Yuvraj Singh: అప్పుడు కోహ్లీ సపోర్ట్ చేయకపోతే తిరిగి జట్టులోకి రాకపోయేవాడిని: యువరాజ్‌ సింగ్

2017లో తిరిగి జట్టులోకి వచ్చినప్పుడు అప్పటి కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడని యువరాజ్‌ సింగ్ (Yuvaraj Singh) తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Published : 24 Jun 2023 20:23 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా 2007, 2011 ప్రపంచకప్‌లు సాధించడంలో మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvaraj Singh) కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీల్లో యువీ ఆడిన ఇన్నింగ్స్‌లను అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. 2011 ప్రపంచకప్‌ ముగిసిన కొన్ని రోజులకు యువరాజ్‌ సింగ్ క్యాన్సర్‌ బారినపడిన విషయం తెలిసిందే. కీమోథెరపి చేయించుకుని కోలుకున్న అతడు చాలా కాలంపాటు ఆటకు దూరంగా ఉన్నాడు. పూర్తి స్థాయిలో ఫిట్‌గా మారిన అనంతరం మళ్లీ టీమ్‌ఇండియా తరఫున ఆడాడు. తర్వాత సరైన ప్రదర్శన చేయకపోవడంతో 2015 ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచ కప్‌లకు యువీని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అనంతరం దేశవాళీ క్రికెట్‌లో రాణించి 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఆడాడు. ఈ నేపథ్యంలో 2017లో మళ్లీ జట్టులోకి వచ్చినప్పుడు అప్పటి కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) మద్దతుగా నిలిచాడని యువరాజ్‌ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2019 ప్రపంచకప్‌లో యువీ ఆడాలనుకున్నా సెలెక్టర్లు అతడిని విస్మరించారు. సెలెక్టర్లు తన పేరును పరిశీలించడం లేదని ధోనీ (MS Dhoni) చెప్పాడని యువీ పేర్కొన్నాడు.

‘‘2017లో నేను పునరాగమనం చేసినప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాకు మద్దతుగా నిలిచాడు. అతను సపోర్ట్ చేయకపోతే నేను తిరిగి జట్టులోకి వచ్చేవాడిని కాదు.  2019 ప్రపంచకప్‌నకు సెలెక్టర్లు నన్ను ఎంపిక చేయలేదు. వారు జట్టులోకి ఎందుకు తీసుకోట్లేదనే విషయాన్ని ధోనీ నాకు సవివరంగా వివరించాడు. 2011 ప్రపంచకప్ వరకు ధోనీ నాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. ‘నువ్వు నా ప్రధాన ఆటగాడు’ అని నాతో చెప్పేవాడు. కానీ, క్యాన్సర్‌ నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత ఆటలో, టీమ్‌లో చాలా మార్పులు జరిగాయి. కెప్టెన్‌గా కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. జట్టు మొత్తానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని యువరాజ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని