Published : 06 Jul 2022 05:58 IST

రెక్కీతో నా హత్యకు యత్నం

 తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎంపీ రఘురామ లేఖ

ఏపీ పోలీసులకు సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మద్దతు ఇస్తున్నారని ఆరోపణ

ఈనాడు, దిల్లీ: తనను, తన కుటుంబ సభ్యులను హత్య చేసేందుకే హైదరాబాద్‌ ఎమ్మార్‌ బౌల్డర్‌ హిల్స్‌లోని తన నివాసం సమీపంలో పదే పదే రెక్కీలు నిర్వహిస్తున్నారని అనుకుంటున్నానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ‘జులై 4న నా ఇంటి సమీపంలో రెక్కీ నిర్వహిస్తున్న ఆరుగురిలో ఒకరిని సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారు. అతడిని ప్రశ్నిస్తే ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన బాషా అని తెలిపారు. ఐడీ చూపలేదు. ఉన్నతాధికారుల వివరాలు చెప్పలేదు. చివరకు అతడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించాం. ఏపీ పోలీసులకు సైబరాబాద్‌ కమిషనర్‌ ఉన్న స్టీఫెన్‌ రవీంద్ర మద్దతిస్తున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో శాంతి భద్రతలను రక్షించాలి’ అని ఆ లేఖలో రఘురామ విజ్ఞప్తి చేశారు.

రైలు బోగీ దహనానికి కుట్ర

అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను రైలులో బయలుదేరిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాను ఉన్న రైలు బోగీ దహనానికి కుట్ర పన్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైలు సత్తెనపల్లికి చేరుకోగానే బోగీ తగులబెట్టేందుకు కుట్ర చేశారనేది నిజమని, కిషన్‌రెడ్డిని ఆ రైలు నుంచి దిగిపొమ్మని సీఎం జగన్‌ ఒత్తిడి చేసినట్లు తనకు సమాచారం అందిందని చెప్పారు.

రఘురామ రైల్లో వస్తే అదే చివరి రోజయ్యేది: బొండా ఉమా

ఈనాడు, అమరావతి: అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి ఉంటే ఆయనకు అదే చివరి రోజయ్యేదని, సత్తెనపల్లి వద్ద ఆయనను హత్య చేయించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇది వాస్తవమో కాదో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చెప్పాలని డిమాండు చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎంపీ రఘురామపై కేసు

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి- గచ్చిబౌలి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడిపై మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌పై దాడి చేసినందుకు ఎంపీతోపాటు ఆయన కుమారుడు భరత్‌, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ మంగళవారం వెల్లడించారు. మరో పక్క కానిస్టేబుల్‌ ఫరూక్‌పై దాడికి దిగిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండు చేసినట్లు అమరావతిలోని ఏపీ పోలీసు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు రఘురామ ఇంటివద్ద ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ ఎందుకు ఉన్నాడన్న విషయమై గచ్చిబౌలి పోలీసులు, ఏపీ పోలీసులు భిన్నమైన వాదనలు వినిపించారు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ మాట్లాడుతూ... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీ రఘురామ ఇంటివద్ద నిఘాలో భాగంగా కానిస్టేబుల్‌ ఫరూక్‌ విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడించగా... ఫరూక్‌ విధులకు, రఘురామకృష్ణరాజు ఇంటితో ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసు విభాగం పేర్కొనడం గమనార్హం.దాడి జరిగిన సమయంలో ఎంపీ రఘురామ అక్కడే ఉన్నారా, లేదా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ చెప్పారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని