WTC Final: కోహ్లీసేన ‘5’ శత్రువులు

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు మరో నాలుగు రోజులే ఉంది. ఇంగ్లాండ్‌ను 1-0తో మట్టికరిపించిన న్యూజిలాండ్‌ ఉత్సాహంతో ఉంది. టీమ్‌ఇండియాతో పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఐసీసీ టోర్నీల్లో ఎన్నో జట్లను ఓడించిన భారత్‌కు.. కివీస్‌ చేతిలో మాత్రం ఓటములు తప్పడం...

Updated : 15 Jun 2021 09:33 IST

 టీమ్‌ఇండియా.. ఆదమరిస్తే అంతే సంగతులు!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు మరో నాలుగు రోజులే ఉంది. ఇంగ్లాండ్‌ను 1-0తో మట్టికరిపించిన న్యూజిలాండ్‌ ఉత్సాహంతో ఉంది. టీమ్‌ఇండియాతో పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఐసీసీ టోర్నీల్లో ఎన్నో జట్లను ఓడించిన భారత్‌కు.. కివీస్‌ చేతిలో మాత్రం ఓటములు తప్పడం లేదు. అందుకే తొలిసారి ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలవాలంటే కోహ్లీసేన ప్రత్యర్థిని కట్టడి చేయక తప్పదు. ఆ ఐదుగురు శత్రువులను అడ్డుకోక తప్పుదు. ఇంతకీ వారెవరు?


ప్రధాన శత్రువు సౌథీ

ఫైనల్లో కోహ్లీసేన ప్రధాన శత్రువు ‘టిమ్‌ సౌథీ’. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన అతడు టాప్‌-5లో నిలిచాడు. కివీస్‌ విజయాలకు కారణం అతడి బౌలింగే! అత్యంత వేగంతో పదునైన బంతులు విసరగలడు. పిచ్‌లతో సంబంధం లేకుండా రాణించగలడు. పక్కాగా వలపన్ని ప్రత్యర్థిని ఉచ్చులో పడేయడం సౌథీ ప్రత్యేకత. భారత్‌పై అతడికి మంచి రికార్డుంది. 8 మ్యాచుల్లో 24.46 సగటుతో 39 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లాండ్‌ గడ్డపై 6 మ్యాచుల్లో 28.37 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలను బట్టి అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం కోహ్లీసేనకు సులువేమీ కాదని అర్థమవుతోంది. మొన్నటి లార్డ్స్‌ మ్యాచులో 7 వికెట్లు తీసి హడలెత్తించాడు. పైగా కోహ్లీపై అతడిదే ఆధిపత్యం. ఇప్పటి వరకు 10సార్లు అతడిని ఔట్‌ చేశాడు. షార్ట్‌పిచ్‌లో బంతులేసి బ్యాక్‌ఫుట్‌తో ఆడేలా చేస్తాడు. ఆపై దేహానికి దూరంగా బంతిని కాస్త ఫుల్‌ చేసి డ్రైవ్‌ చేసేలా ఉసిగొల్పి కోహ్లీని బుట్టలో పడేస్తాడు. అందుకే అతడితో జాగ్రత్త తప్పదు.


ప్రియమైన శత్రువు కేన్‌

సారథి విరాట్‌ కోహ్లీ, టీమ్‌ఇండియాకు ‘ప్రియమైన శత్రువు’ కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల్లో అతడు పరుగులేమీ చేయలేదు. అలాగని మరేం ఫర్వాలేదనుకోవద్దు. కోహ్లీ తరహాలోనే కీలక మ్యాచుల్లో రాణించడం.. ఒత్తిడిలో ప్రశాంతంగా ముందుకు సాగడం.. కనిపించకుండానే విధ్వంసం సృష్టించడం కేన్‌ ప్రత్యేకత. భారత్‌పై చెలరేగడం అతడికి అలవాటే. టీమ్‌ఇండియాపై  11 టెస్టుల్లో 36.40 సగటుతో 728 పరుగులు చేశాడు. 2 శతకాలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌ గడ్డపై 5 టెస్టుల్లో 26.10 సగటుతో 261 పరుగులే చేశాడు. ఇంగ్లిష్‌ వాతావరణంలో పెద్దగా పరుగులు చేయకపోవడం సానుకూలాంశమే అయినా ఆదమరిస్తే ప్రమాదం తప్పదు. ఎందుకంటే తటస్థ వేదికపై ఇద్దరికీ అవకాశాలు సమంగానే ఉంటాయి. అతడు పేస్‌తో పాటు స్పిన్‌నూ సమర్థంగా ఎదుర్కోగలడు. అశ్విన్‌, బుమ్రా అతడిని నిలవకుండా అడ్డుకోవాలి.


కొత్త శత్రువు కాన్వే

టీమ్‌ఇండియా ఎదుర్కోబోతున్న కొత్త శత్రువు ‘డేవాన్‌ కాన్వే’. అటు స్పిన్‌ ఇటు పేస్‌ను సమర్థంగా ఆడటం ఈ కివీస్‌ ఓపెనర్‌ ప్రత్యేకత. అంతర్జాతీయ క్రికెట్లోకి కొత్తగా వచ్చానన్న బెరుకే అతడిలో కనిపించడం లేదు. ఇంగ్లాండ్‌తో 2 టెస్టుల సిరీసులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో 76.50 సగటు, 54.84 స్ట్రైక్‌రేట్‌తో 306 పరుగులు చేశాడు. ఇక లార్డ్స్‌లో ద్విశతకం చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. ఆడింది 3 వన్డేలే. 75 సగటు, 88.23 స్ట్రైక్‌రేట్‌తో 225 పరుగులు బాదేశాడు. 11 టీ20 ఇన్నింగ్సుల్లో 59.12 సగటుతో 473 పరుగులు సాధించాడు. క్రీజులో నిలదొక్కుకుంటే కాన్వేను ఔట్‌ చేయడం సులభం కాదు. అందులోనూ టీమ్‌ఇండియా స్పిన్‌ ద్వయాన్ని ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలు అనుసరించాడట. వీలైనంత త్వరగా ఈ ఓపెనర్‌ను పెవిలియన్‌ పంపించకపోతే అంతే సంగతులు!


బోల్తా కొట్టించే శత్రువు బౌల్ట్‌

న్యూజిలాండ్‌కు టిమ్‌ సౌథీతో పాటు దొరికిన మరో అద్భుతమైన పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌. బ్యాటింగ్‌లో కుడి, ఎడమ కూర్పులా.. బౌలింగ్‌లో సౌథీ కుడిచేత్తో.. బౌల్ట్‌ ఎడమచేత్తో ప్రత్యర్థిని శాసిస్తారు. విభిన్నమైన కోణాల్లో బంతిని వేగంగా విసరడం.. బ్యాట్స్‌మెన్‌ మీదకు దూసుకొచ్చే ఇన్‌స్వింగర్లు వేయడం బౌల్ట్‌ ప్రత్యేకత. ఇంగ్లాండ్‌ వంటి దేశాల్లో టీమ్‌ఇండియా టాప్‌ఆర్డర్‌ బలహీనతను అతడు సొమ్ము చేసుకోగలడు! అందుకే బౌల్ట్‌ను ఆచితూచి ఎదుర్కోవడం కోహ్లీసేనకు అవసరం. టీమ్‌ఇండియాపై 9 టెస్టులాడిన అతడు 29.52 సగటుతో 36 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లాండ్‌లో 5 టెస్టుల్లోనే 22.40 సగటుతో 27 వికెట్లు తీయడం గమనార్హం. మరో ఎండ్‌లో ఇంకెవరైనా ఒత్తిడి చేస్తుంటే.. ఇంకో ఎండ్‌లో బౌల్ట్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. అందుకే సౌథీతో కలిసినప్పుడు అతడిని ఎదుర్కోవడం కష్టం. రోజ్‌బౌల్‌లో చల్లని వాతావరణం ఉంటే బౌల్ట్‌ను అడ్డుకోవడం బ్యాటు మీద సామే!


నివురు గప్పిన శత్రువు హెన్రీ

అగ్నికి ఆజ్యం తోడైతే... నానుడి తెలిసిందే. కివీస్‌ బౌలర్లలో సౌథీ, బౌల్ట్‌ అగ్ని అనుకుంటే ఆజ్యం ‘మ్యాట్‌ హెన్రీ’! దొరికిన అవకాశాలు తక్కువే ఐనా నిలకడగా అదరగొడుతున్నాడు.  ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో 6 వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సిబ్లీ, రూట్‌, మార్క్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో వరుసగా రోరీ బర్న్స్‌ (0), సిబ్లీ (8), జాక్‌ క్రాలీ (17)ని 30 పరుగుల్లోపే పెవిలియన్‌ పంపించి విజయంలో కీలకంగా మారాడు. బౌల్ట్‌, సౌథీ విఫలమైన పక్షంలో వారి పాత్రలను హెన్రీ పోషిస్తాడు. 140 కి.మీ వేగంతో బంతులను స్వింగ్‌ చేసే అతడికి ఇంగ్లాండ్‌ వాతావరణం నప్పుతుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో కివీస్‌ ఫైనల్‌ చేరడంలో 14 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. హెన్రీ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడటం కోహ్లీసేనకు అవసరం. లేదంటే ప్రపంచకప్‌ సెమీస్‌లో రోహిత్‌ (1), రాహుల్‌ (1) ఔటైన పరిస్థితులను అతడు సృష్టించగలడు. అంచనాలన్నీ బౌల్ట్‌, సౌథీపై ఉంటాయి కాబట్టి చాప కింద నీరులా హెన్రీ వికెట్లు తీసేస్తుంటాడు. టీమ్‌ఇండియాపై అతడు 2 టెస్టుల్లో 6 వికెట్లు, ఇంగ్లాండ్‌లో 3 టెస్టులాడి 14 వికెట్లు తీశాడు. సొంత దేశంలో (13) కన్నా ఇంగ్లాండ్‌లోనే ఓ వికెట్‌ ఎక్కువ తీయడం గమనార్హం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని