Surrogate Mothers: అద్దె గర్భంతో ‘యశోద’గా మెప్పించారు!

‘సినిమాలో ఒక పాత్ర చేస్తే.. పది కాలాల పాటు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలి’ అనుకుంటున్నారు ఈతరం నటీమణులు. అందుకే సవాళ్లతో కూడిన పాత్రలకే సై అంటున్నారు. అందులోనూ మూసధోరణుల్ని బద్దలుకొట్టే సామాజిక అంశాలపై తమ నటనతో అవగాహన....

Updated : 11 Nov 2022 19:09 IST

‘సినిమాలో ఒక పాత్ర చేస్తే.. పది కాలాల పాటు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలి’ అనుకుంటున్నారు ఈతరం నటీమణులు. అందుకే సవాళ్లతో కూడిన పాత్రలకే సై అంటున్నారు. అందులోనూ మూసధోరణుల్ని బద్దలుకొట్టే సామాజిక అంశాలపై తమ నటనతో అవగాహన పెంచుతున్నారు. టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత కూడా మరోసారి ఇదే మాయ పునరావృతం చేసింది. కెరీర్‌ ఆరంభం నుంచీ విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ.. ఈసారి మరో సవాలుతో కూడిన పాత్రతో మన ముందుకొచ్చింది. తాజాగా విడుదలైన ‘యశోద’ చిత్రంలో అద్దె గర్భాన్ని మోసే మహిళగా కనిపించింది సామ్‌. అద్దె గర్భం సున్నితమైన అంశమే అయినా.. ఇది తల్లిదండ్రులు కావాలనుకునే ఎంతోమంది దంపతులకు వరంగా మారిందంటోన్న ఈ చక్కనమ్మ.. ఇలాంటి సవాలుతో కూడిన పాత్రలే మన సత్తా ఏంటో నిరూపిస్తాయంటోంది. ఈ నేపథ్యంలో వెండితెరపై అద్దె గర్భం మోసిన పాత్రల్లో నటించి మెప్పించిన కథానాయికలెవరు? వాళ్ల అనుభవాలేంటో తెలుసుకుందాం రండి..

సమంత - యశోద

సవాలుతో కూడుకున్న పాత్రలు చేయడానికి టాలీవుడ్‌ బ్యూటీ సమంత ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా విడుదలైన ‘యశోద’ సినిమాతో ఈ విషయం మరోసారి రుజువైంది. అద్దె గర్భం పేరుతో చట్టవిరుద్ధంగా జరిగే కార్యకలాపాలను బట్టబయలు చేసే కథాంశంతో రూపుదిద్దుకుందీ చిత్రం. ఇందులో అద్దె గర్భాన్ని మోసే మహిళ పాత్రలో నటించింది సామ్.

‘యశోద కథ విన్నప్పుడే నా రోమాలు నిక్కబొడిచాయి. సాధారణంగా నేను ఏ సినిమా కథ విన్నా.. నా నిర్ణయం చెప్పడానికి కనీసం ఒక్క రోజైనా సమయం తీసుకుంటా. కానీ యశోదకు మాత్రం వెంటనే ఓకే చెప్పేశా. అంత శక్తిమంతమైన కథ అది. అద్దె గర్భం విషయంలో నాకు ఎలాంటి బలమైన అభిప్రాయాలు లేవు.. కానీ ఇది ఎంతోమందికి పరిష్కారం అని మాత్రం చెప్పగలుగుతా. పలు కారణాల రీత్యా తల్లిదండ్రులు కాలేకపోతున్న ఎంతోమంది దంపతులకు ఇది ఆశాకిరణంలా పరిణమించింది. మన పురాణాల్లో పిల్లలు లేని వారికి దేవతలు ఎలాగైతే పిల్లల్ని వరంగా ప్రసాదించేవారో.. ఈ ఆధునిక యుగంలో సరోగసీ, ఐవీఎఫ్‌ వంటి వైద్య పద్ధతులు అలాంటి వారికి వరంగా మారాయని చెప్పచ్చు. ఏదేమైనా ఇలాంటి సవాలుతో కూడుకున్న పాత్రలో నటిస్తే ఆ అనుభూతే వేరు. ఇక గర్భిణిగా కనిపించినంత సేపు ఎంత సింపుల్‌గా ఉంటానో.. యాక్షన్‌ సన్నివేశాల్లో అంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తా. ఇందుకోసం బాక్సింగ్‌, కిక్‌బాక్సింగ్‌, జూడో.. వంటి విద్యలూ నేర్చుకున్నా..’ అంటోందీ అందాల తార. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైందీ చిత్రం.


కృతీ సనన్‌ - మిమీ

ఇలాంటి పాత్రలను ఎంచుకోవడమే ఓ సవాలంటే.. అందుకోసం బరువు పెరిగి మరో సాహసం చేసింది బాలీవుడ్‌ అందాల తార కృతీ సనన్. ‘మిమీ’ చిత్రంలో నటించే క్రమంలో మూడు నెలల్లో 15 కిలోలు పెరిగిందీ బ్యూటీ. ‘ఒక పాత్రకు పూర్తి న్యాయం చేయాలంటే ముందు దానిలోకి పరకాయ ప్రవేశం చేయాలి.. పాత్రకు తగ్గట్లుగా మనల్ని మనం మలచుకోవాలి. ‘మిమీ’ సినిమా కోసం నేను అదే చేశాను. గర్భిణిగా కనిపించాలంటే బరువు పెరగడం ముఖ్యం. అందుకే ఈ సినిమా కోసం నేను మూడు నెలల్లో 15 కిలోలు పెరిగాను. బరువు తగ్గడమే కాదు.. పెరగడం కూడా కష్టమేనని నాకిప్పుడే అర్థమైంది. ఎందుకంటే నా జీవక్రియలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. ఇలాంటప్పుడు ఏది తిన్నా సులభంగా జీర్ణమవుతుంది.. నా శరీరంలోని క్యాలరీలు కూడా సులువుగా కరుగుతాయి. అలాంటప్పుడు బరువు పెరగడమంటే సవాలే. అందుకే ముందు నా ఆకలిని పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టా. నా డైటీషియన్‌ కూడా నేను ఆయాసపడకుండా ఎక్కువ క్యాలరీలు అందే ఆహార నియమాలు సూచించారు.. తద్వారా బరువు పెరిగే ప్రక్రియ విజయవంతమైంది. ఇక సినిమా పూర్తయ్యాక బరువు తగ్గడం మరో సవాలు. ఏదేమైనా ఇలాంటి సవాలుతో కూడుకున్న పాత్రలు చేస్తున్నామన్న సంతృప్తి ముందు.. ఎంతటి కష్టమైనా దిగదుడుపే..’ అంది కృతి. ఇందులో తన నటనకు ఐఫా, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకుందీ బాలీవుడ్‌ బ్యూటీ.


ఊర్మిళా కొఠారే - వెల్‌కమ్‌ ఒబామా

అద్దె గర్భాన్ని మోసినంత మాత్రాన అమ్మతనం అమ్ముడవుతుందా..? అంటే.. కాదని నిరూపించిన చిత్రం ‘వెల్‌కమ్‌ ఒబామా’. సంతానం లేని విదేశీ దంపతుల కోసం బిడ్డను కనివ్వడానికి ఒప్పుకుంటుంది యశోద అనే మహిళ. తన కూతురు వైద్యం కోసం ఈ పనికి ఒప్పుకున్నా.. ఆ తర్వాత ఆ బిడ్డతో తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. దాంతో తమ బిడ్డను తీసుకెళ్లడానికి ఆ విదేశీ దంపతులు రావడం, అందుకు యశోద నిరాకరించడం.. వంటి సన్నివేశాలన్నీ ఎంతో ఎమోషనల్‌గా సాగుతాయి. మరాఠీ సినిమా ‘Mala Aai Vhhaychy’ కు రీమేక్‌గా సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఈ సినిమాలో సరోగేట్‌ మదర్‌గా నటించి మెప్పించింది మరాఠీ నటి ఊర్మిళా కొఠారే. 2011లో విడుదలైన ఈ చిత్రానికి ఆ ఏటి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం కూడా దక్కింది.

‘విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. ఈ చిత్రం నాకో గొప్ప అనుభూతిని పంచింది. అమ్మతనంలోని అనుభూతుల్ని నాకు పరిచయం చేసింది. ఈ సినిమా ఇతర భాషల్లో రీమేక్‌ అయి విడుదలవడం చాలా సంతోషంగా ఉంది..’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకుంది ఊర్మిళ.


సుస్మితా సేన్‌ - ఫిల్హాల్

సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. మహిళల పట్ల సామాజిక పరిస్థితులు ఎంత కఠినంగా ఉండేవో మనం ఊహించగలం. ఇప్పుడంటే అవగాహన, పరిణతితో మహిళలకు సంబంధించిన చాలా విషయాల గురించి బహిరంగంగా చర్చిస్తున్నాం.. కానీ ఆ సమయంలో ఈ పరిస్థితి లేదు. ఇక అద్దె గర్భం గురించి మాట్లాడడానికి చాలామంది సిగ్గుపడేవారు.. దీన్నో కూడని పనిగా భావించేవారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తెరకెక్కింది ‘ఫిల్హాల్‌’ చిత్రం. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకురాలు మేఘనా గుల్జార్‌ రూపొందించిన ఈ సినిమాలో అద్దె గర్భాన్ని మోసే మహిళగా సుస్మితా సేన్‌ నటించింది. సంతానలేమితో బాధపడుతోన్న తన స్నేహితురాలు రేవా (టబు) కోసం బిడ్డను కనడానికి ముందుకొస్తుంది సియా (సుస్మిత). వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి.

‘అద్దె గర్భం గురించి మహిళలతో పాటు పురుషులు కూడా మాట్లాడడానికి సంకోచించే రోజుల్లో.. ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చే సాహసం చేశారు గుల్జార్‌. ఇలాంటి సున్నితమైన అంశం గురించి వెండితెరపై మరింత సున్నితంగా, నిజాయతీగా వివరించే ప్రయత్నం చేశారామె. యువత దీని గురించి మాట్లాడుకునేలా చేశారు..’ అంటూ ఆ సమయంలో సినీ విశ్లేషకులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సరోగసీ నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాలో అద్దె గర్భాన్ని మోసే తల్లిగా సుస్మిత నటన ఎంతోమందిని ఆకట్టుకుంది. తనకూ ఇలాంటి వైవిధ్యమైన పాత్ర చేసే అవకాశం ఈ సినిమాతో దక్కిందంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ బాలీవుడ్‌ అందం. ఇక నిజ జీవితంలో ఇద్దరు అమ్మాయిల్ని దత్తత తీసుకొని.. తనలోని సామాజిక స్పృహను చాటుకుంది సుస్మిత.


వీళ్లు కూడా!

☞ ఫిల్హాల్‌ సినిమా కథకు దగ్గరగా ఉంటుంది ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’ సినిమా. సల్మాన్‌ ఖాన్‌, రాణీ ముఖర్జీ, ప్రీతీ జింటా కలిసి నటించిన ఈ సినిమాలో.. సల్మాన్‌, రాణి దంపతులుగా ముఖ్య పాత్రలు పోషించారు. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో.. అద్దె గర్భం పద్ధతిని ఆశ్రయిస్తుందీ జంట. దీంతో సరోగసీ తల్లిగా మారడానికి ప్రీతి ముందుకొస్తుంది. ఇందులో ప్రీతి నటన, సరోగసీ తల్లిగా ఆమె ఎమోషన్స్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.

☞ ప్రమాదంలో గాయపడ్డ తన భర్తను బతికించుకునేందుకు సరోగసీ తల్లిగా మారేందుకు సిద్ధపడ్డ మహిళ కథతో రూపొందించిన చిత్రం ‘9 నెలలు’. ఇందులో దివంగత నటి సౌందర్య అద్దె గర్భం మోసే పాత్రలో నటించి మెప్పించింది.

☞ ఇలా సినిమాల్లోనే కాదు.. మరాఠా నటి సాయి తమ్హన్కర్‌ ‘అనుబంధ్‌’ అనే మరాఠీ సీరియల్‌లో సరోగసీ తల్లి పాత్రలో నటించి మెప్పించింది. ‘ఈ పాత్ర నాకు అమ్మతనంలోని మాధుర్యాన్ని పంచింది. చిత్రీకరణ ముగిసినా నేను ఆ ఫీలింగ్‌ నుంచి బయటికి రాలేకపోయా’నంటూ ఓ సందర్భంలో పంచుకుందీ బుల్లితెర బ్యూటీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్