భగ్గుమంటున్న అటవీ ప్రాంతాలు

ముదురుతున్న ఎండలతో పచ్చటి అడవులు భగ్గుమంటున్నాయి. మార్చి 15వ తేదీ నాటికే రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో 8,420 అగ్ని ప్రమాదాలు జరిగాయి.

Published : 19 Mar 2023 04:13 IST

మార్చి 15 నాటికే 8,420 అగ్ని ప్రమాదాలు
రాష్ట్రవ్యాప్తంగా బుగ్గిపాలైన 16,667 ఎకరాల అడవి

ఈనాడు, హైదరాబాద్‌: ముదురుతున్న ఎండలతో పచ్చటి అడవులు భగ్గుమంటున్నాయి. మార్చి 15వ తేదీ నాటికే రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో 8,420 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 7,342 ప్రమాదాలకు సంబంధించిన సమాచారాన్ని అటవీశాఖ సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,667.28 ఎకరాల అటవీ సంపద బుగ్గిపాలైనట్టు అధికారులు గుర్తించి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం దాదాపు రెట్టింపు ఉంటుందని అంచనా. ఈ సంవత్సరం ఎండలు ముందస్తుగా వచ్చాయి. దీంతో ఫిబ్రవరి నాలుగో వారం నుంచి అటవీ అగ్ని ప్రమాదాలు పెరిగాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనుండటంతో అటవీ శాఖ వర్గాలు కలవరపడుతున్నాయి. నవంబరు నుంచి మార్చి వరకు 8,420 ప్రమాదాలు జరిగితే.. ఇందులో 4,371 ప్రమాదాలు ఒక్క మార్చి ప్రథమార్ధంలోనే జరిగాయి. మొత్తం ప్రమాదాలను జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 4,029.34 ఎకరాల అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. ఆ తర్వాత మహబూబాబాద్‌లో 2,981.42 ఎకరాలు, నిర్మల్‌లో 2,769.85 ఎకరాలు.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో 2,239.71 ఎకరాల అటవీ భూమి కాలిపోయింది.

నిమిషాల్లోనే సమాచారం అందుతున్నా..

అడవుల్లో ఎక్కడ కార్చిచ్చు రేగినా ఎస్‌ఎన్‌పీపీ, మోదీస్‌ ఉపగ్రహాల నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే అటవీ శాఖకు సమాచారం అందుతుంది. అటవీశాఖ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదుచేసుకున్న 20 వేల మందికి కూడా ఆ సమాచారం చేరుతుంది. అయినప్పటికీ కార్చిచ్చుల వల్ల జరిగే నష్టం తగ్గడం లేదు. మరోవైపు వాస్తవ నష్టం వివరాలు పంపితే తమపై చర్యలు ఉంటాయన్న భయంతో క్షేత్రస్థాయి ఉద్యోగులు నష్టాన్ని తక్కువ చేసి పంపుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

మానవ నిర్లక్ష్యంతో..

కార్చిచ్చుకు మానవ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అటవీ అధికారులు చెబుతున్నారు. అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వుల్లోని దట్టమైన అటవీప్రాంతం మధ్యలోంచి రహదారులు ఉన్నాయి. అలా వెళ్లేవారు సిగరెట్లు తాగి ఆర్పకుండా వదిలేయడం, మార్గంమధ్యలో వంట చేసుకున్నవాళ్లు పూర్తిగా నిప్పు ఆర్పకపోవడం.. వంటివి కారణాలని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అడవుల్లో మంటలతో పర్యావరణానికి, జీవవైవిధ్యానికి తీరని నష్టం కలుగుతోంది. ముందస్తుగా హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోఉన్నా ప్రమాదాలకు అడుకట్ట పడటం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని