World Cup 2023: వన్డే ప్రపంచకప్‌.. కోల్‌కతాలో జరగాల్సిన పాక్‌ మ్యాచ్‌లో మార్పు?

నవంబర్‌ 12న కోల్‌కతాలో పాక్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Published : 06 Aug 2023 02:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌- నవంబర్‌ నెలల్లో వన్డే ప్రపంచకప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ, ఐసీసీలు తుది షెడ్యూల్‌ ప్రకటించాయి. అయితే మ్యాచ్‌ జరగాల్సిన  వేదికలు, తేదీల విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లకు సంబంధించి పాక్‌ జట్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భద్రతా పరంగా ఆందోళనల నేపథ్యంలో కొన్ని వేదికలను మార్చాలని ఐసీసీని కోరింది. ఇదిలా ఉండగా నవంబర్‌ 12న కోల్‌కతాలో పాక్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఇదే రోజున కోల్‌కతాలో కాళీమాత పూజ పెద్దఎత్తున జరుగుతుంది. దీనికి భారీగా పోలీసులు బలగాలు అవసరం. ఈ నేపథ్యంలో స్థానిక భద్రతా ఏజెన్సీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆ రోజు జరగాల్సిన పాకిస్థాన్‌ మ్యాచ్‌ను వేరే రోజుకు మార్చాలని బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఐసీసీ రెక్కీ టీమ్‌ను అభ్యర్థించినట్లు సమాచారం. 

ఒకవేళ బీసీసీఐ, ఐసీసీలు ఈ ఆందోళనలను పరిగణలోకి తీసుకొని మ్యాచ్‌ను వేరే రోజుకి మారిస్తే పాక్‌ షెడ్యూల్‌లో ఇది మూడో మార్పు అవుతుంది. ఇప్పటికే అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా జరగాల్సిన భారత్‌, పాక్‌ మ్యాచ్‌ను 15కు మార్చారు. ఇక హైదరాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 10న జరగాల్సిన పాక్‌, శ్రీలంక మ్యాచ్‌ను 12కు మార్చారు. మరోవైపు అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-పాక్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై సైతం ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అక్టోబర్‌ 15 నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభంకానున్నాయి. దీంతో స్థానిక పోలీసులు మ్యాచ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 27న బీసీసీఐ, ఐసీసీలు ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేశాయి. ఇప్పుడు పలు ఆందోళనల నేపథ్యంలో మార్పులు చేస్తారా లేక యథావిధిగా షెడ్యూల్‌ను కొనసాగిస్తారా అనేది స్పస్టత రావాల్సిఉంది. ఒకవేళ మ్యాచ్‌ల్లో మార్పులు చేస్తే దానికి సంబంధించి రివైజ్‌డ్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఐసీసీలు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక మ్యాచ్‌ మార్పుపై బెంగాల్‌ క్రికెట్‌ క్లబ్‌(క్యాబ్‌) ప్రెసిడెంట్‌ స్నేహశిష్‌ గంగూలీ స్పందించారు. మ్యాచ్‌ తేదీని మార్పించాలని క్యాబ్‌ అభ్యర్థించినట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని