Published : 04/12/2021 05:23 IST

40 ఏళ్లు దాటితే.. బూస్టర్‌ డోసు

అవకాశాలను పరిశీలించొచ్చని ఇన్సాకాగ్‌ సిఫార్సు
ముప్పు ఎక్కువున్నవారికి ముందుగా అందించాలని సూచన

దిల్లీ:  కొవిడ్‌ నియంత్రణకు బూస్టర్‌ డోసు అవసరమంటూ వాదనలు వినిపిస్తున్నవేళ.. దేశంలో కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం (ఇన్సాకాగ్‌) కీలక సిఫార్సు చేసింది. 40 ఏళ్లు దాటినవారికి ఆ డోసు అందించే అవకాశాలను పరిశీలించొచ్చని సూచించింది. అందులోనూ ముప్పు ఎక్కువగా పొంచి ఉన్నవారికి తొలుత ప్రాధాన్యమివ్వాలని అభిప్రాయపడింది. గత నెల 29న తమ బులిటెన్‌లో ఇన్సాకాగ్‌ చేసిన ఈ సిఫార్సు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలతో తక్కువ స్థాయిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు.. కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’కు ముకుతాడు వేసే అవకాశాలు తక్కువేనని ఇన్సాకాగ్‌ అభిప్రాయపడింది. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండకుండా అవి రక్షణ కల్పించగలవని పేర్కొంది. ముప్పు అధికంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు టీకా తీసుకోనివారికి రెండు డోసుల పంపిణీని వేగంగా పూర్తిచేయాలనీ సిఫార్సు చేసింది. మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించింది. అమెరికా, బ్రిటన్‌ మాత్రమే ఇప్పటివరకు వయోజనులకు బూస్టర్‌ డోసును అనుమతించాయి. రెండో డోసు వేసుకున్న ఆరు నెలల తర్వాత దాన్ని తీసుకోవాలని సిఫార్సు చేశాయి.

ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువే: కేంద్రం
కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ తీవ్రత మన దేశంలో తక్కువగానే ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. టీకాల పంపిణీ వేగంగా పూర్తవుతుండటంతో పాటు డెల్టా వేరియంట్‌ విజృంభణ సమయంలోనే ఎక్కువ మంది మహమ్మారి బారిన పడటాన్ని అందుకు కారణాలుగా పేర్కొంది.  


నిపుణుల సలహా మేరకే బూస్టర్‌: మాండవీయ

దేశంలో వయోజనులకు బూస్టర్‌ డోసు, చిన్నారులకు కరోనా టీకా అందించే అంశంపై నిపుణుల శాస్త్రీయ సలహాల ప్రాతిపదికనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ చెప్పారు. కొవిడ్‌పై లోక్‌సభలో 11 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన చర్చకు ఆయన శుక్రవారం బదులిచ్చారు. ‘ముప్పు’ జాబితాలోని దేశాల నుంచి మన దేశానికి చేరుకున్న 16 వేలమందికి ఇప్పటివరకు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. వారిలో 18 మంది కరోనా పాజిటివ్‌గా తేలారని, వారి నమూనాలను జన్యు విశ్లేషణకు (ఒమిక్రాన్‌ నిర్ధారణ కోసం) పంపించామని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, కొవిడ్‌ ఔషధాల అందుబాటుపై ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తున్నాయని మాండవీయ విమర్శించారు. దేశీయంగా తయారైన టీకాల గురించి ప్రజల్లో అనుమానాలు సృష్టించడం ద్వారా కొవిడ్‌పై దేశ పోరాటాన్ని బలహీనపర్చేందుకు విపక్షాలు ప్రయత్నించాయంటూ ధ్వజమెత్తారు. భారత్‌లో అర్హులైనవారిలో ఇప్పటివరకు 85% మంది తొలిడోసు, 50% మంది రెండు డోసులు తీసుకున్నారని చెప్పారు. తమతమ నియోజకవర్గాల్లో టీకా పంపిణీ 100% పూర్తయ్యేలా ఎంపీలు చర్యలకు ఉపక్రమించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 22 కోట్ల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని, మరో 10 కోట్ల డోసులు ఈ నెలలో సమకూర్చుకోనున్నామని పేర్కొన్నారు.


దిల్లీ ఆసుపత్రిలో 12 మంది ఒమిక్రాన్‌ అనుమానితులు

దిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో 12 మంది ‘ఒమిక్రాన్‌’ అనుమానితులు చేరినట్లు అధికారులు తెలిపారు. వారంతా ‘ముప్పు’ జాబితాలోనే దేశాల నుంచి ఇటీవలే భారత్‌కు చేరుకున్నట్లు వెల్లడించారు. అందులో 8 మందికి ఇప్పటికే కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు. మిగతావారు గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అందరి నమూనాలను జన్యు విశ్లేషణ కోసం పంపించినట్లు తెలిపారు.


జైపుర్‌లో ఒకే కుటుంబంలో 9 మందికి పాజిటివ్‌
నలుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు..

ఈనాడు, జైపుర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిలో నలుగురు కొద్ది రోజుల క్రితమే దక్షిణాఫ్రికా నుంచి రావడం గమనార్హం. 9 మంది నమూనాలనూ జన్యు విశ్లేషణ కోసం పంపించినట్లు అధికారులు తెలిపారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని