8 విడతలు.. 273.33 కోట్లు

తెలంగాణకు హరితహారం పథకం తొమ్మిదో విడతకు కార్యాచరణ సిద్ధం అవుతోంది. రాష్ట్రంలోని 14,864 నర్సరీల్లో 30.29 కోట్ల మొక్కలను సిద్ధం చేస్తున్నారు.

Published : 29 May 2023 05:00 IST

తెలంగాణకు హరితహారంలో నాటిన మొక్కలివి  
ఈసారి 19.29 కోట్లు నాటాలని లక్ష్యం
హెచ్‌ఎండీఏ పరిధిలో అత్యధికం
గద్వాల, ములుగు జిల్లాల్లో అత్యల్పం

హరితహారంలో నాటేందుకు చిలుకూరు నర్సరీలో సిద్ధం చేసిన మొక్కలు

తెలంగాణకు హరితహారం పథకం తొమ్మిదో విడతకు కార్యాచరణ సిద్ధం అవుతోంది. రాష్ట్రంలోని 14,864 నర్సరీల్లో 30.29 కోట్ల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. వాటిలోని 19.29 కోట్ల మొక్కలను ప్రస్తుత సంవత్సరం(2023)లో నాటనున్నారు. జలాశయాలు, చెరువులు వంటి నీటి వనరుల పక్కన ఎక్కువగా నాటేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అలాగే 2024 వర్షకాలంలో నాటే మొక్కల లక్ష్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే ఏడాది 20.02 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించింది.

తీవ్ర ఎండలతో సమస్య

ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేనివిధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలపై ఈ ప్రభావం పడుతోంది. నర్సరీలను పెంచుతున్న అటవీ, పురపాలక, ఇతర శాఖల సిబ్బంది మొక్కలకు ఎక్కువ నీళ్లు పట్టిస్తున్నారు. గతంలో రోజుకు రెండుసార్లు నీళ్లు పెట్టేవారు. ప్రస్తుతం ఎండలకు వాడిపోకుండా రోజుకు మూడు, నాలుగుసార్లు నీళ్లు  పట్టించాల్సి వస్తోంది.

హెచ్‌ఎండీఏ పరిధిలోనే 6 కోట్లు

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో 6 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీలో కోటి, రంగారెడ్డిలో  78.57 లక్షలు, నల్గొండలో 65.50 లక్షలు,  కొత్తగూడెం జిల్లాలో 65.40 లక్షల లక్ష్యం ఉంది. అత్యల్పంగా ములుగులో 14.79 లక్షలు, గద్వాల్‌లో 14.92 లక్షలు, సిరిసిల్లలో 15.94 లక్షల మొక్కలు నాటనున్నారు.

గ్రేటర్‌లో కుదింపు

2024 వర్షకాలంలో హరితహారం లక్ష్యాల్ని పరిశీలిస్తే... హెచ్‌ఎండీఏలో 7.50 కోట్ల మొక్కలు నాటుతారు. ఈ ఏడాదితో పోలిస్తే అది 25% అధికం. జీహెచ్‌ఎంసీలో 50 లక్షలు. ఈ ఏడాదితో పోలిస్తే 50% తగ్గింది. జగిత్యాల జిల్లాలో 24.26 లక్షల నుంచి 46.06 లక్షలకు పెరిగింది. నారాయణపేటలో 22.87 లక్షల నుంచి వచ్చే ఏడాదిలో 11.50 లక్షలకు తగ్గింది.


హరితహారం ఖర్చు రూ.10,822 కోట్లు

తెలంగాణకు హరితహారం 2015లో ప్రారంభమై... 8 విడతలు పూర్తయింది. ఖర్చు  రూ.10,822 కోట్లకు చేరింది. హరితహారం కారణంగా రాష్ట్రంలో 2015-19 వరకు     6.85% ఫారెస్ట్‌ కవర్‌ పెరిగినట్లు అటవీ శాఖ చెబుతోంది. హరితవనాల్లో 1.70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 19.97 కోట్ల మొక్కలను నాటాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 10.67 కోట్ల మొక్కలను నాటారు.

ఈనాడు, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని