ర్యాంకుల పరిమితి.. ‘రుసుములకు అడ్డంకి!’

ర్యాంకు పరిమితి ఆంక్షల కారణంగా రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు  పూర్తిస్థాయి బోధన రుసుం(ట్యూషన్‌ ఫీజు)లకు నోచుకోవడంలేదు.

Published : 30 Jul 2023 03:36 IST

మంచి కళాశాలలో సీటు వచ్చినా.. బోధన ఫీజుకు కష్టాలే!
ఆర్థికంగా నష్టపోతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులు
నాలుగేళ్లుగా పెండింగ్‌లోనే ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: ర్యాంకు పరిమితి ఆంక్షల కారణంగా రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు  పూర్తిస్థాయి బోధన రుసుం(ట్యూషన్‌ ఫీజు)లకు నోచుకోవడంలేదు. ఇది విద్యార్థుల ఉన్నత చదువులకు అడ్డంకిగా మారింది. పేరుపొందిన మంచి ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు లభించిందని ఆనందపడుతున్నా.. పూర్తి ఫీజులు రాక విద్యార్థుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా కళాశాలకు ఫీజుల నియంత్రణ కమిటీ అనుమతించిన ప్రకారం పూర్తి  ట్యూషన్‌ ఫీజులు చెల్లిస్తున్నారు. బీసీ, ఈబీసీ  విద్యార్థులకు మాత్రం ఆ అవకాశం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనా.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి వచ్చిన ర్యాంకుల పరిమితి నిబంధనే కొనసాగుతోంది. దీంతో ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు పొందుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థుల్లో కేవలం 10-15 శాతం మందికి మాత్రమే బోధన రుసుం రూపంలో లబ్ధి కలుగుతోంది. దీంతో లక్షల మంది విద్యార్థులు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇంజినీరింగ్‌లో నిర్దేశించిన పరిమితికి మించి ర్యాంకులు పొందిన బీసీ, ఈబీసీ విద్యార్థులు రూ.35 వేలకుపైగా అదనపు ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ‘ఎంసెట్‌-23’ తొలివిడత కౌన్సెలింగ్‌లో 31,090 మంది ఈబీసీ, బీసీ విద్యార్థులు సీట్లు పొందారు. 10 వేల ర్యాంకు నిబంధన కారణంగా వీరిలో 2,492 మంది మాత్రమే పూర్తిస్థాయి బోధన రుసుమునకు అర్హులయ్యారు.

పదేళ్ల నుంచి సమస్య అలాగే..!

ఉమ్మడి రాష్ట్రం సమయంలోనే ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజుల చెల్లింపు, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు ర్యాంకుల పరిమితి అమలులోకి వచ్చింది. ఎంసెట్‌లో 10 వేల ర్యాంకు, ఈసెట్‌లో వెయ్యి ర్యాంకులోపు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వమే వారు సీటు పొందిన కళాశాల తాలూకు మొత్తం ఫీజును బోధన రుసుం కింద చెల్లిస్తుంది. అంతకంటే ఎక్కువ ర్యాంకు పొందిన వారికి రూ.35 వేలు మాత్రమే అందిస్తుంది. అంతకు మించి ఉన్న ఫీజును విద్యార్థులే భరించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మైనార్టీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం పూర్తి ఫీజులు చెల్లిస్తోంది. గతంతో పోల్చితే ప్రస్తుతం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజులు పెరిగాయి. దాదాపు అన్ని కళాశాలల్లో కోర్సు ఫీజు రూ.లక్ష దాటింది. పేరున్న కళాశాలలో సీటు పొందుతున్న విద్యార్థులు ప్రభుత్వమిచ్చే రూ.35 వేల బోధన రుసుం పోను.. మిగిలిన మొత్తాన్ని సొంతంగా చెల్లిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈసెట్‌లో వెయ్యికి పైగా ర్యాంకు పొంందుతున్న విద్యార్థులు కూడా ఇలాగే ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు.

కనీస ఫీజులు పెరిగినా..

ఫీజుల నియంత్రణ కమిటీ అనుమతి మేరకు ప్రభుత్వం గతేడాది ఇంజినీరింగ్‌ కనీస ఫీజును రూ.35 వేల నుంచి రూ.45 వేలకు పెంచింది. ప్రభుత్వం మాత్రం బీసీ సంక్షేమశాఖకు ఆ మేరకు కనీస ఫీజును పెంచలేదు. ఇప్పటికీ రూ.35 వేలనే ఇస్తూ సరిపెడుతోంది. బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఉన్న ర్యాంకు సీలింగ్‌ విధానాన్ని తొలగించాలని బీసీ సంక్షేమ శాఖ నాలుగేళ్ల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అందుకు ఏటా కనీసం రూ. 300 కోట్లు అవసరమని ఆ శాఖ.. నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకూ ఆమోదం లభించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని