హార్డ్‌డిస్క్‌ల విశ్లేషణతో ఆధారాల సేకరణ!

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులు దృష్టి సారించారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో వినియోగించిన సాంకేతికతను ఎలా సమకూర్చుకున్నారు..?

Updated : 27 Mar 2024 05:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులు దృష్టి సారించారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో వినియోగించిన సాంకేతికతను ఎలా సమకూర్చుకున్నారు..? అది అధికారంగా సేకరించిందా..? లేక అక్రమ మార్గాన తెచ్చారా..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పాత రికార్డుల్ని తిరగేసే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. ఎస్‌ఐబీలోనే కాకుండా మొబైల్‌ పరికరాల ద్వారా బయటి ప్రాంతాల్లోనూ ఫోన్‌ట్యాపింగ్‌ చేశారనే ఆరోపణలో నిజానిజాలను నిగ్గు తేల్చడంపై అధికారులు దృష్టి సారించారు. అలాగే ఇప్పటికే నాగోల్‌ బ్రిడ్జి కింద మూసీనదిలో ధ్వంసమైన స్థితిలో సేకరించిన హార్డ్‌డిస్క్‌లను విశ్లేషించడం ప్రస్తుత దర్యాప్తునకు కీలకంగా మారింది. న్యాయస్థానంలో సమర్పించేందుకు అవసరమైన సాంకేతిక ఆధారాలు వాటితోనే ముడిపడి ఉండటంతో విశ్లేషణ కోసం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ను ఆశ్రయిస్తున్నారు. అవసరమైతే విదేశీ సాంకేతికత సహకారం తీసుకునే అంశాన్నీ పరిశీలిస్తున్నారు.

అక్రమార్జనపై ఆరా!

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్‌రావుల బాధితుల గురించి ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. తమ ఫోన్లు ట్యాప్‌ చేశారని పలువురు నేతలు, వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్న నేపథ్యంలో తాజా దర్యాప్తు ప్రాధాన్యం సంతరించుకొంది. మరోవైపు ఇలాంటి దందాల ద్వారా వారికి సమకూరిన అక్రమార్జన ఎంత? అనే కోణంలోనూ విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని