Published : 29 May 2022 06:08 IST

కొలువులో ‘పాతుకుపోయారు’

ఔషధ నియంత్రణాధికారులుగా ఏళ్ల తరబడి ఒకేచోట ఉద్యోగం

మందుల దుకాణాలతో సన్నిహిత సంబంధాలు

క్రమం తప్పని ముడుపులు...తూతూమంత్రంగా తనిఖీలు

ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లదీ ఇదే తీరు

ఈనాడు, హైదరాబాద్‌

ఔషధ నియంత్రణాధికారి(డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌)గా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొలువు. 10 ఏళ్లు గడుస్తున్నా మరోచోటుకు బదిలీ కాలేదు. ఇక్కడే పదోన్నతి కూడా పొందారు. తన డివిజన్‌ పరిధిలోని అన్ని ఔషధ దుకాణదారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో దుకాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా.. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. నెలనెలా తనిఖీలకు వెళ్లినప్పుడు తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నారని తెలుస్తోంది. ప్రతిఫలంగా క్రమం తప్పకుండా ముడుపులు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటివి పెరిగిపోవడం, కొందరిపై నేరుగా ఫిర్యాదులు రావడంతో వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇటీవల సమీక్షలో ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా ఇదే విషయంపై ఆరా తీసినట్లుగా తెలిసింది. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తుండడం శ్రేయస్కరం కాదని, వెంటనే అటువంటి వారిని బదిలీ చేయాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌లపైనా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయని, వారికీ ఇవే ఆదేశాలు వర్తింపజేయాలని స్పష్టం చేశారు.


నిబంధనలు పాటించకపోయినా.. పట్టించుకోరు

* ఔషధ ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలి. ఎప్పటికప్పుడూ పరీక్షలు నిర్వహిస్తుండాలి.

* ఔషధ దుకాణాల్లో ఫార్మాసిస్టు సమక్షంలోనే మందులు ఇవ్వాలి.

* వైద్యుల చీటి లేకుండా షెడ్యూల్‌ హెచ్‌, హెచ్‌1 ఔషధాలను విక్రయించడానికి వీల్లేదు.

* ఔషధ అమ్మకం ప్రతినిధులు ఇచ్చే నమూనా(శాంపిల్‌) మందులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరఫరా చేసే ఔషధాలను అమ్మకూడదు.

* మత్తు ఔషధాలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే.. తక్షణమే చర్య తీసుకోవాలి.

* అయితే ఈ నిబంధనల్లో అత్యధికం పాటించకపోయినా.. డ్రగ్‌ఇన్‌స్పెక్టర్లు పట్టించుకోకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లపైనా ఫిర్యాదులు

* ప్రతి ఆహార విక్రయ దుకాణానికి అనుమతి ఉండాలి. వంటగది, పరిసరాలు పరిశుభ్రంగా, హోటళ్లలో వాడే వస్తువులు నాణ్యయంగా ఉండాలి. వీటిపై ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తరచూ తనిఖీ చేయాలి

* మరీ నాణ్యత లోపం కనిపిస్తే ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయాలి.

* అయితే క్షేత్రస్థాయిలో అత్యధిక సందర్భాల్లో ఇవేవీ జరగడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి.


ఇక నుంచి పనితీరే ప్రామాణికం

దేశంలోనే ఫార్మా రంగానికి తెలంగాణ కీలక కేంద్రంగా గుర్తింపు పొందింది. ప్రధానంగా ముడిసరకును ఉత్పత్తి చేసే ఔషధ సంస్థలు రాష్ట్రంలో ఎక్కువ. ఔషధాల నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ బాధ్యత డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లదే. ఒకవైపు ఉత్పత్తి సంస్థల్లో నిరంతరం తనిఖీలు జరుపుతూ.. నాణ్యమైన ఔషధాలు ఉత్పత్తి అయ్యేలా చూడడం ప్రధాన విధి కాగా.. మరోవైపు బహిరంగ విపణిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాటి నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించే బాధ్యత కీలకమైంది. 2014-16లో వచ్చిన ‘జాతీయ ఔషధ సర్వే’ ప్రకారం.. దేశంలో 3.16 శాతం, తెలంగాణలో 2.90 శాతం ఔషధాలు నాసిరకమని తేలింది. ఇదే క్రమంలో సర్కారు వైద్యంలో అయితే 12.57 శాతం ఔషధాల్లో ప్రమాణాలు కొరవడినట్లుగా ఆ సర్వే నివేదిక స్పష్టం చేసింది. అందుకే ఇక నుంచి పనితీరే ప్రామాణికంగా పరిగణిస్తామని వైద్య మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తాజా పరిశీలనలో 9 ఏళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న వారు ఔషధ నియంత్రణ సంస్థలో 50 మందికి పైగా ఉన్నట్లుగా గుర్తించారు. ఔషధ నియంత్రణ, ఆహార పరిరక్షణ సంస్థల్లో ఏ ఒక్క ఉద్యోగి మూడేళ్లకు మించి ఒకేచోట పనిచేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీచేశారు. వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇదే విషయంపై కసరత్తు ప్రారంభించారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని