అది.. ‘మనీ’ కేటగిరీ!
వేలం ఒక్కటే తక్కువ... ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే బీటెక్ సీట్లు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో బీ-కేటగిరీ సీట్ల అమ్మకాల పరిస్థితి ఇదీ.
బీటెక్‌లో జోరుగా బీ-కేటగిరీ సీట్ల అమ్మకాలు
‘యాజమాన్య’ దోపిడీ రూ.800 కోట్లుగా అంచనా
ప్రతిభను పక్కనబెట్టి డబ్బులిచ్చినోళ్లకే అవకాశం
ఏటా హెచ్చరికలకే ఉన్నత విద్యామండలి పరిమితం
ఈనాడు - హైదరాబాద్
వేలం ఒక్కటే తక్కువ... ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే బీటెక్ సీట్లు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో బీ-కేటగిరీ సీట్ల అమ్మకాల పరిస్థితి ఇదీ. ప్రతి సంవత్సరం ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు విద్యార్థుల నుంచి అదనంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేస్తున్నట్లు అంచనా. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ మొదలవకుండానే అప్పుడే అనేక కళాశాలల్లో సీట్ల విక్రయాలు పూర్తయినట్లు తెలుస్తోంది.
నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని బీటెక్ సీట్లలో 70% కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుంది. మిగిలిన 30 శాతాన్ని బీ-కేటగిరీగా పిలుస్తారు. వాటిని కళాశాలల యాజమాన్యాలే నింపుకొంటాయి. అందులోనూ సగం సీట్లను జేఈఈ మెయిన్/ఎంసెట్ ర్యాంకులు, చివరగా ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకొని మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే తీసుకోవాలి. మిగిలిన సగం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేయాలి. వాటికి ఏడాదికి 5వేల అమెరికన్ డాలర్లు (రూ.4.12 లక్షలు) ఫీజుగా తీసుకోవాలి. ఈ కోటాలో చేరేందుకు ఎవరూ రాకుంటే వాటిని కూడా యాజమాన్య కోటాలోకి మార్చి భర్తీ చేయాలి. కేవలం మూడు, నాలుగు కళాశాలలు మాత్రమే యాజమాన్య కోటాలో సగం సీట్లను మెరిట్ ఆధారంగా ఇస్తున్నాయి. జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులై, మంచి స్కోర్ సాధించిన విద్యార్థులకు వాటిలో సీట్లు దక్కుతున్నాయి. కానీ... రాష్ట్రంలో 95 శాతానికి పైగా కళాశాలలు నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాలపట్టిక ప్రకటిస్తేనే మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు దరఖాస్తులను స్వీకరించాల్సి ఉన్నా... అందుకు భిన్నంగా జరుగుతోంది.
20 వేల మంది చేరిక
రాష్ట్రంలోని 16 ప్రభుత్వ, 160 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 1.10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కన్వీనర్ కోటాలో 80 వేలు, యాజమాన్య కోటాలో 30 వేల సీట్లు ఉంటాయి. మొత్తం మీద 75 వేల మంది బీటెక్‌లో చేరుతుండగా... అందులో మేనేజ్‌మెంట్ కోటా కింద ప్రవేశాలు పొందేవారు 20 వేల వరకు ఉంటున్నారు. గతంలో ఆ సంఖ్య 16 వేలే ఉండేది. రెండేళ్లుగా కంప్యూటర్ సైన్స్, సంబంధిత బ్రాంచి సీట్లు పెరగడంతో వాటికి విద్యార్థుల నుంచి డిమాండ్ పెరిగింది. సగటున ఒక్కో సీటుకు రూ.5 లక్షలు అనుకున్నా 20 వేల మంది నుంచి రూ.వెయ్యి కోట్ల దోపిడీ సాగుతోంది. కనిష్ఠంగా రూ.4 లక్షలు అనుకున్నా రూ.800 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఆ మొత్తాన్ని నగదు రూపంలోనే తీసుకుంటున్నారు.
కట్టడి చేసే దిశగా చర్యలు శూన్యం
30% సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునేలా కోర్టు తీర్పులున్న మాట వాస్తవమే. కానీ... ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. జేఈఈ మెయిన్‌లో మంచి స్కోర్ పొందిన వారు సైతం ఎక్కడ తమకు సీట్లు దక్కవేమోనని అప్పులు తెచ్చి మరీ సీట్లు కొనుక్కుంటున్నారు. కళాశాలల యాజమాన్యాల్లో అన్ని రాజకీయ పార్టీల వారు ఉండటంతో ప్రభుత్వం సైతం కట్టడికి కనీస చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం(2023-24) మేనేజ్‌మెంట్ కోటా దోపిడీకి చెక్ పెడతామని నిరుడు ఉన్నత విద్యామండలి చెప్పినా... ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు శూన్యం. యాజమాన్యాల దోపిడీపై ప్రతియేటా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నా శాశ్వత పరిష్కారానికి ఉన్నత విద్యామండలి చొరవ తీసుకున్న దాఖలా లేదు. కనీసం గత విద్యా సంవత్సరం యాజమాన్య కోటా కింద భర్తీ అయిన సీట్ల సంఖ్యను కూడా ఇప్పటివరకు బయటపెట్టకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
-
Bandaru: గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు మాజీ మంత్రి బండారు