వ్యవసాయ పట్టభద్రులు అంకురసంస్థలు పెట్టాలి

వ్యవసాయ పట్టభద్రులు అంకుర సంస్థలు ప్రారంభించడానికి ముందుకు రావాలని జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ (నార్మ్‌) సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాల బోధకులకు ఆ మేరకు

Published : 02 Jul 2022 06:36 IST

నార్మ్‌ సంచాలకుడు డా.శ్రీనివాసరావు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ పట్టభద్రులు అంకుర సంస్థలు ప్రారంభించడానికి ముందుకు రావాలని జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ (నార్మ్‌) సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాల బోధకులకు ఆ మేరకు శిక్షణ ఇవ్వడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌) జాతీయ నోడల్‌ అధికారుల రెండురోజుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. మండలి సహాయ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పీఎస్‌ పాండే స్వాగతోపన్యాసం ఇస్తూ వ్యవసాయ విద్యలో జాతీయ విద్యావిధానం అమలు ముసాయిదాను ఇప్పటికే అన్ని విశ్వవిద్యాలయాలకు పంపించినట్లు వివరించారు. జయశంకర్‌ వర్సిటీ ప్రయోగాత్మక శిక్షణలో మంచి పనితీరు కనబరుస్తోందన్నారు. వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి తగ్గట్లుగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల పనితీరులో సమూల మార్పులు రావాలని, ఆవిష్కరణలకు పెద్దపీట వేయాలని సూచించారు. గూగుల్‌లో దొరకని అంశాల్ని బోధించే స్థాయికి ఆచార్యులు ఎదగాలని అభిప్రాయపడ్డారు. డేటా విశ్లేషణ, నాలెడ్జ్‌, మార్కెట్‌, ఇన్నోవేషన్‌ ఆధారిత వ్యవసాయ విద్యా పద్ధతులు అమల్లోకి రావాలని ప్రవీణ్‌రావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని