
Android phone:కొత్త ఆండ్రాయిడ్ మొబైల్లో.. ఈ సెటప్స్ మరవద్దు!
ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకోగానే అందరూ ముందుగా చేసే పని మొబైల్ సెటప్. అయితే, రోజువారి వాడకానికి తగ్గట్టుగా మన మొబైల్ సెట్ చేయకుంటే.. ఆపై అసౌకర్యానికి గురికాక తప్పద్దు. అయితే, కొన్ని ‘స్మార్ట్’ ఫీచర్లను ముందే సెట్ చేస్తే మీ ఆండ్రాయిడ్ మొబైల్‌ను మరింత హ్యాండీగా వాడుకోవచ్చు. అవేంటో చూద్దామా..!
మొబైల్ డేటా యూసేజ్
ప్రస్తుత రోజుల్లో మొబైల్ డేటా ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటర్నెట్లో బ్రౌజింగ్, అప్లోడ్, డౌన్లోడ్ ఏది చేయాలన్న కచ్చితంగా మొబైల్ డేటా ఉండాల్సిందే. డేటా వినియోగంపై అన్ని నెట్‌వర్క్‌లు ఆయా ప్లాన్లకు తగ్గట్టుగా పరిమితులు విధించాయి. దీనికి మించి ఎక్కువగా వాడాలంటే అనవసరపు ఖర్చుల వాత తప్పదు. అయితే, కొన్ని సందర్భాల్లో మనం పూర్తి డేటా వినియోగించకపోయినా.. దానంతటదే ఖర్చు అవుతుంది. అదెలా అంటారా?మనకు తెలియకుండానే కొన్ని యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాను తెగ వాడేస్తుంటాయి. ఇలా యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాను వాడకుండా పూర్తిగా నిలిపివేయవచ్చు. లేదంటే సంబంధిత యాప్‌లకు మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ డేటా వినియోగానికి అనుమతించవచ్చు.
* ఇందుకు ముందుగా మొబైల్ సెట్టింగ్స్ (Settings) మెనూ సెర్చ్ బార్లో ‘మొబైల్ డేటా (mobile data)’ అని సెర్చ్ చేసి అందులో ‘డేటా సేవర్ (Data saver)’ ఆన్ చేసుకోండి. శాంసంగ్ వంటి ఆండ్రాయిడ్ మొబైళ్లలో ‘అల్ట్రా డేటా సేవర్ (Ultra data saver)’ మోడ్ ఆన్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ డేటాను పూర్తిగా నిలిపివేయవచ్చు.
* ఆపై మీరు ఏ యాప్‌లకు అయితే బ్యాక్‌గ్రౌండ్ డేటా వినియోగానికి అనుమతి ఇవ్వాలనుకుంటున్నారో.. వాటికి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వండి. అయితే, ఆయా ఆండ్రాయిడ్ మొబైళ్లలో ఈ సెట్టింగ్స్ కాస్త భిన్నంగా ఉండవచ్చు.
* మరోవైపు సెట్టింగ్స్‌లోనే ‘మొబైల్ డేటా యూసేజ్ (Mobile data usage)’ క్లిక్ చేసి.. అందులో ఏ యాప్ ఎక్కువ డేటా వినియోగిస్తుందో తెలుసుకొని నియంత్రించండి. ఇలా చేయడం ద్వారా మీ మొబైల్ బ్యాటరీని మెరుగు పరుచుకోవచ్చు. మరోవైపు గూగుల్ ప్లేస్టోర్‌లో మొబైల్ డేటా యూసేజ్‌కు సంబంధించి పలు యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
బ్లోట్‌వేర్
బ్లోట్‌వేర్ (డీఫాల్ట్‌గా వచ్చే యాప్స్) మెమొరీని ఎక్కువగా ఆక్రమించేస్తుంది. అంతేకాకుండా మిగతా యాప్‌లు, బ్యాటరీని సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. యాడ్స్ డిస్ప్లే చేస్తూ, డివైజ్‌ను (Device) ట్రాక్ చేస్తూ మన కాంటాక్ట్స్ లిస్ట్‌ను దొంగలిస్తూ ఉంటుంది. ఇటువంటి యాప్‌లను తొలగించడమే మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. స్పాన్సర్షిప్ కారణంగా కొత్త మొబైల్లో ఇటువంటి యాప్‌లు ఆటోమెటిక్‌గా ఇన్స్టాల్ చేసి రావడం వల్ల వీటిని గుర్తించడం కొద్దిగా కష్టమే. అయితే, సెట్టింగ్స్‌లో ‘యాప్స్ లేదా యాప్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ (Apps & notifications or App management)’ మొత్తం యాప్‌ల జాబితా ఒకసారి చూడండి. ఇందులో మీరు ఇన్స్టాల్ చేయని, అనుమానం కలిగించే యాప్‌లు ఏవైనా ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి. కుదరని పక్షంలో డేటా యాక్సెస్ ఆఫ్ చేసేయండి.
హోమ్ స్క్రీన్
కొత్త మొబైల్ తీసుకున్నా, లేదా ఉన్న మొబైల్లో హోమ్ స్క్రీన్‌పై ఉన్న అనవసరమైన చెత్త కొన్ని సందర్భాల్లో చిరాకు తప్పిస్తుంది. అయితే, మన వాడకానికి అనువుగా హోమ్ స్క్రీన్‌పై విడ్జెట్లను ఏర్పాటు చేసుకోవడం అతి సులువు. తద్వారా హోమ్ స్క్రీన్ చూడటానికి అందంగా కూడా కనిపిస్తుంది. ఇందుకు హోమ్ స్క్రీన్‌ను ఎక్కువసేపు నొక్కి పట్టి.. కావాల్సిన యాప్‌లను యాడ్ చేసుకోవడమే. మిగిలిన వాటిని తొలగించడమే.
ఇవి కూడా..
మరోవైపు ఆండ్రాయిడ్ మొబైళ్లలో ‘గూగుల్ అసిస్టెంట్ (Google Assistant)’ యూజర్లకు అపరిమితమైన సేవలను అందిస్తుంది. యాప్ వాయిస్ కమాండ్లు, వాయిస్ సెర్చ్‌కు గూగుల్ అసిస్టెండ్ ముందు వరుసలో ఉంటుంది. అయితే, కొత్త మొబైల్ సెటప్‌లో గూగుల్ అసిస్టెంట్‌ని కాన్ఫిగర్ను దాటవేయకపోవడమే మంచిది. అలాగే ఫొటోలు, వీడియోల బ్యాకప్ చేయడానికి ‘గూగుల్ ఫొటోలు (Google Photos)’ యాప్‌కు ముందే అనుమతి ఇచ్చేయండి. ఈ యాప్ అన్ని మొబైళ్లలో దాదాపు ముందే ఇన్స్టాల్ చేసి ఉంటుంది. లేదంటే ప్లేస్టోర్‌కు వెళ్లి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. మరోవైపు ఆండ్రాయిడ్ మొబైళ్లలో ఇవేకాకుండా పలు రకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నాయన్న సంగతి విధితమే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.