ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై మీడియాలో మాట్లాడొద్దు: ఆయన కుమార్తెకు కోర్టు ఆదేశం

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై మీడియాలో, ఇతర ప్రసార సాధనాల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశిస్తూ ఆయన కుమార్తె తుల్జా భవానీరెడ్డికి హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీచేసింది.

Updated : 14 Aug 2023 07:40 IST

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై మీడియాలో, ఇతర ప్రసార సాధనాల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశిస్తూ ఆయన కుమార్తె తుల్జా భవానీరెడ్డికి హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 9న కోర్టు ఈ నోటీసులు జారీచేయగా.. ఆదేశాల ప్రతులు 10న తమకు అందినట్లు ఆమె కార్యాలయంలో పనిచేసే శివరామకృష్ణ ఆదివారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. చేర్యాలలో కొంత భూమిని తన తండ్రి ఆక్రమించి తన పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారని.. ఇలా ఎందుకు చేశారంటూ.. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డిని భవానీరెడ్డి గతంలో పలు సందర్భాల్లో నిలదీశారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే తన కుమార్తెపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జనగామ, చేర్యాలలో భవానీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రత్యక్షంగా ఎదురుపడి విమర్శలు ఆపినా.. గత నెల రోజులుగా వివిధ టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా తనను కుమార్తె విమర్శిస్తుందంటూ.. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో ఎమ్మెల్యే పిటిషన్‌ దాఖలు చేశారు. తన పరువు తీసేలా తన కుమార్తె మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోందని, ప్రసార మాధ్యమాల్లో ఆమె తన గురించి మాట్లాడకుండా ఆదేశాలివ్వాలని కోరారు. కేసును విచారించిన కోర్టు.. ఎమ్మెల్యేపై ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, ఈ ఆదేశాలు ఈ నెల 30 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని