చెత్త శుద్ధి టెండర్లు ఏమైనట్లు..?

రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో రెండేళ్లుగా ఘన వ్యర్థాలు(చెత్త) ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. రోజువారీగా చెత్తను శుద్ధి చేసేందుకు ఆహ్వానించిన టెండర్లు కొలిక్కి రావడం లేదు.

Published : 27 Mar 2024 03:59 IST

పురపాలికల్లో పేరుకుపోతున్న ఘన వ్యర్థాలు
ఏడాది నుంచి కదలని దస్త్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో రెండేళ్లుగా ఘన వ్యర్థాలు(చెత్త) ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. రోజువారీగా చెత్తను శుద్ధి చేసేందుకు ఆహ్వానించిన టెండర్లు కొలిక్కి రావడం లేదు. రాష్ట్రంలోని 130 పురపాలక సంఘాల్లో డిజైన్‌ బిల్ట్‌ ఫైనాన్స్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(డీబీఎఫ్‌ఓటీ) ప్రాతిపదికన 2022లో పురపాలక శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఆయా ప్రక్రియలను పూర్తి చేసి ఆరుగురు గుత్తేదారుల పేర్లతో అధికారులు తుది జాబితాను రూపొందించారు. ఏడాది కిందట ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు. అప్పటి నుంచి ఆ దస్త్రాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. అప్పటి ప్రభుత్వం వద్ద అధికారులు పలుమార్లు ప్రస్తావించినా వ్యవహారం కొలిక్కి రాలేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే పురపాలకశాఖ ఉంది. అయితే ఈ టెండర్లను నూతన ప్రభుత్వం ఆమోదిస్తుందా..?లేదా..? అన్నది అధికారులకు అంతుచిక్కకుండా ఉంది.

నిల్వకు అవస్థలు

టెండర్లు తేలకపోవడంతో పురపాలికల్లో చెత్త నిల్వ సమస్యగా మారింది. గడిచిన ఏడాదిన్నరగా సుమారు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త అదనంగా చేరినట్లు సమాచారం. నూతన పురపాలికల్లో సరిపడా విస్తీర్ణంలో డంపింగ్‌ యార్డులు కూడా లేవు. టెండర్లు ఆహ్వానించే నాటికి రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో కలిపి రోజూ 12,125 మెట్రిక్‌ టన్నుల(మె.ట.) చొప్పున చెత్త ఉత్పత్తయ్యేది. అందులో 9,679 మె.ట. శుద్ధి చేస్తుండగా.. మిగిలిన 2,446 మె.ట. శుద్ధి చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు. టెండరు దక్కించుకున్న గుత్తేదారు పదేళ్లపాటు ఆ ప్రక్రియను నిర్వహించి ఆయా ప్లాంట్లను ప్రభుత్వానికి అప్పగించాలన్నది నిబంధన. ప్రస్తుతం రోజూ 13 వేల మె.ట.కు పైగా చెత్త పోగవుతున్నట్లు అంచనా. వెంటనే శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించకపోతే రానున్న రోజుల్లో మరింతంగా పేరుకుపోతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని