గ్రూప్‌-2 ఆబ్కారీ ఎస్సైల నిరీక్షణకు తెర

గ్రూప్‌-2 ద్వారా ఎంపికైన ఎక్సైజ్‌ ఎస్సైల పోస్టింగ్‌ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. ఇప్పటివరకు తాత్కాలిక అటాచ్‌మెంట్లు, అకాడమీలో వెయిటింగ్‌లతో కొనసాగుతున్న వీరి ఇక్కట్లకు ఉన్నతాధికారులు

Published : 23 Jan 2022 04:53 IST

రెండేళ్ల తర్వాత పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-2 ద్వారా ఎంపికైన ఎక్సైజ్‌ ఎస్సైల పోస్టింగ్‌ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. ఇప్పటివరకు తాత్కాలిక అటాచ్‌మెంట్లు, అకాడమీలో వెయిటింగ్‌లతో కొనసాగుతున్న వీరి ఇక్కట్లకు ఉన్నతాధికారులు ముగింపు పలికారు. పోస్టింగ్‌లు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 2018 నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికై 2020 జనవరి 22న విధుల్లో చేరిన ఈ 280 మంది ఎస్సైలకు ఇప్పటివరకు శాశ్వత పోస్టింగులు లేకపోవడం గమనార్హం. వీరికి పోస్టింగ్‌ ఇచ్చేందుకు అడ్‌హాక్‌ ఎస్సైల రూపంలో ఇన్నాళ్లూ అడ్డంకులు ఎదురయ్యాయి. వీరు ఎంపిక కాకముందున్న ఖాళీ స్థానాల్ని భర్తీ చేసేందుకు గతంలోనే ఎక్సైజ్‌శాఖ అడ్‌హాక్‌ పదోన్నతులను తెర పైకి తెచ్చింది. అప్పటివరకున్న కింది స్థాయి ఉద్యోగులకు అడ్‌హాక్‌ ఎస్సైలుగా తాత్కాలిక పదోన్నతులు కల్పించింది. భవిష్యత్తులో నేరుగా ఎంపికైన ఎస్సైలొస్తే తిరిగి రివర్షన్‌(వెనక్కి) వెళ్తామనే షరతుతోనే వీరికి పదోన్నతులు దక్కాయి. అయితే 2020లో గ్రూపు-2 ఎస్సైలు విధుల్లో చేరినా పలు కారణాలతో అడ్‌హాక్‌ ఎస్సైలను వెనక్కి పంపలేదు. అంతేకాక నేరుగా ఎంపికైన ఎస్సైలనే సూపర్‌న్యూమరరీ పోస్టింగ్‌ల్లో చేర్చారు. అవీ చాలినన్ని లేకపోవడంతో 73 మంది గ్రూప్‌-2 ఎస్సైలను అకాడమీలోనే కూర్చోబెట్టారు. వీరిలోనూ 50 మంది వరకు మహిళా ఎస్సైలే. 2021 జనవరితో ఈ పోస్టుల గడువు ముగియడంతో దాదాపు పది నెలలపాటు వీరికి వేతనాలు సైతం రాలేదు. దీనికితోడు ఎక్సైజ్‌ ఠాణాల్లో తాత్కాలిక అటాచ్‌మెంట్లు పొందిన మిగిలిన గ్రూప్‌-2 ఎస్సైలకు ఎఫ్‌ఐఆర్‌ జారీచేసే అధికారమూ లేకుండా పోయింది. తమ దుస్థితిపై 280 మంది ఎస్సైలు ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం దక్కలేదు. చివరకు శనివారం నాటితో ఈ నిరీక్షణకు తెరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని