పరిహారం అందిస్తే పనులిక చకచకా!

నీటిపారుదల శాఖ చనాకా-కొరాటా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతుల కోసం ముమ్మర కసరత్తు చేస్తున్న వేళ.. ప్రాజెక్టు కింద మిగిలి ఉన్న పనులు చర్చనీయాంశంగా మారాయి.

Published : 28 Nov 2022 04:57 IST

పూర్తి కాని ఉప కాలువలు.. డిస్ట్రిబ్యూటరీలు
900 ఎకరాలకు డబ్బు చెల్లిస్తే.. 37 వేల ఎకరాలకు నీళ్లు
డిసెంబరులో వెట్‌రన్‌కు సిద్ధమవుతున్న చనాకా-కొరాటా

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖ చనాకా-కొరాటా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతుల కోసం ముమ్మర కసరత్తు చేస్తున్న వేళ.. ప్రాజెక్టు కింద మిగిలి ఉన్న పనులు చర్చనీయాంశంగా మారాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని కరవు ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు దిగువ పెన్‌గంగపై చనాకా- కొరాటా ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఇప్పుడిది వెట్‌రన్‌కు సిద్ధమయింది. వచ్చే నెలాఖరులోపు పంపుహౌసు నుంచి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసి పరీక్షించనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో జైనథ్‌, బేల, భీంపూర్‌ మండలాల పరిధిలో 37వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుపై ఇక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రధాన పనులన్నీ పూర్తి కావచ్చినా ఆయకట్టుకు సాగునీటిని చేర్చే ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం నేటికీ ప్రారంభించలేదు. నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియ అంతా పూర్తయింది. ప్రభుత్వం నుంచి పరిహారం రావడం ఒక్కటే మిగిలి ఉంది.

900 ఎకరాలు లక్ష్యం: రూ.795.94 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో బ్యారేజీ, పంపుల బిగింపు(రెండు పంపుహౌసులు-6), 42 కిలోమీటర్ల ప్రధాన కాలువ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. 47 నుంచి 89వ కిలోమీటరు వరకు ప్రధాన కాలువ నీటి ప్రవాహానికి సిద్ధంగా ఉంది. బ్యారేజీ నుంచి ఎత్తిపోసే నీరు 47వ కిలోమీటరు వద్ద ఈ కాలువలోకి చేరుతుంది. ఇక్కడి నుంచి దిగువకు నీరు ప్రవహించినా ఉప కాలువలు, పిల్ల కాలువల నిర్మాణం చేయకపోవడంతో ప్రధాన కాలువకే పరిమితమవుతుంది. ఉప కాలువల నిర్మాణానికి సుమారు 900 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. దీనిలో కనీసం 200 ఎకరాలైనా వచ్చే రెండు నెలల్లో సేకరిస్తే ఉప కాలువలకు నీరివ్వడానికి వీలుంటుంది. డిసెంబరులో రెండు పంపులను నడిపి నీటిని ఎత్తిపోసేందుకు పలు విధానాల(ప్రొటోకాల్‌)ను అనుసరించి పరీక్ష పూర్తి చేయనున్నారు. ఇది పూర్తికాగానే ఆయకట్టుకు నీటిని ఎత్తిపోస్తారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు