TRS: తెరాస జయభేరి

రాష్ట్రంలోని అయిదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార  తెరాస అన్నింటా భారీ మెజారిటీతో గెలిచింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణ, ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి వంటేరి యాదవరెడ్డి...

Updated : 15 Dec 2021 04:39 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఆరింటా గెలుపు
ఇప్పటికే ఆరుచోట్ల ఏకగ్రీవం
మొత్తం 12 స్థానాలు కైవసం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అయిదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార  తెరాస అన్నింటా భారీ మెజారిటీతో గెలిచింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణ, ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి వంటేరి యాదవరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తాతా మధుసూదన్‌రావు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంసీ కోటిరెడ్డి గెలుపొందారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి దండె విఠల్‌ విజయం సాధించారు. ఖమ్మం, మెదక్‌లలో కాంగ్రెస్‌, కరీంనగర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా తెరాస మాజీ మేయర్‌ పోటీ చేసినా... తెరాస మెజారిటీకి దరిదాపుల్లోకి రాలేదు. ఎన్నికల ఫలితాలపై తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో భారీఎత్తున సంబురాలు నిర్వహించారు. స్థానిక సంస్థల కోటాలో ఇప్పటికే నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానాలు, రంగారెడ్డి, మహబూబ్‌గర్‌ ఉమ్మడి జిల్లాల్లో రెండేసి, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న తెరాస తాజావిజయంతో తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 12 స్థానాలను కైవసం చేసుకుంది.

అధికార పార్టీలో జోష్‌..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఘనవిజయం సాధించడం తెలంగాణ రాష్ట్రసమితికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. శాసనసభ్యుల కోటాలో ఆరింటితో పాటు స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలను పార్టీ నిలబెట్టుకుంది. తద్వారా శాసనమండలిలో తన ఆధిక్యాన్ని చాటుకుంది. మెదక్‌తో పాటు ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ చేయడం, కరీంనగర్‌లో తెరాస మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ అభ్యర్థిగా నిలవడంతో  ఈ ఎన్నికలను అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రజాప్రతినిధులను యాత్రలకు, శిబిరాలకు తరలించింది. ఆశించిన ఫలితాలు రావడంతో తెరాసలో ఆనందం వ్యక్తమయింది. ఖమ్మంలో మాత్రం  ఆశించిన మేరకు ఓట్లు రాలేదని పార్టీ విశ్లేషిస్తోంది. అలాగే బండా ప్రకాశ్‌ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంతో పాటు 2022 జూన్‌లో ఖాళీ కానున్న డి.శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు రాజ్యసభ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరిగే వీలుంది. శాసనసభలో బలం దృష్ట్యా మూడు స్థానాలూ గెలిచే అవకాశాలున్నాయని తెరాస వర్గాలు పేర్కొంటున్నాయి.

తెరాస తిరుగులేని రాజకీయశక్తి: కేటీఆర్‌
ఎమ్మెల్సీ ఎన్నికల్లో  12 స్థానాలకు 12 స్థానాలను గెలుచుకోవడం ద్వారా తెరాస పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెరాస అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ తెరాస ఘన విజయం సాధిస్తూ వస్తోందన్నారు. తెరాస  ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పాలనకు, ప్రజలు ప్రతి ఎన్నికలలోనూ పట్టం కడుతున్నారన్నారు. తెరాసకు రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉందని మరోసారి నిరూపితమైందని పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.  ప్రతిపక్షాల కుట్రలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిప్పికొట్టారన్నారు.

విపక్షాలకు చెంపపెట్టు: ఎన్నికల ఫలితాలు విపక్షాలకు చెంపపెట్టులాంటివని మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌లు పేర్కొన్నారు. హరీశ్‌రావు అరణ్యభవన్‌లో మాట్లాడుతూ,  ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఊహించినట్లుగానే తెరాస అన్ని స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ ఎన్ని జిమ్మిక్కులు చేసినాఎన్ని రకాలుగా మభ్యపెట్టినా ప్రజాప్రతినిధులు ప్రలోభాలకు గురిగాకుండా సీఎం కేసీఆర్‌ వెంట నడిచారు.మెదక్‌లో తెరాస బలం కంటే అదనంగా మరో ఎనిమిది ఓట్లు తెరాసకు వచ్చాయి’’ అన్నారు. ‘భాజపా, కాంగ్రెస్‌లకు కరీంనగర్‌లో అభ్యర్థిని పెట్టే దమ్ములేకుండా... స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలిపాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. వాటికి తగిన శాస్తి జరిగిందన్నారు.

తెలంగాణ భవన్‌లో సంబురాలు
అయిదు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరుగురు తెరాస అభ్యర్థుల విజయాలపై తెలంగాణభవన్‌లో బాణసంచా కాల్చి మంగళవారం పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, గోపీనాథ్‌, ఇతర నేతలు తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారి తెలంగాణభవన్‌కు వచ్చి ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలదండ వేశారు.


36కి చేరిన తెరాస బలం

40 స్థానాలున్న తెలంగాణ శాసనమండలిలో రెండు నెలల వ్యవధిలో 19 మంది కొత్త ఎమ్మెల్సీలు తెరాసకు వచ్చారు. దీంతో శాసనమండలిలో మొత్తం స్థానాలు భర్తీ కాగా... తెరాస, దాని మద్దతుదారులైన ఇద్దరు పీఆర్‌టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో మొత్తం సంఖ్య 36కి చేరుకుంది. మండలిలో తెరాస మిత్రపక్షమైన మజ్లిస్‌కు రెండు స్థానాలు ఉండగా... కాంగ్రెస్‌, యూటీఎఫ్‌ సభ్యులు ఒక్కొక్కరు ఉన్నారు.

కేసీఆర్‌ అభినందనలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన తెరాస అభ్యర్థులకు, పార్టీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. చెన్నైలో ఉన్న ఆయన ఆరుగురు కొత్త ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. అయిదుజిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను అభినందించారు.


ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా

మ్మడి కరీంనగర్‌ జిల్లాలో తెరాస అభ్యర్థులు భానుప్రసాద్‌రావుకు 585 ఓట్లు రాగా, ఎల్‌ రమణకు 479 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు 232 ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1320 ఓట్లు పోల్‌ కాగా 17 ఓట్లు చెల్లలేదు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా

జిల్లాలో మొత్తం 1018 ఓట్లు పోలవగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వంటేరి యాదవరెడ్డి 762 ఓట్లు పొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి  6 ఓట్లు రాగా 12 ఓట్లు చెల్లలేదు.


ఉమ్మడి నల్గొండ జిల్లా

జిల్లాలో మొత్తం 1271 ఓట్లకుగానూ 1233 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 50 ఓట్లు చెల్లలేదు. తెరాస అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి 917 ఓట్లు వచ్చాయి. 691 ఓట్ల మెజార్టీతో ఆయన స్వతంత్ర అభ్యర్థి నగేశ్‌ (226)పై గెలుపొందారు. ఇతర స్వతంత్ర అభ్యర్థులు లక్ష్మయ్య 26, వెంకటేశ్వర్లు 6, రామ్‌సింగ్‌కు 5 ఓట్లు పోలయ్యాయి.


ఉమ్మడి ఖమ్మం జిల్లా

జిల్లాలో తెరాస అభ్యర్థి తాతా మధుకు 480 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థికి 242 ఓట్లు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థిపై మధు 238 ఓట్ల మెజార్టీ సాధించారు. స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లే వచ్చాయి. 12 ఓట్లు చెల్లలేదు.


ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా

జిల్లాలో మొత్తం 862 ఓట్లు పోలవగా.. తెరాస అభ్యర్థి దండె విఠల్‌కు మొత్తం 742 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి పుష్పారాణికి కేవలం 75 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 667 ఓట్ల మెజార్టీతో విఠల్‌ విజయం సాధించారు. ఇక్కడ చెల్లని ఓట్లు 48గా నమోదయ్యాయి.


విజేతలంతా విద్యావంతులే
ఆరుగురు కొత్త ఎమ్మెల్సీల నేపథ్యమిదీ

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎమ్మెల్సీలుగా గెలుపొందిన ఆరుగురూ విద్యావంతులే. ఇద్దరు న్యాయవిద్య అభ్యసించగా, మిగతావారు ఎంబీబీఎస్‌, బీఈ, బీఆర్క్‌, బీఎస్సీ చదివారు. విజేతల వివరాలిలా ఉన్నాయి.

ఎల్‌.రమణ: 1961 సెప్టెంబరు 4న జగిత్యాలలో జన్మించారు. బీఎస్సీ చదివిన ఆయన 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1994, 2009లో జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచారు. 1994-96 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో చేనేత మంత్రిగా ఉన్నారు. 1996లో కరీంనగర్‌ లోక్‌సభ సభ్యునిగా విజయం సాధించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెదేపా తెలంగాణ అధ్యక్షునిగా పనిచేశారు. ఈ జులైలో తెరాసలో చేరారు.

టి.భానుప్రసాద్‌రావు: 1966 మే 3న కరీంనగర్‌లో జన్మించారు. బీఆర్క్‌ చదివిన ఆయన 2009లో తొలిసారిగా కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత తెరాసలో చేరిన ఆయన 2016లో రెండో దఫా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి:  1953లో సిద్దిపేట జిల్లా కాసారంలో జన్మించిన ఆయన ఎంబీబీఎస్‌ చదివారు. తొలుత కాసారం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. 2006లో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ అయ్యారు. 2014, 2018లో గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ గెలుపునకు కృషి చేశారు.

దండె విఠల్‌: 1970 డిసెంబరు 22న సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో జన్మించారు. బీఈ చదివారు. అమెరికాకు వెళ్లారు. అక్కడ 2000లో సాఫ్ట్‌వేర్‌ సంస్థను, ఆ తర్వాత టెలికాం సంస్థలను స్థాపించారు. 2009లో భారత్‌కు వచ్చి తెరాసలో చేరారు. 2014లో సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు.

తాతా మధుసూదన్‌: 1965 జూన్‌ 12న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో జన్మించారు. ఎల్‌ఎల్‌బీ చేశారు. వామపక్ష రాజకీయాల్లో చేరిన ఆయన 1998లో అమెరికాకు వెళ్లి అక్కడ అట్లాంటా తెలుగు సంఘానికి అధ్యక్షునిగా పనిచేశారు. 2014లో తెరాసలో చేరారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

ఎంసీ కోటిరెడ్డి: 1959 అక్టోబరు 15న నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం బోయగూడెంలో జన్మించారు. ఎల్‌ఎల్‌బీ చదివి న్యాయవాదిగా పనిచేశారు.  2015లో తెరాసలో చేరారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్‌ ఆయనకు టికెట్‌ కేటాయించారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని