Telangana News: ఇంటర్‌ హాల్‌టికెట్లు.. ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు!

రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి 24 వరకు నిర్వహించే ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్లో ఉంచినట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు.

Updated : 03 May 2022 07:08 IST

తప్పులుంటే ప్రిన్సిపాళ్ల దృష్టికి తెండి
ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి 24 వరకు నిర్వహించే ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్లో ఉంచినట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. విద్యార్థులు వాటిని www.tsbie.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్‌ సంతకం లేకుండా పరీక్షలకు హాజరుకావొచ్చని, అలాంటివారిని కూడా అనుమతించాలని చీఫ్‌ సూపరింటెండెంట్లను ఆదేశించారు. హాల్‌టికెట్లపై ముద్రించిన పేరు, ఫొటో, సంతకం, మీడియం, సబ్జెక్టులు తదితర వివరాలను క్షుణ్నంగా పరిశీలించాలని, తప్పులుంటే ప్రిన్సిపాళ్లు లేదా జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. పరీక్షా కేంద్రం కోడ్‌ నంబరు, అది ఉన్న ప్రాంతాన్ని ఒక రోజు ముందుగా చూసుకొని రావాలని కోరారు.

రెండు కళాశాలలకు నోటీసులు

ఇంటర్‌ కళాశాలలకు వారం క్రితమే హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు పంపింది. ట్యూషన్‌ ఫీజులను చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రెండు కళాశాలలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. కాగా కళాశాలలకు ముందుగా హాల్‌టికెట్లను పంపి.. ఫిర్యాదులు వచ్చిన తర్వాత వాటిని వెబ్‌సైట్లో పెట్టడం గమనార్హం. యాజమాన్యాల ఒత్తిడి మేరకే ఆలస్యంగా వెబ్‌సైట్లో పెట్టారని, కళాశాలలకు పంపడం, వెబ్‌సైట్లో పెట్టడం ఒకేసారి ఎందుకు చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని