Telangana: ఉడుకుతున్న రాష్ట్రం.. గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత

అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం ఉడికిపోతోంది. శుక్రవారం దాదాపు అన్ని జిల్లాల్లో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 47 మండలాల్లో వడగాలులతో జనం అల్లాడిపోయారు.

Updated : 10 Jun 2023 06:51 IST

47 మండలాల్లో వడగాలులు
ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లాలకు హెచ్చరికలు

ఈనాడు, హైదరాబాద్‌: అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం ఉడికిపోతోంది. శుక్రవారం దాదాపు అన్ని జిల్లాల్లో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 47 మండలాల్లో వడగాలులతో జనం అల్లాడిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, మణుగూరు, ఖమ్మం జిల్లాలో సింగరేణి, వేంసూరు మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 6.5 డిగ్రీలపైన నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలు, ఖమ్మంలో 7, హనుమకొండ 4, మహబూబాబాద్‌ 4, సూర్యాపేట 4, జనగామ 3, కుమురం భీం ఆసిఫాబాద్‌ 3, పెద్దపల్లి 3, సిద్దిపేట 3, వరంగల్‌ 3, ఆదిలాబాద్‌ 2, నల్గొండ 2, కరీంనగర్‌ జిల్లాలో 2 మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. మరోవైపు రాష్ట్రంలోని పది మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45-46.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. 

శని, ఆదివారాల్లోనూ వేడి గాలులు...

శని, ఆదివారాల్లోనూ రాష్ట్రంలో కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు హెచ్చరికలు సూచనలు జారీ చేసింది. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు రాష్ట్రాలపై కొనసాగుతున్నట్లు స్పష్టంచేసింది.


వడదెబ్బతో ఒకరి మృతి

కొల్చారం, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా కొల్చారానికి చెందిన అజీమొద్దీన్‌ (56) వడదెబ్బతో మృతిచెందాడు. మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురవగా కుటుంబ సభ్యులు మెదక్‌ ఆసుపత్రికి తరలించారు అక్కడ పరిశీలించిన వైద్యులు హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. అజీమొద్దీన్‌ పలు దినపత్రికల్లో విలేకరిగా పనిచేశాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు