అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!

కొంతమందికి ఏ విషయం గురించైనా లోతుగా ఆలోచించడం అలవాటు. అయితే కొంతమంది పదే పదే అవే ఆలోచనల్లో మునిగిపోయి బాధపడుతుంటారు. ఈ మనోవేదన క్రమంగా కట్టలు తెంచుకుంటుంది.. మనల్ని ఒత్తిడి, ఆందోళనల్లోకి నెట్టేస్తుంది.

Published : 04 May 2024 14:10 IST

కొంతమందికి ఏ విషయం గురించైనా లోతుగా ఆలోచించడం అలవాటు. అయితే కొంతమంది పదే పదే అవే ఆలోచనల్లో మునిగిపోయి బాధపడుతుంటారు. ఈ మనోవేదన క్రమంగా కట్టలు తెంచుకుంటుంది.. మనల్ని ఒత్తిడి, ఆందోళనల్లోకి నెట్టేస్తుంది. ‘వర్రీ బర్నౌట్‌’గా పిలిచే ఈ మానసిక సమస్య బారిన పడుతోన్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు, వివక్ష, హింస, పని ప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలు.. వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం చూపకముందే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు. మరి, బాధ కట్టలు తెంచుకుంటే ఎలాంటి సమస్యలొస్తాయి? ఈ భావోద్వేగాల్ని అదుపులోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

‘కీడెంచి మేలెంచమ’న్నారు పెద్దలు. కొంతమంది మహిళలు ప్రతి విషయానికీ ఈ సూత్రాన్ని ఆపాదించుకుంటారు. అవసరం ఉన్నా, లేకపోయినా పదే పదే దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతుంటారు. ప్రతికూల ఆలోచనలు చేస్తుంటారు. ఈ నెగెటివిటీ కొన్నాళ్లకు కట్టలు తెంచుకొని.. మన భావోద్వేగాలు అదుపు తప్పేలా చేస్తుంది. ‘వర్రీ బర్నౌట్‌’గా పిలిచే ఈ పరిస్థితికి.. మనలోని అనవసర భయాలు, చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు, హార్మోన్లలో మార్పులు, శారీరక అలసట.. వంటివి కారణమవుతాయంటున్నారు నిపుణులు.

ఈ లక్షణాలు కనిపిస్తే..!

చాలావరకు మానసిక సమస్యలు తీవ్ర రూపం దాల్చే దాకా బయటపడవు. వర్రీ బర్నౌట్‌ కూడా ఇదే కోవలోకొస్తుందంటున్నారు నిపుణులు. అయినప్పటికీ శారీరక, మానసిక ప్రవర్తన ద్వారా ఈ సమస్యకు సంబంధించిన ప్రాథమిక లక్షణాల్ని గుర్తించడం కొంతవరకు సులువవుతుందంటున్నారు.

⚛ చిన్న విషయాలకే ఒత్తిడికి గురవడంతో పాటు ఒక రకమైన ఆతృత మనలో కనిపిస్తుంది.

⚛ అది సామాజిక అంశమైనా.. తమకు ఒక్కరికే సమస్య వచ్చినట్లుగా అధైర్య పడుతుంటారు. ఒంటరిగా ఫీలవుతుంటారు.. ఈ క్రమంలో నలుగురితో కలవడానికి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడరు.

⚛ వార్తలు, వార్తలకు సంబంధించిన కార్యక్రమాలు చూడడానికి ఆసక్తి చూపరు. వాళ్ల సమక్షంలో ఎవరైనా వీటి గురించి మాట్లాడినా, చూసినా.. చిరాకు పడడం, కోపగించుకోవడం.. వంటి లక్షణాలు వర్రీ బర్నౌట్‌ ఉన్న వారిలో గమనించచ్చు.

⚛ ఉత్సాహాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతుంటారు. తద్వారా వారి జీవనశైలిలో మార్పులొస్తుంటాయి. నిద్ర లేవడం దగ్గర్నుంచి.. ఇంటి పనులు, ఆఫీసు పనులు.. ఇలా ప్రతిదీ భారంగా పూర్తి చేస్తుంటారు.

⚛ చిన్న విషయానికే చిరాకు పడడం వర్రీ బర్నౌట్‌ ఉన్న వారిలో కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇంటా, బయట అనే తేడా లేకుండా తమను మాట్లాడించిన వారిపై చీటికీ మాటికీ చిరాకు పడుతుంటారు.

⚛ ఇలా ప్రతి విషయానికీ అతిగా ఆలోచిస్తూ, బాధపడడం వల్ల వారి మనసు సున్నితంగా మారిపోతుంది. తద్వారా అనవసర విషయాలకే భయపడడం, ఏడవడం.. వంటి లక్షణాల్నీ వీరిలో గుర్తించచ్చు.


ఎలా బయటపడాలి?

మానసికంగానే కాదు.. శారీరక ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం చూపే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. మన జీవనశైలిలో మార్పులు-చేర్పులు చేసుకోవడంతో పాటు కొన్ని అలవాట్లు అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు.

⚛ యోగా, ధ్యానం.. ఎలాంటి సమస్యనైనా దూరం చేసే శక్తి వీటికి ఉంది. వర్రీ బర్నౌట్‌కూ ఇవి దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. ఈ వ్యాయామాలు సాధన చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు సమతులమై.. ప్రశాంతత దరిచేరుతుంది. రక్తపోటు అదుపులోకొస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

⚛ వర్రీ బర్నౌట్‌ను దూరం చేసుకోవాలంటే రైటింగ్‌ను సాధన చేయడం చక్కటి మార్గం అంటున్నారు నిపుణులు. మనలోని ఆలోచనల్ని పేపర్‌పై పెట్టడం వల్ల మన ఒత్తిళ్లు, ఆందోళనలు, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యలు దూరమై సానుకూల ఆలోచనలు పెరిగినట్లు ఓ అధ్యయనంలో తేలింది.

⚛ శ్వాస సంబంధిత వ్యాయామాలు, కార్డియో ఎక్సర్‌సైజ్‌లు సుఖనిద్రకు ప్రేరేపిస్తాయి. అలాగే హ్యాపీ హార్మోన్లైన ఎండార్ఫిన్లను విడుదల చేస్తాయి. తద్వారా మనసులోని ప్రతికూల ఆలోచనలు దూరమై ప్రశాంతత చేకూరుతుంది.

⚛ మనసులోని బాధ పంచుకుంటేనే తగ్గుతుందంటున్నారు నిపుణులు. వర్రీ బర్నౌట్‌తో బాధపడే వారికీ ఇది వర్తిస్తుంది. కాబట్టి మీ ఆందోళన చిన్నదైనా, పెద్దదైనా.. మీకు నచ్చిన వారితో పంచుకుంటే.. మనసుకు కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది.. అలాగే సమస్యకు తగిన పరిష్కారం కూడా దొరకచ్చు.

ఇన్ని చేసినా ఫలితం లేకపోయినా.. ప్రతికూల ఆలోచనలు మరింత ఎక్కువైనా.. ఆలస్యం చేయకుండా మానసిక నిపుణుల్ని సంప్రదించాలి. మీ సమస్యను బట్టి వారు తగిన చికిత్స, కౌన్సెలింగ్‌తో మిమ్మల్ని తిరిగి పూర్వపు స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్