Pegasus: ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందని డౌటా?

‘పెగాసస్‌’స్పైవేర్‌.. ఇప్పుడు ఈ పేరు రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో మార్మోగిపోతోంది. నిఘా కార్యకలాపాల కోసం ఇంజ్రాయెల్‌కు చెందిన..

Updated : 21 Jul 2021 18:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పెగాసస్‌’ స్పైవేర్‌.. ఇప్పుడు ఈ పేరు రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో మార్మోగిపోతోంది. నిఘా కార్యకలాపాల కోసం ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ ఐదేళ్ల కిందట ‘పెగాసస్‌’ను రూపొందించింది. అయితే స్పైవేర్‌ వల్ల అంతర్జాతీయంగా పలువురు ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా సంచలనమైంది. ఐఓఎస్‌తోపాటు ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ ఫోన్లను కూడా ‘పెగాసస్‌’ హ్యాకింగ్‌ చేసినట్లు నిపుణులు గుర్తించారు. ఒక్కసారి మీ ఫోన్‌లోకిగానీ ఈ స్పైవేర్‌ దూరిందంటే అది ఉన్నట్లు కూడా కనిపెట్టడం చాలా కష్టం. స్పైవేర్‌ అటాక్‌ చేస్తే ఫోన్‌లోని ఆర్థికపరమైన సమాచారంతోపాటు ఫొటో గ్యాలరీ, కాల్స్‌, సందేశాలన్నింటినీ తన నియంత్రణలోకి తెచ్చేసుకుంటుంది. మరి అలాంటి స్పైవేర్‌ బారిన మీ ఫోన్‌ పడిందో లేదో అనేది కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు.

బ్యాటరీ... యాప్‌లను చెక్‌ చేయండి

మీ ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యం చాలా త్వరగా తగ్గిపోతుంటే ప్రమాదకర యాప్స్‌తో మోసపూరిత కోడ్‌ను వినియోగించి మాల్‌వేర్‌ అటాక్ అయినట్లు భావింవచవచ్చు. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్‌లు నడుస్తూ ఉండటం వల్ల కూడానూ బ్యాటరీ కన్జప్షన్‌ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి యాప్‌లను తొలుత నియంత్రించాలి. అప్పటికీ ఇదే సమస్య పునరావృతమైతే ఆలోచించాల్సిందే. అలానే మీరు డౌన్‌లోడ్‌ చేయకుండానే మీ ఫోన్‌లో అనసవర యాప్స్‌ ఉంటే మాత్రం జాగ్రత్తపడాలి. వాటిని తొలగించినా మళ్లీ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అవుతుంటే మాత్రం హ్యాకర్‌ లేదా స్పైవేర్ దాడికి పాల్పడినట్లుగా భావించాలి. 


డేటా వినియోగం పెరగడం.. ఫోన్‌ స్లో అవడం.. 

మీ స్మార్ట్‌ఫోన్‌ సడన్‌గా స్లో అయిపోవడం.. ఏదైనా యాప్‌ను, లేదా గేమ్‌ను కానీ ఓపెన్ చేసినప్పుడు ఇబ్బంది పెట్టడం చేస్తే  బ్యాక్‌గ్రౌండ్‌లో మాల్‌వేర్‌ ఉండే అవకాశం ఉంది. అలానే డేటా వినియోగం సాధారణంగా వినియోగించే దానికంటే పెరిగితే మాల్‌వేర్‌ గురించి ఆలోచించాల్సిందే. హానికరమైన యాప్‌లు కానీ సాఫ్ట్‌వేర్‌ గానీ బ్యాక్‌గ్రౌండ్‌లో మొబైల్‌ డేటాను వినియోగిస్తూ ఉండొచ్చు. మీరేమి చేస్తున్నారో ట్రాక్‌ చేసే ప్రమాదముంది. 


ఫోన్‌ పనితీరు మారిపోవడం.. 

ఫోన్‌ పనితీరు అసహజంగా అనిపించడం. అంటే యాప్స్‌ సడెన్‌గా క్రాష్ అవ్వడం, లోడింగ్‌ సమయంలో విఫలం కావడం వంటి సమస్యలు తలెత్తితే జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్‌లో వెబ్‌సైట్లను ఓపెన్‌ చేశారనుకుందాం.. అవి గతంలో  ఉన్నవాటికి భిన్నంగా కనిపిస్తే మాత్రం మాల్‌వేర్‌ దాడి చేసిందనేదానికి సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ఏదైనా సైట్‌ను ఓపెన్ చేస్తే స్క్రీన్‌ మీద పెద్దమొత్తంలో పాప్‌-అప్స్‌ కనిపిస్తే వాటిని క్లిక్‌ చేయకూడదు. పాప్‌-అప్స్‌ ద్వారా మాల్‌వేర్‌ మీ డివైజ్‌లోకి చొరబడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్‌ లాగ్‌లో టెక్ట్స్‌, కాల్స్‌ ఏవైనా సరే మీరు చేయలేదని గుర్తిస్తే మాత్రం హ్యాకర్‌ బారిన పడినట్టుగా అనుకోవచ్చు. మెసేజ్‌లలో అసభ్యకరమైన పదాలు ఉండే అవకాశ ఉంది. ఇదొక సంకేతంగా భావించాలి.


గ్యాలరీతోపాటు ఫ్లాష్‌ లైటింగ్‌ విషయంలో...

స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు తీసుకోవడం ఎక్కువైపోయింది. అయితే గ్యాలరీల్లో మీరు తీసుకోని లేదా ఎవరి దగ్గరి నుంచైనా రిసీవ్‌ చేసుకోని ఇమేజ్‌లు ఉన్నట్లు గుర్తిస్తే అప్రమత్తమవ్వాలి. మీ ఫోన్‌లోని కెమెరా ఇతరులు కంట్రోల్‌లోకి వెళ్లిందనే దానికి సంకేతమిదే. అదేవిధంగా మీ ఫోన్‌ను వినియోగించనప్పుడు కూడా ఫ్లాష్‌ లైట్‌ ఆన్‌ అవుతూ ఉంటే కూడానూ హెచ్చరికగా భావించాలి. గేమ్స్‌, యాప్స్‌ను  ఎక్కువగా వినియోగిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఫోన్‌ వేడెక్కడం సహజం. మొబైల్‌ను వాడకుండానే వేడిగా అవుతుందా.. అయితే హ్యాకర్స్‌ దాడి చేస్తున్నారని అనుకోవాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని