DigitALL: ఈ అవరోధాలు దాటితే.. ఇక్కడా మనదే పైచేయి!

వివిధ రంగాల్లో మనవైన ప్రతిభాసామర్థ్యాలతో దూసుకుపోతున్నా శాస్త్ర సాంకేతిక రంగాల (STEM) విషయానికొచ్చేసరికి మాత్రం మన సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది.  ప్రపంచవ్యాప్తంగా కేవలం 28 శాతం మంది మహిళలు మాత్రమే ఈ రంగాల్లో పనిచేస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. మరి మిగిలిన వాళ్లు ఈ అరుదైన రంగాల్ని ఎంచుకోవడానికి...

Updated : 08 Mar 2023 17:05 IST

వివిధ రంగాల్లో మనవైన ప్రతిభాసామర్థ్యాలతో దూసుకుపోతున్నా శాస్త్ర సాంకేతిక రంగాల (STEM) విషయానికొచ్చేసరికి మాత్రం మన సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది.  ప్రపంచవ్యాప్తంగా కేవలం 28 శాతం మంది మహిళలు మాత్రమే ఈ రంగాల్లో పనిచేస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. మరి మిగిలిన వాళ్లు ఈ అరుదైన రంగాల్ని ఎంచుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నట్లు? అంటే.. అందుకు ఈ సమాజంలో ఉన్న ఎన్నో అవరోధాలే కారణమంటున్నారు నిపుణులు. వాటిని అధిగమించినప్పుడే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతుందంటున్నారు. ‘DigitALL’ అంటూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమానత్వాన్ని కోరుతోన్న ఈ ఏటి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా.. స్టెమ్‌లో మహిళల ఉన్నతికి అడ్డుపడుతోన్న ఆ అవరోధాలేంటో? వాటిని ఎలా అధిగమించాలో? తెలుసుకుందాం రండి..

అమ్మాయిల్ని ప్రోత్సహిస్తున్నారా?

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. స్కూలింగ్‌ దశలోనే వారి చదువుకు బలమైన పునాది వేయాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులు చిన్నారుల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమివ్వాలి. వారు ఎంచుకున్న రంగంలో వారిని ప్రోత్సహించాలి. కానీ ఈ విషయంలో అమ్మాయిలు-అబ్బాయిలకు సమన్యాయం దక్కట్లేదనే చెప్పాలి. ఆడపిల్లలన్న కారణంతో ఇప్పటికీ కొంతమంది వారిని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రోత్సహించడానికి వెనకాడుతున్నారు. మరికొంతమంది తమ ఇష్టాల్ని తమ పిల్లలపై రుద్దుతూ వారి కోరికల్ని అణచివేస్తున్నారు. ఇదే ఈ రంగాల్లో అమ్మాయిల సంఖ్య పెరగకపోవడానికి ప్రధాన అవరోధమవుతుందంటున్నారు నిపుణులు. దీన్ని తొలగించాలంటే ఆడ-మగ అన్న భేదాన్ని పక్కన పెట్టి.. ఎవరికి ఆసక్తి ఉన్న రంగాల్లో వారిని ప్రోత్సహించాలి. ఇలా తల్లిదండ్రులతో పాటు స్కూల్లో టీచర్లూ శాస్త్ర సాంకేతిక రంగాల ప్రాముఖ్యాన్ని ఆడపిల్లలకు వివరించాలి.. ఆయా రంగాల్లో మేటిగా నిలిచిన మహిళల స్ఫూర్తి గాథల్ని వారికి ఉదాహరణగా చూపాలి. స్టెమ్‌లో అమ్మాయిల సంఖ్య పెంచడానికి ఇలాంటి ప్రేరణే కావాలంటున్నారు నిపుణులు.

మెంటరింగ్ ఏది?

కేవలం కెరీర్‌ను ఎంచుకునే విషయంలోనే కాదు.. సమాజంలోని అవరోధాలన్నీ దాటుకొని ఎలాగోలా తమకు నచ్చిన స్టెమ్‌ రంగాల్లోకి అడుగుపెట్టినా.. అక్కడా ఎన్నో రకాలుగా మహిళల ఎదుగుదలకు ఆటంకం కలుగుతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా పని ప్రదేశంలో సరైన మార్గనిర్దేశనం లేకపోవడం, ప్రతిభకు తగ్గట్లుగా పదోన్నతులు, జీతభత్యాలు లభించకపోవడం.. వంటివి ఈ రంగాల్లో మహిళలు అందలమెక్కకుండా అడ్డుపడుతున్నాయి. ఏ ఒక్కరూ పనిలో చేరగానే నిష్ణాతులు కాలేరు. అప్పగించిన బాధ్యతల్ని, పనుల్ని నిర్వర్తించే క్రమంలోనే పనితనాన్ని పెంచుకోవడంతో పాటు అనుభవమూ గడిస్తాం. అయితే ఇందుకోసం ఓ మెంటర్ తప్పనిసరి! నిజానికి ఇలా మార్గనిర్దేశనం చేసే విషయంలోనూ పురుషులతో పోల్చితే మహిళలకు సరైన గైడెన్స్‌ అందట్లేదని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కష్టపడేతత్వం ఉన్నా దాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల మరిన్ని అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి అవరోధాలు మహిళల ఉన్నతికి అడ్డుపడకుండా ఉండాలంటే.. ఆయా సంస్థలు వారి శక్తిసామర్థ్యాలకు ప్రాధాన్యమిస్తూ.. వారికి అన్ని విషయాల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలంటున్నారు నిపుణులు.

అమ్మైతే.. తప్పేంటి?!

ఇతర రంగాల్లో మహిళా ఉద్యోగులు 48 శాతంగా ఉంటే.. అదే స్టెమ్‌లో సుమారు 27 శాతంగా ఉన్నట్లు ఓ అధ్యయనం చెబుతోంది. ఇలా ఈ రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం తక్కువగా ఉండడానికి మరో కారణం.. పెళ్లి, పిల్లలు! పెళ్లయ్యాక ఉద్యోగంలో కొనసాగడం భర్త-అత్తింటి వారికి ఇష్టం లేకపోవడం, అదనపు బాధ్యతలు పైన పడడం, ఇక పిల్లలు పుట్టాక కెరీర్‌పై దృష్టి పెట్టే సమయం వారికి ఉండదన్న వాదనలూ బలంగానే వినిపిస్తుంటాయి. కానీ ఇలాంటి బాధ్యతల మధ్య కూడా కెరీర్‌లో విజయాలు సాధిస్తోన్న మహిళలు చాలామందే ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది మహిళలు ఎదుగుతున్నారు. ‘మనసుంటే మార్గముంటుంద’న్నట్లు.. ఇలాంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే చక్కటి ప్రణాళికతో శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ దూసుకుపోవచ్చంటున్నారు నిపుణులు.

ఈ ‘సిండ్రోమ్‌’ మీలోనూ ఉందా?

మనపై మనకు నమ్మకమున్నా.. ఒక్కోసారి అవతలి వారి మాటలు మనల్ని నిరుత్సాహపరుస్తుంటాయి. మన నైపుణ్యాలు, ప్రతిభ, పనితనంపై స్వీయ సందేహాలు రేకెత్తిస్తాయి. దీన్నే ‘ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌’గా పేర్కొంటున్నారు నిపుణులు. ఈ సమయంలో ‘అసలు నేను ఈ రంగానికి సూటవుతానా?’ అన్న అనుమానాలూ కలగకపోవు. దీంతో పనిపై దృష్టి పెట్టలేం.. వచ్చిన అవకాశాల్నీ పక్కన పెట్టేస్తుంటాం.. ఒక రకంగా ఇదీ ఈ రంగాల్లో వెనకబడిపోవడానికి కారణమే అంటున్నారు నిపుణులు. కాబట్టి ‘అనుమానం పెనుభూతం’ అన్నట్లు కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపే ఇలాంటి సందేహాలకు స్వస్తి పలికి.. తమ శక్తిసామర్థ్యాలపై దృష్టి పెట్టాలంటున్నారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత దాగుంటుంది. దాన్ని శోధించి సానపెడితే.. కెరీర్‌లో మీకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించచ్చు.. ఫలితంగా మరికొంతమందిలో స్ఫూర్తి నింపచ్చు.

మనకు మనమే తోడు!

‘మహిళలే మహిళల్ని ముందుకు నడిపించగలరు’ అని చెబుతుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవరోధాలు దాటుకొని ఉన్నతి సాధించాలంటే ఈ సూత్రమే వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఇప్పటికే ఈ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు ఔత్సాహికుల్లో స్ఫూర్తి నింపాలి. వారికి చేయూతనందించాలి. ఇక చిన్న వయసు నుంచే ఇతరుల అభిప్రాయాలతో పనిలేకుండా మీ మనసు చెప్పింది వింటే ఆసక్తితో మరిన్ని నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. స్వీయ నమ్మకం. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మెరుగైన అవకాశాల్ని తెచ్చిపెడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్