ముందు నవ్వు.. ఆనక ఆలోచించు!

​​​నోబెల్‌ బహుమతులు అనగానే ఎన్నెన్నో గొప్ప పరిశోధనలు, ఆవిష్కరణలు గుర్తుకొస్తాయి. వీటికి భిన్నమైన నోబెల్‌ బహుమతులు కూడా ఉన్నాయి.

Updated : 20 Sep 2023 22:18 IST

​​​నోబెల్‌ బహుమతులు అనగానే ఎన్నెన్నో గొప్ప పరిశోధనలు, ఆవిష్కరణలు గుర్తుకొస్తాయి. వీటికి భిన్నమైన నోబెల్‌ బహుమతులు కూడా ఉన్నాయి. అవే ఐజీ నోబెల్‌ ప్రైజులు. వీటిని సాధారణంగా నోబెల్‌ గ్రహీతల చేతుల మీదుగానే ప్రదానం చేస్తుంటారు. ముందు నవ్వు తెప్పించి, ఆనక ఆలోచింపజేసే విచిత్రమైన అధ్యయనాలు చేసినవారికి వీటిని ఇస్తుంటారు. ఈసారి ఐజీ నోబెల్‌ పొందిన కొన్ని పరిశోధనలు ఇవిగో..

రాళ్లను రుచి చూడటమెందుకు?

చాలామంది శాస్త్రవేత్తలు రాళ్లను నాలుకతో ఎందుకు రుచి చూస్తారు? ఇదేం ప్రశ్న అని మనసులోనే నవ్వుకుంటున్నారు కదా. దీన్ని గుర్తించటానికి చేసిన పరిశోధనకే ఈసారి రసాయన, భూగర్భ శాస్త్ర ఐజీ నోబెల్‌ దక్కింది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ లీసెస్టర్‌కు చెందిన జాన్‌ జలసీవిక్జ్‌ దీన్ని అందుకున్నారు. ‘నాలుకతో అద్దినప్పుడు ఉపరితలం తడిగా అవుతుంది. దీంతో శిలాజం, ఖనిజాల ఆకృతులు నిక్కబొడుచుకుంటాయి. అదే పొడి ఉపరితలాల మీదైతే సూక్ష్మ ప్రతిబింబాలు, వికిరణాల మూలంగా అవి మసకబారతాయి’ అని ఆయన తన ఈటింగ్‌ ఫాజిల్స్‌ అనే పరిశోధక వ్యాసంలో వివరించారు.

చాలా చాలా చాలా సార్లు

ఒకే పదాన్ని చాలా చాలా చాలా చాలా సార్లు వల్లె వేసినప్పుడు ఏం జరుగుతుంది? మనిషికి ఎలాంటి అనుభూతులు కలుగుతాయి? దీనిపై అధ్యయనం చేసినందుకే ఫ్రాన్స్‌, బ్రిటన్‌, మలేషియా, ఫిన్‌ల్యాండ్‌ పరిశోధక బృందానికి సాహిత్యంలో బహుమతి దక్కింది. ఈ పరిశోధన పత్రం మెమరీ పత్రికలో ప్రచురితమైంది.

సాలీడు పట్టు

సాలీడు చనిపోతే ఏం చేస్తాం? బయట పారేస్తాం. కానీ రైస్‌ యూనివర్సిటీకి చెందిన ఫాయే యాప్‌, డేనియల్‌ ప్రెస్టన్‌ బృందం విచిత్రంగా ఆలోచించింది. మెకానికల్‌ గ్రిప్పింగ్‌ పరికరాలుగా వాడుకోవటానికి చనిపోయిన సాలీళ్లను తిరిగి నడిపించింది. ఈ వినూత్న పరిజ్ఞానానికి నెక్రోబాటిక్స్‌ అనీ నామకరణం చేశారు. అంటే జైవిక అంశాలను రోబో భాగాలుగా ఉపయోగించటానికి తోడ్పడే శాస్త్రమన్నమాట.

ఓ టాయ్‌లెట్‌కూ


స్టాన్‌ఫోర్డ్‌ టాయ్‌లెట్‌ను ఆవిష్కరించినందుకు సీయాంగ్‌-మిన్‌ పార్క్‌ ప్రజారోగ్యంలో ఐజీ నోబెల్‌ అందుకున్నారు. ఈ టాయ్‌లెట్‌ గొప్పతనమేంటో తెలుసా? వివిధ పరిజ్ఞానాల సాయంతో విసర్జన సమయంలోనే మలాన్ని త్వరగా విశ్లేషించి, అందులో ఏమున్నాయో వివరించటం.

తిరగేసి మాట్లాడినా..

పదాలను తిరగేసి మాట్లాడే నైపుణ్యం గలవారిలో మెదడు తీరుతెన్నుల మీద అధ్యయనం చేసిన వారికి కమ్యూనికేషన్‌లో బహుమతి దక్కింది. స్పెయిన్‌లోని లా లగునాలో ఒక జాతికి చెందినవారు మామూలుగానే కాకుండా, వెనక్కి మాట్లాడటమూ నేర్చుకుంటారు. వీరిని దృష్టిలో పెట్టుకునే ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

ముక్కులో వెంట్రుకలు

ముక్కులో ఎన్ని వెంట్రుకలుంటాయి? రెండు రంధ్రాల్లోనూ సమానంగా ఉంటాయా? పరిశీలిస్తే పోలా. ఇదేం పిచ్చి పని అనుకుంటున్నారా? నిజంగా దీన్ని గుర్తించటానికే కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన నటాషా మెసింకోవస్క, ఆమె బృందం ప్రయత్నించింది. జీవన్మృతుల మీదే అధ్యయనం నిర్వహించింది. వీరికే మెడిసిన్‌ ఐజీ నోబెల్‌ దక్కింది మరి. జీవన్మృతుల ముక్కుల్లో ఒకో రంధ్రంలో సగటున 120 వెంట్రుకలు ఉంటున్నట్టూ వీళ్లు గుర్తించారు.

విద్యుత్తు ఉప్పు

విద్యుదీకరించిన చాప్‌స్టిక్స్‌, స్ట్రాలు ఆహారం రుచిని ఎలా మారుస్తాయో తెలియజేసే పరిశోధనకు న్యూట్రిషన్‌ విభాగంలో బహుమతి వచ్చింది. జపాన్‌లోని మీజి యూనివర్సిటీకి చెందిన హోమీ మియషిత, హరోమీ నకముర దీన్ని అందుకున్నారు. విద్యుత్తుతో ఆహారం మరింత ఉప్పగా అనిపించేలా చేసే మార్గాలను వీరు కనుగొన్నారు. ఉప్పు ఎక్కువగా తినేవారికిది నిజంగా గొప్ప వరమే. ఉప్పు తక్కువగా ఉన్నా ఎక్కువగా అనిపిస్తే ఆరోగ్యానికి మేలే కదా.

బోర్‌ కొట్టించినా

ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో విసుగు మీద పద్ధతి ప్రకారం చేసిన అధ్యయనం విద్య విభాగం బహుమతిని దక్కించుకుంది.

దారినపోతూ ఆకాశంలోకి

దారిలో కొందరు ఆకాశంలోకి చూస్తున్నారనుకోండి. అటుగా వెళ్తున్న కొందరు వారిని చూసి ఆగి, పైన ఏముందోనని వాళ్లూ పైకి చూశారనుకోండి. ఇలాంటివారు మనచుట్టూ ఎంతమంది ఉంటారు? మాకేం పనీపాటా లేదా? ఇదేం ప్రశ్నని విసుక్కోకండి. న్యూయార్క్‌ పట్టణ వీధుల్లో ఈ విచిత్ర అధ్యయనం చేసినందుకే లియోనార్డ్‌ బిక్‌మ్యాన్‌ అనే ఆయనకు సైకాలజీలో బహుమతి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని