Anand Mahindra: ఆమె జీవితమే నాకు స్ఫూర్తి!

ఎంత గొప్ప వ్యక్తులకైనా స్ఫూర్తి ప్రదాతలు ఎవరో ఒకరుంటారు. వారందించిన స్ఫూర్తిని పదే పదే తలచుకుంటూ ప్రేరణ పొందుతుంటారు. అలా భారతీయ వ్యాపార దిగ్గజమైన ఆనంద్‌ మహీంద్రాకూ ఓ స్ఫూర్తి ప్రదాత ఉన్నారు.

Updated : 16 Mar 2024 15:25 IST

ఎంత గొప్ప వ్యక్తులకైనా స్ఫూర్తి ప్రదాతలు ఎవరో ఒకరుంటారు. వారందించిన స్ఫూర్తిని పదే పదే తలచుకుంటూ ప్రేరణ పొందుతుంటారు. అలా భారతీయ వ్యాపార దిగ్గజమైన ఆనంద్‌ మహీంద్రాకూ ఓ స్ఫూర్తి ప్రదాత ఉన్నారు. తనెవరో కాదు.. అమెరికన్‌ టెన్నిస్‌ తార సెరెనా విలియమ్స్‌! మరి, సెరెనా ఈ బిజినెస్‌ టైకూన్‌లో ఎలా స్ఫూర్తి నింపారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి..

దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా పేరున్న ఆనంద్‌ మహీంద్రా.. వయోభేదం లేకుండా ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన.. ప్రతిభావంతుల వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ వారిని ప్రశంసిస్తుంటారు. అలాంటి తనకు అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ వీడియో ఒకటి ఎప్పుడూ స్ఫూర్తి నింపుతుంటుందని ఓ సందర్భంలో పంచుకున్నారు.

ప్రతి మహిళా ఓ సెరెనా కావాలి!

‘2016 వింబుల్డన్‌ టోర్నీకి సంబంధించిన వీడియో అది. ఆ టోర్నీలో మహిళల టైటిల్‌ను సెరెనా గెలుచుకున్నారు. మ్యాచ్‌ ముగిశాక ఆమె మాట్లాడిన మాటలు నేనెప్పటికీ మర్చిపోలేను. తన కెరీర్లో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారో, ఎంత వర్ణ వివక్షను అధిగమించారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అయినా ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ఆమె ఎదిగిన తీరు నాలో ప్రతి క్షణం స్ఫూర్తి నింపుతుంటుంది. మహిళా శక్తికి నిదర్శనంగా నిలుస్తుంటుంది. అందుకే ప్రతి మహిళా సెరెనాలా దృఢంగా, సానుకూల దృక్పథంతో ఉండాలి. ఈ వీడియోను ఇప్పటికీ నా వద్ద భద్రంగా దాచుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చారీ బిజినెస్‌మ్యాన్‌. ఇదే వీడియోను ఓసారి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరలైంది. ఇదొక్కటే కాదు.. యువతలో ఉన్న ప్రతిభాపాటవాల్ని ప్రశంసిస్తూ మహీంద్రా పోస్ట్‌ చేసే ప్రతి వీడియో సోషల్‌ మీడియాలో ఓ సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంది. ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతుంటుంది.

వాళ్లకు నా సెల్యూట్!

సోషల్‌ మీడియాలో తన ట్వీట్స్‌తో అందరిలో స్ఫూర్తి నింపే ఆనంద్‌ మహీంద్రా ఓ సందర్భంలో వర్కింగ్‌ ఉమన్‌ ఎదుర్కొంటోన్న సవాళ్లు, ప్రతికూలతల గురించి ప్రస్తావించారు. పురుషులకున్న సానుకూలతలు, మహిళలుగా వాళ్ల సమస్యల్ని పోల్చి చూస్తూ వేసిన ఓ కార్టూన్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఆయన.. ‘ఓసారి నేను ఏడాది వయసున్న నా మనవడి బాధ్యతలు చూసుకున్నా. అప్పుడే నాకు ప్రత్యక్షంగా అర్థమైంది.. వర్కింగ్‌ విమెన్‌ ఎదుర్కొంటోన్న సమస్యలేంటో! ఇటు ఇంటిని, అటు కెరీర్‌ని బ్యాలన్స్ చేయడం ఎంత కష్టమైందో అప్పుడే నాకు అవగతమైంది. ఇలాంటి మహిళలందరికీ నా సెల్యూట్‌. ఈ సవాళ్లను ఎదుర్కొని మరీ రాణిస్తోన్న వీళ్ల శక్తిసామర్థ్యాలు పురుషులతో పోల్చితే ఎక్కువే!’ అన్నారీ బిజినెస్‌ దిగ్గజం. ఇలా ఆయన మాటలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఎంతోమందిని స్పందింపజేశాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్