ప్రతి నెలా 20 వేల మంది గర్భిణులకు ఉచితంగా స్కాన్‌

మాతాశిశు సంరక్షణలో దేశంలో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Updated : 27 Nov 2022 05:16 IST

56 టిఫా స్కానింగ్‌ యంత్రాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: మాతాశిశు సంరక్షణలో దేశంలో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 56 టిఫా స్కానింగ్‌ యంత్రాలను హరీశ్‌రావు శనివారం ప్రగతి భవన్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పేట్లబుర్జు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన టిఫా యంత్రాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ అధికారులతో కలిసి ఆరంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గర్భస్థ శిశువుల్లోని లోపాలను గుర్తించేందుకు ‘టిఫా’ (టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనామలీస్‌ స్కాన్‌) దోహదం చేస్తుందని తెలిపారు. రూ.20 కోట్లతో ఏకకాలంలో 56 యంత్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రైవేటులో ఒక్కో స్కాన్‌కు రూ.2-3 వేలు వసూలు చేసేవారని, ఇకపై పేదలకు ఆ భారం తగ్గుతుందన్నారు. ప్రతి నెల సగటున 20 వేల మంది గర్భిణులకు ఈ సేవలు ఉచితంగా అందుతాయన్నారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్సకు వచ్చే గర్భిణులకే కాకుండా.. ఇతర ఆసుపత్రుల నుంచి వచ్చే వారికి కూడా వారంలో ఒకరోజు ఈ స్కానింగ్‌ సేవలు అందించాలని మంత్రి సూచించారు. శిశు మరణాలను తగ్గించడంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఉన్న ఉత్తర్‌ ప్రదేశ్‌.. ప్రభుత్వ వైద్య సేవల్లో అట్టడుగున ఉందని చెప్పారు.

భారీఎత్తున వైద్య సేవల విస్తరణ...

‘రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17 వేల పడకలు ఉంటే.. వాటిని 28 వేలకు పెంచాం. అన్నింటికీ ఆక్సిజన్‌ సదుపాయం కల్పించాం. ఐసీయూ పడకలను 200 నుంచి 6 వేలకు పెంచాం. నగరం నలువైపులా నిర్మిస్తున్న 4 టిమ్స్‌, వరంగల్‌లో 2వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రితో మరో 10 వేల ఆక్సిజన్‌ పడకలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే, ఇప్పుడు 66 శాతం జరుగుతున్నాయి. గతేడాది నుంచి అనవసర సిజేరియన్లు తగ్గాయి. ఆసుపత్రి డెలివరీల్లో దేశ సగటు కంటే తెలంగాణ ముందుంది. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే, ఇక్కడికి వచ్చే భాజపా నాయకులు ప్రచారం కోసం ఏదో ఒకటి మాట్లాడుతున్నారు’’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. 

ఎయిర్‌ ఫిల్టర్లు అందజేసిన రెయిన్‌బో ఆసుపత్రి

పేట్లబుర్జు ఆసుపత్రి ఆపరేషన్‌ థియేటర్లలో వినియోగించేందుకు రూ.1.20 కోట్ల విలువైన ఎయిర్‌ ఫిల్టర్లను రెయిన్‌బో చిన్న పిల్లల ఆసుపత్రి వితరణగా అందించింది. ఆసుపత్రి సీఎండీ డాక్టర్‌ రమేష్‌ కంచర్ల.. ఈ కిట్‌లను హోంమంత్రి మహమూద్‌ అలీకి అందించారు. రమేష్‌ కంచర్లను మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌ సమావేశంలో అభినందించారు. పేట్లబుర్జు ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్‌ శ్వేత మొహంతి, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ శశికళ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని