మునుగోడులో ఓటుకు దరఖాస్తుల పోటు

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనుండటంతో అక్కడ ఓటరుగా నమోదుకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మునుపెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో.. ఇప్పటివరకు 22,871 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో

Updated : 27 Sep 2022 06:41 IST

ఇప్పటివరకు 22,871 మంది దాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనుండటంతో అక్కడ ఓటరుగా నమోదుకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మునుపెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో.. ఇప్పటివరకు 22,871 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందడం చర్చనీయాంశంగా మారింది. వీటిలో 2,226 విజ్ఞప్తులను ఇప్పటివరకు అధికారులు ఆమోదించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి అందిన దరఖాస్తులు ఎన్ని అన్నది ఆరా తీస్తున్నారు. ఓటు హక్కు నమోదు నిరంతర ప్రక్రియ కాగా.. ఏటా మార్పులు, చేర్పులతో జనవరి 5న తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. మునుగోడులో ఉపఎన్నిక జరగనున్న తరుణంలో ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సాగుతోంది. ఎన్నికల నామినేషన్ల దాఖలు చివరి తేదీకి పది రోజుల ముందు వరకు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కేంద్ర ఎన్నికల సంఘం గతం నుంచి అమలు చేస్తోంది. దీంతో ఈ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా మార్పులు, చేర్పులకు దరఖాస్తులు చేస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఆ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన భాజపా అభ్యర్థిగా అక్కడ పోటీకి దిగుతుండగా.. ఆ పార్టీతో పాటు, తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే ఏడాదే రాష్ట్రంలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఉపఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఏడాది జనవరి 5న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం మునుగోడు నియోజకవర్గంలో 2,27,101 మంది ఓటర్లు ఉన్నారు. ఆ జాబితాలో సైతం 8,672 మంది కొత్తగా నమోదయ్యారు. 2021 జాబితాలో కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 1,200 మాత్రమే కావడం గమనార్హం. ఈ దఫా ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రాగా.. ఎంతమంది నూతన ఓటర్లు నమోదవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts