కాళేశ్వరం సిగలో మరో నగ

కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు మరో ఘనతను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌)ను ‘ఎ’ కేటగిరీ కార్పొరేషన్‌గా గుర్తిస్తూ, భారత ప్రభుత్వ సంస్థ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈసీఎల్‌)

Published : 23 Jan 2022 05:08 IST

 ఎ గ్రేడ్‌ కార్పొరేషన్‌గా గుర్తింపు

ఆర్‌ఈసీఎల్‌ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు మరో ఘనతను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌)ను ‘ఎ’ కేటగిరీ కార్పొరేషన్‌గా గుర్తిస్తూ, భారత ప్రభుత్వ సంస్థ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈసీఎల్‌) శనివారం ఉత్తర్వులిచ్చింది. నిధుల వినియోగం, నిర్మాణం, లక్ష్యం తదితర అంశాల ఆధారంగా ఆ సంస్థ కేటగిరీని నిర్ణయిస్తుంది. భారీ ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఈ ప్రాజెక్టు అనతికాలంలోనే అందుబాటులోకి రావడం, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడం విశేషం. కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు సమకూర్చేందుకు (ఎస్‌పీవీ) 2016లో రాష్ట్ర ప్రభుత్వం కేఐపీసీఎల్‌ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు అభివృద్ధి, నిధుల కేటాయింపు, నిర్వహణ బాధ్యతలను ఈ సంస్థకు అప్పగించింది. దీనికి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఛైర్మన్‌గా, బి.హరిరాం ఎండీగా ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణాలకు తగినట్లు నిధులను అందుబాటులోకి తెచ్చేందుకు పలు జాతీయ బ్యాంకుల సమాఖ్యలతో సంస్థ ఒప్పందాలు చేసుకుంది. భారీ నిర్మాణమైనప్పటికీ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సద్వినియోగం చేయడంతోపాటు పనులు సకాలంలో లక్ష్యం మేరకు పూర్తికావడంతో గుర్తింపు దక్కింది. ‘ఎ’ కేటగిరీ గుర్తింపు లభించడం హర్షణీయమని కాళేశ్వరం కార్పొరేషన్‌ ఎండీ, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ బి.హరిరాం పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని