ఈ జాబ్స్‌కి వయసుతో సంబంధం లేదు..!

చదువుకు వయసుతో సంబంధముందా అంటే లేదని నిరూపించారు ఎంతోమంది మహిళలు. మరి, కెరియర్‌ను వయసుతో ముడిపెచ్చట్టా అంటే.. కూడదంటున్నారు నిపుణులు. వయసు మీరుతున్నా.. ఆసక్తిని బట్టి ఆయా రంగాల్లో స్థిరపడడానికి ప్రస్తుతం బోలెడన్ని అవకాశాలున్నాయంటున్నారు.

Published : 04 Nov 2023 20:23 IST

చదువుకు వయసుతో సంబంధముందా అంటే లేదని నిరూపించారు ఎంతోమంది మహిళలు. మరి, కెరియర్‌ను వయసుతో ముడిపెచ్చట్టా అంటే.. కూడదంటున్నారు నిపుణులు. వయసు మీరుతున్నా.. ఆసక్తిని బట్టి ఆయా రంగాల్లో స్థిరపడడానికి ప్రస్తుతం బోలెడన్ని అవకాశాలున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో 50 దాటిన మహిళలకు అందుబాటులో ఉన్న కొన్ని ఆదాయ మార్గాలేంటో తెలుసుకుందాం రండి..

టీచింగ్‌పై మక్కువా?

బోధన రంగమంటే చాలామంది మహిళలకు ఆసక్తి ఉంటుంది. అటు ఆదాయంతో పాటు ఇటు గౌరవప్రదమైన వృత్తి కావడమే ఇందుకు కారణం. అయితే వయసులో ఉన్న వాళ్లే కాదు.. కాస్త వయసు మీరుతున్నా టీచింగ్‌లో కొనసాగే మహిళల్ని మనం ఎక్కువగా చూస్తుంటాం. మీకూ ఈ రంగమంటే ఆసక్తా? అయితే దీన్నే మీ ఆదాయ మార్గంగా మలచుకోవచ్చు. ఈ క్రమంలో మీకు నచ్చిన సబ్జెక్ట్‌ను ఎంచుకొని స్కూల్లో టీచర్‌గానైనా చేరచ్చు.. లేదంటే పార్ట్‌టైమ్‌గా ట్యూషన్స్ అయినా చెప్పచ్చు. ఈ రెండూ వద్దనుకున్న వాళ్లు కౌన్సెలర్‌గానైనా చేరచ్చు. తద్వారా పిల్లలకు కెరియర్‌ విషయంలో సలహాలివ్వచ్చు. అయితే వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా.. ఆయా అంశాల్లో వస్తోన్న మార్పుల్ని అవగాహన చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయితే మీ కెరియర్‌ బాగుంటుందని గుర్తు పెట్టుకోండి.

వ్యాపారంలోనూ..!

కొంతమందికి వ్యాపారమంటే మక్కువ ఉంటుంది. కానీ ఉద్యోగం, పిల్లల బాధ్యత, ఇతర వ్యక్తిగత కారణాల రీత్యా అది కుదరకపోవచ్చు. అదే 50 దాటాక ఆయా విషయాల్లో కాస్త ఊరట లభించచ్చు.. ఖాళీ సమయం దొరకచ్చు. మీ అభిరుచులపై దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వంటలు, బేకింగ్‌, క్రాఫ్టింగ్‌, డే-కేర్‌ సర్వీసెస్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌, పెట్‌ సిట్టర్‌.. ఇలా ఆలోచిస్తే బోలెడన్ని మార్గాలు దొరుకుతాయి. ఇవన్నీ కాకుండా.. వ్యక్తిగత అభిరుచినే వ్యాపారంగానూ మలచుకోవచ్చు. ఇలా మీరు తయారుచేసిన ఉత్పత్తుల్ని ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియాలో విక్రయించడం.. లేదంటే ఆఫ్‌లైన్‌ స్టోర్‌ ఏర్పాటుచేసుకోవడం.. మీ ఉత్పత్తులకు వచ్చే ఆదరణను బట్టి ఒక్కో మెట్టూ ఎక్కుతూ వెళ్లొచ్చు.

స్థిరాస్తి రంగంలో అనుభవముందా?

కొంతమంది లేటు వయసులోనూ విభిన్న రంగాల్లో దూసుకుపోదామనుకుంటారు. అలాంటి వారు స్థిరాస్తి రంగాన్ని ఎంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ రంగంలో పూర్తి స్థాయి లేదా పార్ట్‌టైమ్‌గా కొనసాగే మహిళల సంఖ్య 60 శాతానికి పైమాటే అని గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకోవాలనుకునే వారు కమ్యూనికేషన్, నెట్‌వర్కింగ్‌, మార్కెటింగ్‌.. వంటి నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలి. వీటితో పాటు స్థిరాస్తి రంగానికి సంబంధించిన కోర్సులు పూర్తి చేయడం, సంబంధిత అధీకృత సంస్థల్లో పేరు నమోదు చేసుకోవడం, ప్రొఫెషనల్‌ లైసెన్స్‌ పొందడం మంచిది.

ఇంటి నుంచే చేసేయచ్చు!

సాధారణంగా 50 దాటిన మహిళల్లో ఎక్కువమంది ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగావకాశాలకే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. అలాంటి వారికోసం ప్రస్తుతం బోలెడన్ని ఫ్రీలాన్సింగ్‌ జాబ్స్‌ అందుబాటులో ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకున్న నైపుణ్యాల్ని బట్టి కంటెంట్‌ రైటర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, సోషల్‌ మీడియా మేనేజర్‌, వీడియో ఎడిటర్‌, ఈ-మెయిల్‌ మార్కెటర్‌, మొబైల్‌ యాప్‌ డెవలపర్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌.. ఇలా చాలా ఆప్షన్లే ఉన్నాయి. కాబట్టి ఆయా కంపెనీలు అందించే ఈ అవకాశాల్ని అందిపుచ్చుకుంటే తిరుగు లేకుండా ముందుకు దూసుకెళ్లచ్చు. అయితే మీరు ఎంచుకున్న ఆప్షన్‌ని బట్టి అందులో నైపుణ్యాల్ని మెరుగుపరచుకోవడం, కొత్త టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవడం.. వంటివీ కీలకమే!

మనసును చదవగలరా?

మనసులో బాధ ఇతరులతో పంచుకుంటే తగ్గుతుందంటారు. మరి, ఆ బాధ వినేవారెవరు? సమస్యకు తగ్గ పరిష్కారం ఇచ్చే వారెవరు? అది మీరే ఎందుకు కాకూడదు? అదెలా అంటారా? మెంటల్‌ హెల్త్‌ కౌన్సెలర్‌గా మారితే సరి. అవును.. 50 దాటిన వారికి ఇది చక్కటి ఆదాయ మార్గమంటున్నారు నిపుణులు. ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతోన్న ఈ కాలంలో.. ఇలాంటి కెరియర్‌ ఆప్షన్‌ని ఎంచుకుంటే ఇటు మీకు ప్లస్‌ అవుతుంది.. అటు చాలామందికి ఈ మానసిక సమస్యల నుంచి ఉపశమనమూ కలుగుతుంది. అయితే ఇందుకు మీరు చేయాల్సిందల్లా.. దీనికి సంబంధించిన కోర్సులు పూర్తి చేయడం, లైసెన్స్‌ పొందడం.

వీటితో పాటు ఆర్థిక సలహాదారుగా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా, ఈవెంట్‌ ప్లానర్‌గా.. ఆలోచిస్తే ఆదాయ మార్గాలకు కొదవే లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్