కట్నం ఇవ్వరు.. కాళ్లతో వండి వడ్డిస్తారు!

‘వరకట్న నిషేధ చట్టం - 1961’ ప్రకారం మన దేశంలో కట్నం ఇవ్వడం, తీసుకోవడం.. రెండూ నేరమే! అయితే ఇది మాటలు, పుస్తకాలకే పరిమితమవుతోందే తప్ప ఎక్కడా చేతల్లో కనిపించట్లేదనే చెప్పాలి. ఇప్పటికీ వరకట్న వేధింపులకు నవ వధువులు, మహిళలు బలవడం రోజూ వార్తల్లో చూస్తున్నాం. ఇలాంటి కట్న పిశాచులకు ఓ గిరిజన తెగ కనువిప్పు కలిగిస్తోందని చెప్పచ్చు.

Published : 23 Mar 2024 12:27 IST

(Representational Images)

‘వరకట్న నిషేధ చట్టం - 1961’ ప్రకారం మన దేశంలో కట్నం ఇవ్వడం, తీసుకోవడం.. రెండూ నేరమే! అయితే ఇది మాటలు, పుస్తకాలకే పరిమితమవుతోందే తప్ప ఎక్కడా చేతల్లో కనిపించట్లేదనే చెప్పాలి. ఇప్పటికీ వరకట్న వేధింపులకు నవ వధువులు, మహిళలు బలవడం రోజూ వార్తల్లో చూస్తున్నాం. ఇలాంటి కట్న పిశాచులకు ఓ గిరిజన తెగ కనువిప్పు కలిగిస్తోందని చెప్పచ్చు. అక్కడి పెళ్లిళ్లలో కట్నం అనే మాటకు తావు లేదు. ఈ పేరెత్తినా, అక్కడి నియమాలకు విరుద్ధంగా కట్నం పుచ్చుకున్నా తీవ్రమైన శిక్షలు తప్పవట! ఏళ్లకేళ్లుగా పాటిస్తోన్న ఈ కఠిన నియమాల వల్ల అక్కడ వరకట్న వేధింపులు, నవ వధువుల ఆత్మహత్యలు పూర్తిగా అంతమొందినట్లు ఈ తెగ వారు చెబుతున్నారు. ఇదే కాదు.. ఇక్కడి పెళ్లిళ్లలో మరో వింత ఆచారం కూడా ఉంది. ఇంతకీ ఏంటా తెగ? ఎక్కడుంది? మహిళా సాధికారతకు అద్దం పట్టే వారి వివాహ సంప్రదాయాలేంటో తెలుసుకుందాం రండి..

ఎన్ని చట్టాలు చేసినా, కఠిన శిక్షలు విధిస్తున్నా నేటికీ వరకట్న దాహానికి ఎంతోమంది నవ వధువులు బలవుతున్నారు. కట్నం పేరుతో అమ్మాయిల్ని వేధిస్తోన్న ఇలాంటి దాహార్తులకు బిహార్‌ పశ్చిమ చంపారన్‌ జిల్లాలో విస్తరించి ఉన్న ‘థరు తెగ’ కనువిప్పు కలిగిస్తోంది. రోజులు మారుతోన్నా, తరాలు మారుతోన్నా వరకట్నం విషయంలో ఈ తెగ ప్రజలు పెట్టుకున్న సిద్ధాంతాలు మాత్రం శిలాశాసనమే!

వధూవరులే దేవతలుగా..!

ఇక్కడి పెళ్లిళ్లలో కట్నం ఇవ్వడం.. తీసుకోవడం.. రెండూ నేరమే! ఒకవేళ ఈ నియమాల్ని ఉల్లంఘిస్తే వారికి పలు రకాల కఠిన శిక్షలు విధిస్తారట ఈ తెగ పెద్దలు. వీటిలో గ్రామ బహిష్కరణ కూడా ఒకటి. అయితే సాధారణంగా మన పెళ్లిళ్లలో వరుడి కుటుంబ సభ్యులు వధువు ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లడం, పెళ్లి నిశ్చయమైతే.. కట్న కానుకల రూపంలో కొంత మొత్తాన్ని వరుడి తరఫు వారికి అప్పగించడం తెలిసిందే! అయితే థరు తెగలో ఈ పద్ధతి కూడా నిషిద్ధం. ఇక్కడ.. పెళ్లి నిశ్చయించుకోవడంలో భాగంగా వరుడి తరఫు కుటుంబ సభ్యులు వధువు ఇంటికి వెళ్లినా.. వివాహం నిశ్చయమైతే వరుడి తరఫు వారే వధువు కుటుంబ సభ్యులకు రూ. 5 లేదా రూ. 11 ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అది కూడా కట్నంగా కాదు.. ఓ చిన్న కానుకగానే! అలాగని ఈ డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం కూడా పూర్తిగా ఇరు కుటుంబాల ఇష్టాయిష్టాల పైనే ఆధారపడి ఉంటుందే తప్ప బలవంతమేమీ లేదని అక్కడి వారు చెబుతారు. ఇక ఈ తెగలోని వివాహాల్లో వధూవరులిద్దరినీ దేవతా ప్రతిరూపాలుగా, ఈ పెళ్లిని దైవ వివాహంగా పరిగణిస్తారట! ఇలా స్త్రీపురుష సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంటాయి ఇక్కడి పెళ్లిళ్లు.

చదువుకోవడం వల్లేనా?!

చదువుతోనే సంస్కారం అబ్బుతుందంటారు. అయితే కొంతమంది ఉన్నత చదువులు చదివినా, ఉన్నత స్థానాల్లో ఉన్నా.. వరకట్నం పేరుతో అమ్మాయిల్ని వేధిస్తుంటారు.. చదువులేని సంస్కార హీనులుగా ఈ సమాజం దృష్టిలో మిగిలిపోతుంటారు. కానీ చదువుతో పాటు సంస్కారాన్నీ పుణికిపుచ్చుకున్నారు థరు తెగ ప్రజలు. తరతరాల నుంచీ స్త్రీ పురుష సమానత్వానికి ప్రతీకగా నిలుస్తోన్న ఈ తెగ.. చదువు విషయంలోనూ లింగ సమానత్వాన్ని చాటుతోంది. అమ్మాయి, అబ్బాయి అన్న తేడా లేకుండా తమ పిల్లలు పైచదువులు చదువుకునేలా ఇక్కడి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఇద్దరూ సమానమైన విద్యార్హతల్ని పొంది, వృత్తి ఉద్యోగాల్లో రాణించడం కూడా ఇక్కడ వరకట్న సమస్య లేకపోవడానికి ప్రధాన కారణం అంటున్నారు ఇక్కడి ప్రజలు. ఇలా ఈ విషయంలో నాటి కాలం నుంచే పాటిస్తోన్న కచ్చితమైన నియమాల వల్ల ఇక్కడ వరకట్న వేధింపులు, నవ వధువుల ఆత్మహత్యలు పూర్తిగా అంతమొందినట్లు ఈ తెగ వారు చెబుతున్నారు.

కాళ్లతో వండి వడ్డిస్తారు!

బిహార్‌లోనే కాదు.. కాలక్రమేణా ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌.. వంటి రాష్ట్రాల్లోనూ ఈ తెగ విస్తరించింది. ఈ తెగ ప్రజల్లో కొందరు మన పొరుగు దేశమైన నేపాల్‌లోనూ స్థిరపడ్డారు. అయితే ఇక్కడి థరు తెగ పెళ్లిళ్లలో ఏళ్లకేళ్లుగా ఓ వింత ఆచారం కొనసాగుతోంది. సాధారణంగా పెళ్లయ్యాక నవ వధువులు తొలిసారి ఏదైనా స్వీట్‌ చేసి అత్తింటి వారి నోళ్లు తీపి చేయడం సహజమే! ఈ పద్ధతిని థరు తెగ ప్రజలు ‘Chala’గా పిలుస్తారు. ఇందులో భాగంగా వధువులు తొలిసారి తమ అత్తింటి వారి కోసం వంట చేస్తారు. అయితే ఇక్కడ వారు తయారుచేసిన పదార్థాన్ని కుటుంబ సభ్యులందరికీ చేత్తోనే అందించినా.. తమ భర్తకు మాత్రం కాళ్లతో అందిస్తారట! నాటి కాలం నుంచే ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు ఇక్కడి వారు చెబుతున్నారు. కొంతమందైతే తమ భర్త కోసం చేసే తొలి వంటను కాళ్లతోనే వండుతారట! నిజానికి ఇలా కాళ్లతో వంట చేసి వడ్డించడమంటే కాస్త కష్టమే! అయితే ఈ కష్టంలోనే తమ భర్తపై ఎంత ప్రేమ దాగుందో అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తుంటారట ఇక్కడి వధువులు. ఏదేమైనా భలే వింతగా ఉంది కదూ ఈ సంప్రదాయం! అంతేకాదు.. ఈ తెగలో కుటుంబ పెత్తనమంతా మహిళలదేనట! ఇలా అటు వరకట్నం పరంగా చూసినా, ఇటు అత్తింట్లో కోడలికిచ్చే అత్యున్నత స్థానాన్ని పరిశీలించినా.. థరు తెగ మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్