ధోనీ ‘డీజిల్‌ ఇంజిన్‌లాంటోడు.. ముగింపు ఉండదు’ అని కామెంట్ చేశాడు. 

‘‘ధోనీ గురించి ప్రతిసారీ రూమర్లు పుట్టుకొస్తుంటాయి. గతేడాది కూడా ఇదే మాట అన్నారు. కానీ, అతడు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చాడు. మరి ఇదే చివరి సీజన్‌ అవుతుందా? అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఎవరికీ తెలియదు. కానీ, ఒక మాట చెబుతా. ధోనీ డీజిల్‌ ఇంజిన్‌ లాంటోడు. ఎప్పటికీ ముగింపు ఉండదు. అతడు మాత్రమే తన వీడ్కోలుపై నిర్ణయం తీసుకోగలడు. అద్భుతమైన కెప్టెన్సీ. సూపర్ ప్లేయర్. ధోనీ నాయకత్వం, నిశ్శబ్దంగా ఉండే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ ఆధ్వర్యంలో పని చేయడం ఆటగాళ్లకు వరం లాంటిది. ఇలాంటి జట్టును ఓడించడం ప్రత్యర్థులకు తేలికేం కాదు. అందుకే, అత్యంత విజయవంతమైన జట్టు, ఫ్రాంచైజీ సీఎస్కే’’ అని ఏబీ డివిలియర్స్‌ వ్యాఖ్యానించాడు. 

రోహిత్‌నే కెప్టెన్‌గా ఉంచాలి: యువరాజ్‌ సింగ్

ముంబయి కెప్టెన్సీ మార్చడంపై భారత స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్ స్పందించాడు. ‘‘ముంబయిని రోహిత్ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్. అతడిని పక్కన పెట్టడం భారీ నిర్ణయమే. రోహిత్‌ను మరో సీజన్‌కు సారథిగా కొనసాగించి.. ఆ తర్వాత హార్దిక్‌కు జట్టు పగ్గాలు అప్పగిస్తే బాగుండేది. నేనైతే హార్దిక్‌ను హిట్‌మ్యాన్‌కు డిప్యూటీగా ఉంచేవాడిని. అయితే, ఫ్రాంచైజీ కోణంలో చూస్తే.. భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం రోహిత్ భారత జట్టు కెప్టెన్‌. అద్భుతమైన ఆటగాడు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతమైన అభిప్రాయం ఉంటుంది. కానీ, ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్.  ఇక హార్దిక్‌ పాండ్య టాలెంట్‌పరంగా అద్భుతమే. కానీ, గుజరాత్‌ కెప్టెన్సీతో పోలిస్తే ముంబయి సారథ్య బాధ్యతలు కాస్త విభిన్నం. ఎందుకంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి’’ అని యూవీ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని