రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కరవు

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, ఇది దురదృష్టకరమని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. 

Updated : 05 Feb 2023 05:43 IST

రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

గన్‌ఫౌండ్రి, హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, ఇది దురదృష్టకరమని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు.  తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని విమర్శించే ముందు.. కేంద్రం విడుదలచేసిన నిధుల లెక్కలను పరిశీలించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు సూచించారు. రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రూ.29,581 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 39 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపట్టనున్నామని వెల్లడించారు. తెలంగాణలో రెండు రైల్వే ఎక్స్‌లెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాజీపేటలో వ్యాగన్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.521 కోట్లు కేటాయించామన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలను ఇచ్చిందని తెలిపారు. ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో కేంద్రం రూ.600 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. 20 కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లనూ ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సైతం ప్రతిపాదనలు పంపలేదని, భద్రాచలం వరకు రైల్వేలైన్‌ పొడిగింపు డీపీఆర్‌ పెండింగ్‌లో ఉందని సమాధానమిచ్చారు.

భారాస దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి...: తెలంగాణలో అనేక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయిస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రాష్ట్రంలోని భారాస ప్రభుత్వం మాత్రం తమపై తరచూ విమర్శలు చేస్తోందని, ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని భాజపా శ్రేణులకు సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు తదితరులు కలిశారు. కేంద్ర బడ్జెట్‌పై ఈ నెల 12వరకు రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ నేతలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి, పాల్వాయి రజనీ, సంగప్పలతో ఓ కమిటీని సైతం ఏర్పాటుచేశారు.

* శనివారం సాయంత్రం సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో నిర్వహించిన కేంద్ర బడ్జెట్‌పై మేధావుల సదస్సులో అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ వందే భారత్‌ తరహాలో వంద కిలోమీటర్లలోపు నగరాల మధ్య ‘వందే మెట్రో’ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించారు.  రాబోయే 16 నెలల్లో దీనికి సంబంధించిన డిజైన్‌, ఇతర ప్రక్రియలతో పాటు ట్రయల్‌ రన్‌ పూర్తిచేస్తామన్నారు.


కవచ్‌పై సమీక్ష...

ఈనాడు, హైదరాబాద్‌ : ఒకే ట్రాక్‌పై రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఢీకొనకుండా నివారించే కవచ్‌ వ్యవస్థ పనితీరుపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమీక్షించారు. హైదరాబాద్‌కు శనివారం వచ్చిన మంత్రి ఇండియన్‌ రైల్వేస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ (ఇరిసెట్‌)ని సందర్శించారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న 170 మంది ఇంజినీర్లతో మంత్రి సంభాషించారు. ద.మ.రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌, ఇరిసెట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సుధీర్‌కుమార్‌ మంత్రి వెంట ఉన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని