Published : 22 May 2022 05:17 IST

ఎమ్మెల్సీ డ్రైవర్‌ మృతిపై ఎడతెగని ఉత్కంఠ

రోజంతా సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు మాయం

ఆచూకీ తెలుసుకుని మార్చురీ వద్దకు తీసుకొచ్చిన పోలీసులు 

వివాదం ముసిరినా పెళ్లిళ్లకు  హాజరైన ఎమ్మెల్సీ 

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ వద్ద కారుడ్రైవరుగా పనిచేసి, అనుమానాస్పద పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయిన సుబ్రహ్మణ్యం మృతదేహం చుట్టూ రోజంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ, తల్లిదండ్రులు శనివారం పగలంతా మాయమయ్యారు. వాళ్లు ఏమైపోయారో, ఎక్కడున్నారో ఎవరికీ తెలియలేదు. వారిని రాజీచేసేందుకు వైకాపా నాయకులు రంగంలోకి దిగారు. అపర్ణ స్వస్థలం సామర్లకోట కావడంతో, ఆమె తల్లిదండ్రులను స్థానిక వైకాపా ప్రజాప్రతినిధి ఒకరు ఒత్తిడి చేసి, తమ కుమార్తె ప్రమాదంతో ఉందని, తమకు అప్పగించాలని పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దాంతో అపర్ణ, ఆమె అత్తమామలు కాకినాడ గ్రామీణ మండలం కొమరగిరిలో తలదాచుకున్న విషయం తెలిసింది. అక్కడి నుంచి వాళ్లను తీసుకెళ్లారు. పోలీసులు సాయంత్రం నాటకీయంగా వారందరినీ కాకినాడ జీజీహెచ్‌ మార్చురీ వద్దకు తీసుకొచ్చారు. శవపంచనామా పూర్తిచేసిన తర్వాత... సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను, తల్లిదండ్రులు నూకరత్నం, సత్తిబాబులను వేర్వేరుగా కూర్చోబెట్టారు. వారిని ఒప్పించి పోస్టుమార్టం అంగీకారపత్రంపై సంతకాలు చేయించేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. శనివారం ఉదయం నుంచి కాకినాడ జీజీహెచ్‌ మార్చురీ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తెదేపా, అఖిలపక్షాలు, భాజపా, దళితసంఘాల నాయకులు మార్చురీ వద్ద భారీగా ఆందోళన చేశారు. వారిని, తెదేపా నిజనిర్ధారణ బృందాన్నీ మార్చురీలోకి అనుమతించకపోవడంతో తీవ్రంగా తోపులాట జరిగింది. ఎట్టకేలకు రాత్రి 10.30 గంటలకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి అనంతబాబును అరెస్టు చేస్తామని చెప్పడంతో మృతుడి భార్య అపర్ణ పోస్టుమార్టంకు అంగీకరించారు. రాత్రి 11.45 గంటలకు పోస్టుమార్టం ప్రారంభించి, అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు. 

దళిత యువకుడి అనుమానాస్పద మృతి వ్యవహారం రెండు రోజులుగా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ చుట్టూనే తిరుగుతోంది. సుబ్రహ్మణ్యం ఐదేళ్ల పాటు ఆయన వద్ద పనిచేశాడు. ఆయన కారులోనే అతడి మృతదేహం ఉంది. అయినా, దీనిపై ఎమ్మెల్సీ అనంతబాబు ఏమీ స్పందించలేదు. పైపెచ్చు.. శుక్రవారం తునిలో జరిగిన శంఖవరం డిప్యూటీ తహసీల్దారు వివాహానికి, రాత్రి పిఠాపురంలో ఓ ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతాసిబ్బంది వివాహానికి హాజరయ్యారు.  

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని