Ts Inter: ఇంటర్‌ ఆంగ్లంలోనూ ప్రాక్టికల్స్‌.. ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయాలు

ఇంటర్‌మీడియట్‌ ఆంగ్లం సబ్జెక్టులోనూ వచ్చే విద్యా సంవత్సరం(2023-24) నుంచి 20 శాతం మార్కులను ప్రాక్టికల్స్‌కు కేటాయించనున్నట్లు పాలకమండలి తెలిపింది.

Updated : 12 Nov 2022 08:21 IST

20 మార్కుల కేటాయింపు

ఎంఈసీ గ్రూపునకు ప్రత్యేక గణితం

వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు

ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థులకూ బయోమెట్రిక్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ ఆంగ్లం సబ్జెక్టులోనూ వచ్చే విద్యా సంవత్సరం(2023-24) నుంచి 20 శాతం మార్కులను ప్రాక్టికల్స్‌కు కేటాయించనున్నట్లు పాలకమండలి తెలిపింది. రాత పరీక్షను 80 మార్కులకే పరిమితం చేస్తామని పేర్కొంది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషకు సంబంధించి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెంచేందుకు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ప్రాక్టికల్స్‌ను అమలు చేస్తామని చెప్పింది. ఇప్పటివరకు ఎంఈసీ, ఎంపీసీ గ్రూపునకు ఒకే స్థాయి గణితం ఉంది. ఎంపీసీకి ఉన్నంత కఠినంగా ఎంఈసీ విద్యార్థులకు గణితం ఉండాల్సిన అవసరం లేదని, కామర్స్‌కు తగ్గట్లు సిలబస్‌లో మార్పులు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామంది. అయిదేళ్ల తర్వాత శుక్రవారం జరిగిన ఇంటర్‌బోర్డు పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు ఛైర్మన్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి... వైస్‌ ఛైర్మన్‌, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో 2017 నుంచి అమలు చేసిన వాటికి బోర్డు ఆమోదం తెలపడంతో పాటు పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరును ఈ విద్యా సంవత్సరమే అమలు చేయాలని నిర్ణయించింది. సమావేశం అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఇంటర్‌ పాఠ్య పుస్తకాలను సకాలంలో అందించేందుకు వెంటనే టెండర్లు పిలవాలని నిర్ణయించామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గృహ, వాణిజ్య సముదాయాల్లోని( మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ) ప్రైవేట్‌ కళాశాలలకు ఒకటీ రెండేళ్ల పాటు అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ నుంచి మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నామని, దీనిపై హోంమంత్రితో మాట్లాడామన్నారు. ఇక నుంచి ప్రతి ఏటా మే నెలాఖరు నాటికి అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పరీక్ష ఫీజును పెంచడం లేదని స్పష్టంచేశారు. ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ మూల్యాంకనాన్ని ప్రారంభిస్తామని ద్వితీయ భాష సబ్జెక్టులైన తెలుగు, హిందీ, ఉర్దూలకు అమలు చేస్తామని చెప్పారు. ఆఫ్‌లైన్‌లోనూ పరిశీలించి లోటుపాట్లను సరిదిద్ది వచ్చే సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. సమావేశంలో జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ ఉపకులపతులు కట్టా నర్సింహారెడ్డి, రవీందర్‌, పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఇవీ...

* ఎంపీసీ గ్రూపు రెండో ఏడాది గణితం- 2బిలో ఎక్కువ మంది విద్యార్థులు తప్పుతున్నారు. సిలబస్‌ అధికంగా, కఠినంగా ఉందనే భావన ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కొంత మేర సిలబస్‌ తగ్గిస్తారు. అందుకు ఓ కమిటీ¨ని నియమిస్తారు.

* ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా నీట్‌, కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు(క్లాట్‌) తదితర పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా సిలబస్‌ రూపొందిస్తారు.

* వచ్చే విద్యా సంవత్సరం(2023-24) ప్రథమ, 2024-25లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ద్వితీమ భాష సబ్జెక్టుల సిలబస్‌ మారుస్తారు. నైతికతను పెంచే పాఠాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.

* ఇంటర్‌బోర్డులో 52 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేస్తారు. ఒక్కో చోట మూడు ఉద్యోగాల చొప్పున 15 జిల్లాల్లోని నోడల్‌ అధికారుల కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులను భర్తీ చేస్తారు.

* కామర్స్‌ను కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీగా పిలుస్తారు.

* అంధులు, మూగ, చెవిటి విద్యార్థులకు ఇప్పటివరకు పరీక్షల్లో సాధారణ విద్యార్థుల కంటే 30 నిమిషాల సమయం అధికంగా ఇచ్చేవారు. దాన్ని 60 నిమిషాలకు పెంచుతారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తారు.

మూడు రెట్లకు జరిమానా పెంపు

అనుబంధ గుర్తింపు పొందని కళాశాలల్లోని విద్యార్థులను ‘ప్రైవేట్‌’గా పరీక్షలు రాయించే అంశాన్ని బోర్డు తిరస్కరించింది. ఆ విధానంలో బైపీసీ చదివే విద్యార్థులకు నీట్‌ రాసేందుకు అర్హత ఉండదని, ప్రాక్టికల్స్‌ చేయడం కూడా సమస్య అవుతుందని సమావేశం భావించినట్లు తెలిసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా కళాశాలలను ఒక చోట నుంచి మరో చోటకు తరలించినా, అధిక సెక్షన్లు ప్రవేశపెట్టినా ఇప్పటివరకు ఉన్న జరిమానాను మూడు రెట్లు పెంచేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాదికి అనుబంధ గుర్తింపు, తనిఖీల ఫీజులను కూడా పెంచడానికి సమావేశం పచ్చజెండా ఊపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని