మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి

భారత్‌లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు.

Published : 05 May 2024 06:26 IST

ఇందులో వైద్యులు, పోషకాహార నిపుణుల పాత్ర కీలకం
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ఈ వ్యాధిపై  వైద్యులు, పోషకాహార నిపుణులు, వైద్య పరిశోధన సంస్థలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. శనివారమిక్కడ ‘రీసెర్చ్‌ సొసైటీ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డయాబెటిస్‌ ఇన్‌ ఇండియా’(ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ) తెలంగాణ చాప్టర్‌ తొమ్మిదో వార్షికోత్సవ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధుమేహం, ఇతర వ్యాధుల చికిత్సలో పాశ్చాత్య, ఐరోపా దేశాల పద్ధతుల కంటే భారతీయుల జన్యువులు, ఇక్కడి ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఔషధాలు వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. మధుమేహ రోగులు జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుందని.. ఈ ఖర్చు భరించే పరిస్థితి అందరికీ ఉండదని చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాధి నియంత్రణపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. కొవిడ్‌ కాలంలో దేశవ్యాప్తంగా వైద్యులపై జరిగిన దాడులు చాలా దారుణమన్నారు. 

ఏ చికిత్సకైనా.. శాస్త్రీయతే కీలకం

‘డయాబెటిక్‌ రివర్సల్‌’ పేరుతో ఆచరించే వివిధ పద్ధతుల్లో శాస్త్రీయత ఎంతో చూడటమనేది కీలకమని జస్టిస్‌ రమణ చెప్పారు. ఇలాంటి పద్ధతులు రోగులకు మేలు చేయకపోగా.. ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారతాయని అభిప్రాయపడ్డారు. వైద్యసేవల్లో అవసరమైనచోట ఏఐని ఉపయోగించుకోవచ్చన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాకేశ్‌ సహాయ్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, టీఎస్‌ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఛైర్‌పర్సన్‌ లిల్లీ రోడ్రిగ్స్‌, కార్యదర్శి డాక్టర్‌ నావల్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని