Published : 25/08/2021 02:41 IST

కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణె అరెస్టు

ఠాక్రేపై చెంపదెబ్బ వ్యాఖ్యల వివాదం..

బెయిలు మంజూరు చేసిన కోర్టు

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు గానూ కేంద్ర చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్‌ రాణెను మంగళవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. జన ఆశీర్వాద్‌ యాత్రలో ఉన్న ఆయన్ని రత్నగిరి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ వ్యవహారం భాజపా-శివసేన మధ్య మరింతగా అగ్నికి ఆజ్యం పోసింది. సోమవారం రాయ్‌గఢ్‌ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఠాక్రే.. మన దేశానికి స్వాతంత్య్రం ఏ ఏడాది వచ్చిందో గుర్తులేక వెనుకనున్నవారిని అడిగి తెలుసుకున్నారనీ, తాను గానీ అక్కడ అప్పుడు ఉంటే ఆయన్ని చాచి లెంపకాయ కొట్టేవాడినని రాణె చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశాయి. తానెలాంటి నేరానికి పాల్పడలేదని మంత్రి సమర్థించుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై శివసేన నాయకులు ముంబయిలో సైబర్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రాయ్‌గఢ్‌ జిల్లా మహద్‌తో పాటు, నాసిక్‌, పుణెల్లోనూ కేసులు నమోదయ్యాయి. అరెస్టు తర్వాత తనకు రక్తపోటు ఎక్కువైందని, మధుమేహ స్థాయి పెరిగిందని మంత్రి చెప్పడంతో వైద్య పరీక్షలు చేయించారు. తదుపరి విచారణ నిమిత్తం రాయ్‌గఢ్‌ పోలీసులకు అప్పగించారు. రాత్రి పొద్దుపోయాక మహాద్‌లోని మెజిస్ట్రేట్‌ కోర్టులో మంత్రిని హాజరుపరచగా బెయిలు మంజూరైంది. పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోసం బాంబే హైకోర్టులో రాణె తొలుత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన అభ్యర్థించారు. మంగళవారమే అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా రాణె తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను జస్టిస్‌ ఎస్‌.ఎస్‌.శిందే, జస్టిస్‌ ఎన్‌.జే.జమాదర్‌ల ధర్మాసనం తిరస్కరించింది. రాణె వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. నాసిక్‌లోని భాజపా కార్యాలయంపై రాళ్లు రువ్వారు. రాణెను ‘‘కోంబ్డీ చోర్‌’’ (కోళ్ల దొంగ)గా పేర్కొంటూ పోస్టర్లు అంటించారు. కొన్నిచోట్ల రాళ్లు రువ్వుకోవడం, పెట్రోలు సీసాలతో దాడులు వంటి చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. నాసిక్‌, ఠానే, కల్యాణ్‌, నవీ ముంబయి సహా పలుచోట్ల శివసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ముంబయిలోని కేంద్రమంత్రి నివాసం వద్ద భాజపా-శివసేన శ్రేణుల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత తలెత్తింది. అక్కడ భారీగా పోలీసుల్ని మోహరించారు. కొవిడ్‌-19 నిబంధనల ఉల్లంఘనపై ఇరు వర్గాలమీదా కేసులు నమోదయ్యాయి.

రాజ్యాంగ విలువలకు విరుద్ధం: నడ్డా

పోలీసు కస్టడీలో రాణె ప్రాణాలకు ముప్పు ఉందని భాజపా ఆందోళన వ్యక్తం చేసింది. మంత్రిని అరెస్టు చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా ట్వీట్‌ చేశారు. రాణె అరెస్టు సరికాదని కేంద్ర మంత్రి రాందాస్‌ అఠావలె అన్నారు. గతంలో శివసేన నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. సమన్లు ఇవ్వకుండా అరెస్టు చేయడం తగదని మంత్రి తరఫు న్యాయవాది అన్నారు. మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావు పాటిల్‌ మాట్లాడుతూ- రాణె మానసిక సమతౌల్యాన్ని కోల్పోయారనీ, ఆయనకు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలని అన్నారు. కేంద్ర మంత్రిని కేబినెట్‌ నుంచి తప్పించాలని శివసేన ఎంపీ వినాయక్‌ రౌత్‌ ప్రధానికి లేఖ రాశారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని