logo

మట్టిబిడ్డకు గొప్ప గౌరవం

కిన్నెర మొగిలయ్య.. పాలమూరు మట్టిబిడ్ఢ. కిన్నెరనాదమై మోగుతూ అలరించే నల్లమల ముద్దుబిడ్ఢ. పేదరికం వెంటాడుతున్నా 12 మెట్ల అరుదైన కిన్నెరనే కలలో, మెలకువలో ప్రాణపదంగా చేసుకుని జీవనం....

Updated : 26 Jan 2022 05:32 IST

మారుమూల నుంచి ఉన్నత శిఖరానికి ఎదిగిన మొగిలయ్య

పద్మశ్రీ పురస్కారంతో పాలమూరుకు ప్రత్యేక గుర్తింపు

న్యూస్‌టుడే, లింగాల, తెలకపల్లి : కిన్నెర మొగిలయ్య.. పాలమూరు మట్టిబిడ్ఢ. కిన్నెరనాదమై మోగుతూ అలరించే నల్లమల ముద్దుబిడ్ఢ. పేదరికం వెంటాడుతున్నా 12 మెట్ల అరుదైన కిన్నెరనే కలలో, మెలకువలో ప్రాణపదంగా చేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారుడు. కిన్నెరను ఆయన ముస్తాబు చేసిన తీరే దానితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని తెలుపుతుంది. పల్లెపాటలు, సంగీతంపై ఉన్న అంకితభావం, గాత్రంలో ప్రతిధ్వనించే ప్రతిభే ఆయనను ఒక్కో మెట్టు ఎక్కించింది. పల్లెలు తిరిగి పాటలతో అందరినీ అలరించే స్థాయి నుంచి తెలుగు వాచకంలో పాఠంగా మారి చిన్నారులకు స్ఫూర్తినిచ్చారు. వెండితెర పాటతో మెరిసి సినీ అభిమానులను ఉర్రూతలూగించారు. తెలుగు ప్రజలందరి మనసు చూరగొన్నారు. ఇప్పుడు శిఖరమే ఎక్కారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నతమైన వ్యక్తిత్వాలకు అందించే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికై నల్లమలకే కాదు తెలుగు వారికే గర్వకారణమయ్యారు. . నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం గట్టురాయిపాకులలో పుట్టిన మొగిలయ్య లింగాల మండలం అవుసలికుంటలో స్థిరపడ్డారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించగానే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. తన తాత, తండ్రి నుంచి వారసత్వం నుంచి వచ్చిన కిన్నెరనే నమ్ముకుని జీవిస్తున్న మొగిలయ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సత్కారాలు అందుకున్నారు. కానీ పూట గడవని దుస్థితిలో పాఠశాలలకు వెళ్లి ప్రదర్శనలు ఇచ్చారు. కొవిడ్‌తో పాఠశాలలు మూతపడటంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లనూ ఆశ్రయించారు. ఆయన ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులపై ‘ఈనాడు’ కథనాలతో వెలుగులోకి తేవటంతో ప్రభుత్వం అరుదైన కళాకారుడిగా గుర్తించి రూ. 10వేల పింఛనును మంజూరు చేసింది. ఇటీవల ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ నటించిన భీమ్లానాయక్‌ చిత్రంలో పాడిన టైటిల్‌ సాంగ్‌తో అందరికీ చేరువయ్యారు. ఆర్టీసీ బస్సులపై మొగులయ్య పాట పాడినందుకు సంస్థ ఎండీ సజ్జనార్‌ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించటానికి బస్‌ పాస్‌ ఇచ్చారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన నేపథ్యంలో ఇటు పుట్టిన ఊరు గట్టురాయిపాకులలో, అటు ఆయన స్థిరపడిన లింగాల మండలంలోని అవుసలికుంట గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని