Aadhaar-Voter ID Link:ఓటుకు.. ఆధార్‌ లంకె

ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానానికి ఉద్దేశించిన ‘ఎన్నికల చట్టాల సవరణ బిల్లు-2021’ని లోక్‌సభ సోమవారం 25 నిమిషాల్లోనే ఆమోదించింది. విపక్షాల నిరసనల మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సభలో ప్రవేశపెట్టిన బిల్లును మధ్యాహ్నం 2.46 నిమిషాలకు చర్చకు స్వీకరించారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న ప్యానల్‌ స్పీకర్‌ కిరీట్‌ ప్రేమ్‌భాయ్‌ సోలంకి ప్రతిపక్ష సభ్యులకు కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పిస్తూ వేగంగా చర్చను నడిపించి 3.11 గంటల కల్లా ముగించి, మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.

Updated : 21 Dec 2021 05:23 IST

తప్పనిసరి కాదు.. స్వచ్ఛందమే

బిల్లుకు 25 నిమిషాల్లో లోక్‌సభ సమ్మతి

స్థాయీ సంఘానికి పంపాలన్న ప్రతిపక్షాలు

ఆ కమిటీ ఇదివరకే ఆమోదించిందన్న న్యాయ మంత్రి


ఓటర్‌ ఐడీతో ఆధార్‌ అనుసంధానం బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతున్న న్యాయశాఖ మంత్రి రిజిజు

ఈనాడు, దిల్లీ: ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానానికి ఉద్దేశించిన ‘ఎన్నికల చట్టాల సవరణ బిల్లు-2021’ని లోక్‌సభ సోమవారం 25 నిమిషాల్లోనే ఆమోదించింది. విపక్షాల నిరసనల మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సభలో ప్రవేశపెట్టిన బిల్లును మధ్యాహ్నం 2.46 నిమిషాలకు చర్చకు స్వీకరించారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న ప్యానల్‌ స్పీకర్‌ కిరీట్‌ ప్రేమ్‌భాయ్‌ సోలంకి ప్రతిపక్ష సభ్యులకు కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పిస్తూ వేగంగా చర్చను నడిపించి 3.11 గంటల కల్లా ముగించి, మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.

లోపాలున్నాయి.. అందుకే సవరణలు

తొలుత మంత్రి రిజిజు మాట్లాడుతూ- ఇప్పటివరకు ఉన్న చట్టంలో కొన్ని లోపాలు, తేడాలున్నాయన్నారు. వాటిని సరిదిద్దడానికే సవరణలు ప్రతిపాదించినట్లు చెప్పారు. ‘‘ఎన్నికల సంఘం సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని సవరణలు చేస్తున్నాం. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 18 ఏళ్లు దాటినా కొందరు ఓటు వేయలేని పరిస్థితి ఉంది. ఏటా జనవరి ఒకటో తేదీని ప్రామాణికంగా తీసుకోవడం దానికి కారణం. ఆ తర్వాత 18 ఏళ్లు నిండినవారు ఆ ఏడాదిలో ఓటరుగా నమోదు చేసుకొనే అవకాశం ఉండదు. ఆ లోపాన్ని సరిదిద్ది జనవరి 1తో పాటు ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1ని పరిగణనలో తీసుకునే తేదీలుగా చేర్చాం. దీంతోపాటు- ఇకపై మహిళా సర్వీసు ఓటరు భర్త కూడా భార్య పనిచేసే చోట ఓటు వేయవచ్చు. ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రాంగణ వివరణను మరింత విస్తరించాం. ఆధార్‌ కార్డును ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసే నిబంధన స్వచ్ఛందమే’’ అని వివరించారు. విపక్షాల విమర్శల్లో ఎలాంటి పసా లేదన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్‌ 17 ప్రకారం ఏ వ్యక్తీ ఒక నియోజకవర్గానికి మించి ఓటరుగా నమోదు కాకూడదని పేర్కొన్నారు. ఓటరు జాబితాతో ఆధార్‌ను అనుసంధానం చేయడం చట్టవ్యతిరేకమేమీ కాదన్నారు. ఓటరుగా పేరు నమోదు చేయడానికి ముందు గుర్తింపుగా ఆధార్‌ను సమర్పించాలని సంబంధిత అధికారులు అడగాల్సి ఉంటుందని చెప్పారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందన్న వాదన సరికాదన్నారు. ఆధార్‌పై సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఈ బిల్లు ఉందని తెలిపారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు కూడా ఆధార్‌ నంబర్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌ లేదనే కారణంతో దరఖాస్తుల్ని తిరస్కరించడానికి వీలుండదు. అలాంటివారు ఇతర ధ్రువపత్రాలను సమర్పించే వెసులుబాటు ఉంది.


లోక్‌సభలో ఆందోళన చేస్తున్న విపక్షాల సభ్యులు

ఇంఅత్యవసరం ఏముంది?: కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ పక్షనేత అధీర్‌రంజన్‌ చౌధరి మాట్లాడుతూ- బిల్లు మహత్తరమైతే అత్యవసరంగా నిమిషాల వ్యవధిలో ఆమోదించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం లేకుండా ఈ బిల్లును తీసుకురావడమేమిటన్నారు. అదే పార్టీకి చెందిన మనీశ్‌ తివారీ మాట్లాడుతూ ఓటు హక్కు అన్నది పౌరులకు చట్టపరంగా లభించిన అధికారమని, దానికి ఆధార్‌తో లంకె పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మరో సభ్యుడు శశి థరూర్‌ ప్రసంగిస్తూ ప్రభుత్వ ప్రతిపాదన వల్ల.. పౌరులు కాని వారికి కూడా ఓటు హక్కు లభించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. డీఎంకే సభాపక్షనేత టీఆర్‌ బాలు మాట్లాడుతూ స్థాయీసంఘం పరిశీలన తర్వాత దీన్ని పరిశీలనకు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీఎంసీ, శివసేన, ఎన్సీపీ, బీఎస్పీ, ఆర్‌ఎస్‌పీ సభ్యులు ఇదే తరహా డిమాండ్‌ చేశారు. అన్ని పార్టీలు భాగస్వాములుగా ఉన్న స్థాయీసంఘం సిఫార్సుల మేరకే బిల్లు తీసుకువచ్చినట్లు రిజిజు చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏ ప్రాంగణాన్ని అయినా తీసుకొనేలా సవరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. భాజపా సభ్యుడు నిషికాంత్‌ దూబే మాట్లాడుతూ- ఓటరు జాబితాతో ఆధార్‌ను అనుసంధానిస్తే నేపాలీ, బంగ్లాదేశీయులను మనదేశంలో ఓటర్లుగా చేయడం కుదరదనీ, అందుకే కాంగ్రెస్‌, టీఎంసీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.

* ఈ బిల్లు చట్టంగా మారితే ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. బలప్రయోగం ద్వారా ఈ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందడానికి అధికార పక్షం చేసే ప్రయత్నాలను విపక్షం ఉమ్మడిగా అడ్డుకోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని