గ్రామం కోసం.. జార్జియా నుంచి వచ్చి గెలిచింది!

ఈ రోజుల్లో ఎంతోమంది విద్య, ఉపాధి కోసం పల్లెను వదిలి పట్టణాల బాట పడుతున్నారు. విదేశాలకు పయనమవుతున్నారు. కానీ, మహారాష్ట్రకు చెందిన యశోదర రాజే శిందే (21) కథ దీనికి భిన్నం. తను మెడిసిన్‌ చదవడానికి విదేశాలకు వెళ్లినప్పటికీ గ్రామాభివృద్ధి....

Updated : 22 Dec 2022 21:02 IST

ఈ రోజుల్లో ఎంతోమంది విద్య, ఉపాధి కోసం పల్లెను వదిలి పట్టణాల బాట పడుతున్నారు. విదేశాలకు పయనమవుతున్నారు. కానీ, మహారాష్ట్రకు చెందిన యశోదర రాజే శిందే (21) కథ దీనికి భిన్నం. తను మెడిసిన్‌ చదవడానికి విదేశాలకు వెళ్లినప్పటికీ గ్రామాభివృద్ధి కోసం తిరిగి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది.

మహారాష్ట్రలో ఇటీవలే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో సంగ్లీ జిల్లాలోని వడ్డి పంచాయతీ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. జార్జియాలో మెడిసిన్‌ చదువుతోన్న యశోదర.. కుటుంబ సభ్యుల కోరిక మేరకు గ్రామాభివృద్ధి కోసం తిరిగి వచ్చి సర్పంచిగా ఎన్నికల్లో పోటీ చేసింది. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో గెలిచిన పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది.

ఊరి సంక్షేమం కోసం..

వడ్డి గ్రామంలో యశోదర కుటుంబానికి ప్రత్యేకం స్థానం ఉంది. యశోదర ముత్తాత, నానమ్మ వడ్డి పక్క గ్రామమైన నర్వాద్‌కు 25 సంవత్సరాల పాటు సర్పంచిగా సేవలందించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల ప్రకటన వెలువడగానే కొంతమంది వడ్డి గ్రామస్థులు యశోదర కుటుంబాన్ని సంప్రదించి, ‘మీ కుటుంబం నుంచి ఒకరు అభ్యర్థిగా నిలబడాలని’ కోరారు. అందుకు అంగీకారం తెలిపిన ఆ కుటుంబం.. మెడిసిన్‌ చదువుతోన్న యశోదరకు కబురు పంపింది. ఈ క్రమంలో ఊరి సంక్షేమం కోసం.. యశోదర గ్రామానికి తిరిగొచ్చి ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచిగా గెలుపొందింది.

అన్ని వర్గాల కోసం..

కొంతమంది కుటుంబ పలుకుబడి, రాజకీయ నేపథ్యంతో కేవలం అధికారం కోసమే పోటీ చేస్తుంటారు. తను మాత్రం అలా కాదంటోంది యశోదర. ఈ క్రమంలో గ్రామభివృద్ధి కోసం పక్కా ప్రణాళికను రచించుకుంది. మహిళలు, అమ్మాయిలు, పిల్లలు, రైతులు.. ఇలా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతోంది.

ఈక్రమంలో- ‘మహిళలు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి వారికి అన్ని అంశాల్లోనూ పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలనేది నా అభిప్రాయం. ఇందుకు వారికి అవసరమైన అవగాహన కల్పించి పురుషుల మీద ఆధారపడకుండా చేయాలని అనుకుంటున్నా. అమ్మాయిలు, మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం. వారికోసం టాయిలెట్లు నిర్మించడంతో పాటు శానిటరీ న్యాప్‌కిన్లు అందించేందుకు కృషి చేస్తా. అలాగే పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించేలా జాగ్రత్తలు తీసుకుంటా’ అని తెలిపింది.

అదేవిధంగా- ‘గ్రామంలో 70 నుంచి 80 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వారి సుస్థిర అభివృద్ధికి కోసం కృషి చేయాలనుకుంటున్నా. ఇందుకు గ్రామంలో యువత సహకారం తీసుకుంటా. అలాగే వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తా. విద్యార్థుల కోసం ఈ-లెర్నింగ్‌ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నా’ అని చెబుతోంది. సర్పంచిగా గెలిచినా ఎలాగైనా సరే తన వైద్య విద్యను కూడా పూర్తి చేస్తానంటోంది యశోదర.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్